వేల ఏళ్ళ మానవ చరిత్రలో ఒక మనిషి జీవితము అత్యల్పము. ప్రతి మనిషి జీవితము తన తర్వాతి తరానికి మరింత మంచి జీవితాన్ని ఇవ్వడానికే ఉపయోగపడాలి. కానీ జరుగుతున్నది వేరు.
మనకున్న ఈ స్వల్ప జీవితకాలాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా? అని ప్రశ్నించుకుంటే ఏమాత్రం సంతృప్తిలేని సమాధానం మనకు ఎదురవుతుంది.
పది డాలర్లు పెట్టి సినిమా చూసి, మూడు గంటలు వృధా చేసి బాగలేదంటూ నిట్టూరుస్తాం. ఆ పది డాలర్లతో పదిమంది పొట్టలు వారం రోజులు నింపవచ్చు. ఎక్కడ సద్వినియోగమవుతుందో తెలుస్తూనే వున్నా దుర్వినియోగం వైపే మనసు ఆరాటపడుతుంది. ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా మళ్ళీ ఇంకోటి మన చిన్నోడికి, కానీ అదే బొమ్మ కడుబీదవాని పిల్లాడికిస్తే వాడి కళ్ళల్లోని మెరుపులు! మనం ఇంతేకదా అనుకునే డబ్బు కూడా మహత్యాలు చేస్తుంది అవసరమయినచోట, కానీ అవసరం లేని చోటే ఆరాటపడుతుంది మనసు.
పుట్టినరోజు వేడుకలు, పెళ్ళి వేడుకలు, దీపావళి, దసరాలు ఎన్నెన్ని వృధా ఖర్చులు. నింపినవాడి పొట్టనే మళ్ళీ నింపుతాం. వేడుకకు రాలేదంటూ మన తోటి వుద్యోగినో, బందువునో నిష్టూరమాడతాం, మన పెళ్ళింటి ముందరే తచ్చాడుతున్న బిచ్చగాన్ని అరిచి తరిమేస్తాం! తినింది అరక్క శరీరమంతా కొవ్వుపేరుకున్న వాని కొవ్వు పెంచడానికి చేసే ఖర్చు సద్వినియోగమా? ఒక్క పూటకైనా సరైన తిండి తిని ఎరుగని అభాగ్యుని ఆకలి తీర్చడానికయ్యే ఖర్చు సద్వినియోగమా?
ఇలాంటి ఖర్చు ఎంత చేయగూడదనుకున్నా మళ్ళీ ఆ వుచ్చులోనే పడ్డాను. తీరినవారి ఆకలే తీర్చడానికి ప్రయత్నం, వున్నవాళ్ళ ముందర వున్నవాళ్ళమనిపించుకోవాలని ఆరాటం. ఎంత ఖర్చు! దానితో కనీసం రెండు గుండెలకు జీవం దక్కేది, లేదా మా వూరికి ఏడాదిపాటు వైద్యం దక్కేది.
ఒక మేడ వున్నవాడు ఇంకో మేడ కట్టడం సద్వినియోగమా? గుడెసైనా లేని వాడికి గుడెసెనివ్వడం సద్వినియోగమా?
సమయమూ అంతే, ఎన్ని పనులున్నా శనివారం వేంకటేశ్వరుని గుడికో, గురువారం సాయిబాబా గుడికో వెళతామే గానీ ఇంటి ముందర పేరుకుపోయిన చెత్తను తీయడానికి అరగంట కేటాయించలేం. సాయిబాబా అంటే గుర్తొచ్చింది.. ఆయన భక్తులు ఆయనకు బంగారు సింహాసనాన్ని చేయిస్తున్నారట! కడు సాధారణంగా ఒక పాడుపడ్డ మసీదులో సాధారణ జీవితాన్ని గడిపిన ఆయనకు కనకపు సింహాసనం కావాలా? ఆయన కోరుకుంటే కూర్చోలేక పోయేవాడా? సాధారణ జీవితాన్ని గడిపిన ఆయన జీవితాన్ని మనం పాటించక, ఆయన బోధలకే విరుద్దంగా ఆయన్ను కనకసింహాసనాలెక్కించి కుబేరులు ఆయన్ను కుబేరుని చేస్తున్నారు, దేవుడున్నాడని చెప్పని బుద్దున్ని దేవున్ని చేసినట్లు! ఆ ఖర్చుతో షిర్డిని సుందరంగా చేస్తే బాబా సంతోషించడా? బీదవాళ్ళకు నివాస గృహాలో, పిల్లలకు పాఠశాలలో, అనాధలకూ వసతులో ఎన్నిలేవు చేయడానికి, ఎన్ని మార్గాలులేవు మనల్ని వ్యక్తీకరించుకోవటానికి? వుహు! ఏ బాబా వీటికి వ్యతిరేకం కాదు కానీ మనం వీటిని చెయ్యం. చేసినా అరకొరగానే!
గుడి బయట సచేతనంగా చేతులు చాపే దేవున్ని కాదని జీవంలేని రాతినే దేవుడని, తినలేని రాయి ముందు తినమని ప్రసాదాలు పెట్టి, మానావమానాలు లేని విగ్రహానికి పట్టువస్త్రాలు కట్టి, ఊరేగింపులు, అగరొత్తుల పరిమళాలు…. ఒకటేమిటి జీవమున్న మనిషి కంటే మిన్నగా చూస్తాం!
వీటన్నిటికి మన విలువైన సమయాన్ని వృధా చేస్తాం!
ముంబయిలో గణేశుడికి 60 కిలోల బంగారు ఆభరణాలట! మురికి వీధుల్లో కూడా ఎత్తైన వినాయకుడు జిగేళ్మంటూ కళ్ళుమెరిపిస్తాడు. వీధిని బాగుచేయాలని ఎవడికీ వుండదు. దానికోసం ఎవ్వరూ చందాలడగరు, అడిగినా ఇవ్వరు, ఇవ్వాలనుకున్నా వాలంటీర్లు దొరకరు!
ఇన్ని పండుగలు చేస్తాం, ఇంత ఖర్చు పెడతాం, ఈ పండుగలకని బోలెడన్ని సెలవులు పెట్టి మరీ పనికొచ్చే పని ఒక్కటీ చేయం. ఎందుకని వీధుల్ని శుబ్రం చేసే పండుగ లేదు? ఎందుకని ఒక్కరోజైనా తల్లిదండ్రులు లేని అనాధకు తిండిపెట్టే పండుగ లేదు? ఎందుకని లేని వాడికి వున్నవాడిచ్చే పండుగ లేదు?
ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే జీవితంలో 99 శాతం వృధా అవుతోంది అనిపిస్తోంది.
— ప్రసాద్
11:54 సా. వద్ద ఆగస్ట్ 30, 2006
ఎందుకని లేని వాడికి వున్నవాడిచ్చే పండుగ లేదు?
రంజాన్ పండగ సందర్భంలో బీదవారికి సహయపడమని ఖురాన్ చెప్తుంది.
మన పుట్టినరోజు నాడు గుడ్డివారితో గడిపి వారి హ్రుదయాల్లో ఆనందాన్ని నింపవచ్చు. ఆ రొజు అనాధ పిల్లల శరణాలయంలో మన పుట్టినరోజు వేడుకలు ఎందుకు జరుపుకోగూడదు?
12:54 ఉద. వద్ద ఆగస్ట్ 31, 2006
నిజమే పండగ వచ్చి వెల్లిన ప్రతీ సారీ నెను ఖచ్చితంగా ఇలాగె ఫీల్ అవుతున్నాను.చిన్నపుడంటె పండగ అంటె సరదా ఇపుడు ప్రతీ పండగ వృధాగా తోస్తోంది.సరదా కి వెడుకకి ఇచ్చే ప్రాధాన్యత అవతలి వారి గురించి ఆలోచించడానికి ఇవ్వట్లేదు. ఒకవేళ అలోచించినా అవి ఆలోచనలగానె మిగిలిపోతున్నాయి..మనం మరింత స్వార్ధ పరులుగా మారిపోక ముందే ఇలా మన అంతరంగం హెచ్చరికలను ఖాతరు చేసి మన అలవాట్లను, పనులను మెరుగు పరుచుకోవాలి..లేకపోతె నిజంగానె రిటైర్ అయ్యాక కుర్చుని చూసుకుంటె ఏమి మిగలదు ఒక్క నిరాశ, నిస్ప్ర్హ తప్ప!!
5:46 ఉద. వద్ద ఆగస్ట్ 31, 2006
సత్య సాయి, మాతా అమృతానందమయి వంటి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు సామాజిక కార్యకలాపాలు చేస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు పాలుపంచుకోవచ్చు. ఇకపోతే భక్తి మూర్ఖత్వం అంటారా …. 🙂
1:34 సా. వద్ద ఆగస్ట్ 31, 2006
రంజాన్‌ను మాత్రం మినహాయించవచ్చు. అయితే అక్కడా ప్రవక్త ఆశించిన స్థాయిలో మాత్రం దానాలు, ధర్మాలు జరగటం లేదు. 10 శాతము ఆదాయాన్ని దానాలకు వుపయోగించమన్నాడు. ముస్లిం అని చెప్పుకొనే ఎంతమంది చేస్తున్నారీపని.
వేలు, లక్షలు ఖర్చుపెట్టి జరిపే వేడుకల్లో ఆ ఖర్చులో 50 శాతమైనా చేరవల్సిన చోటుకు చేరాలి.
నాగరాజా గారూ, మీ ప్రశ్నకు సమాధానం రాయడం మొదలెడితే మరో వ్యాసం తయారయ్యింది. దాన్ని మరో బ్లాగుగా రాశాను.
— ప్రసాద్
2:08 ఉద. వద్ద మే 25, 2007
[…] గారు వ్రాసిన సద్వినియోగం, రవి గారు వ్రాసిన సద్వినియోగము – నా […]