ఇది నారాయణస్వామి గారి కవితా సంపుటి.
తెలంగాణా పల్లె జీవితాల శ్వాస ఇది. యాస వేరేనే గానీ ఆత్మ ఒక్కటే .. అది తెలంగాణా అయినా రాయలసీమ అయినా.. మా ముసలి అవ్వ నా వీపు నిమిరినంత అనుభూతి. వూరికి ఫోను చేసిన ప్రతిసారీ “ఎప్పుడొస్తావు నాయనా” అని అడిగే ఆప్యాయపు పలుకుల్ని ఈ కవిత మళ్ళీ గుర్తు చేసి గుండె తడిని మరింత పెంచింది.
“మల్ల యెప్పుడొస్తవు కొడుక”
యేండ్ల ముచ్చట్లు చెప్పుకోనే
బుద్ది తీరకముందే
బయల్దేరిన
నా చెయ్యిని చేతులల్లకు తీసుకుంది –
గుడ్డి అద్దాల కండ్లెనుక
కుర్వక కుర్వక కుండపోతగ
కురిసిన వానసుంటి
ఆపేక్ష-
ఎన్నో కోల్పోతున్నామనే బాధ మనసును ఎల్లవేళలా మెలిపెడుతూనే వున్నా ఈ స్వామి కవితలు చదివాక నా మనసు పడే బాదకు అక్షర రూపమిదేనా అని మళ్ళీ మళ్ళీ వాటిని తడిమి చూసుకుంటున్నా.
“నీ ల్లు లేవు
బెక బెక కప్పల్లేవు
మునుగుకుంట తేలె
బుడుబుంగల్లేవు”
నేను అమెరికా వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఒక్కసారే ఇండియా దర్శనం వీలయ్యింది. ఆ ముప్పై రోజుల్లో కూడా అరవై పనికిరాని పనులతో ఇండియా కౌగిల్లో నిశ్శబ్దంగా ఒదిగి వూసులాడుకొనే భాగ్యం కలగలేదు. నేను వచ్చేప్పుడు చిన్న పిల్లలుగా వున్న వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు, నన్ను గుర్తుపట్టలేని వారు మా వూర్లోనే చాలామంది అయ్యారు. ఈసారి నా సందర్శనలో నా బావాలు ఎలా వుంటాయో స్వామి గారు నాకు భవిష్యద్దర్శనం చేయించారు ఈ “అంజాన్” కవితలో.
“పేగు తెంచుకున్న నేల మీద
పెంచుకున్న ఎనలేని ప్రేమతో
రాలాను…”
….
నాకోసం నిద్రమాని
‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నా
….
నా ప్రేయసి
నా ముందు నుంచే హడావుడిగా
అటూ ఇటూ నడిచిపోయింది.
ఉరుకులతో పరుగులతో
నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో
నేను పోల్చుకోలేని ముఖాల మెరుపులతో
సర సరా జారిపోయింది.
నావైపు చూసే తీరిక లేదు
చూసినా గుర్తు పట్టలేదు.”
ఇలా ఈ కవిత మొత్తం చదువుతున్నంత సేపూ నా ప్రియమైన నెచ్చలి నాకు దూరమైన బాధలాగే గుందెను మెలిపెట్టింది.
“గాల్లోకి ఎగిరాక గానీ” కవిత చదువుతుంటే ఏ ప్రవాసుడికైనా కన్నులు చెమ్మగిల్లక మానవు.
“వణుకుతున్న చేతులతో
ముఖాన్ని తడిమిన
మట్టి ఆత్మీయత
అర్థం కాదు”
ఇక తుపాకుల మోతల మద్య మోడులైన జీవితాల గురించి రాసిన కవితలు మరీ బాగున్నాయి.
“వేకువ-సంధ్య” కవితలో
“చెప్పలేని
దిగులు వ్యధతో
చలిని కప్పుకు వణికిన
ఒక రెండు చేతుల రాత్రి-”
నాకు అమెరికా వచ్చిన తొలినాళ్ళలో ఇంటి తాళంచెవిలేక, సహ రూమ్మేట్లు ఇంటిలో లేక వాళ్ళు వచ్చేవరకు ఇంటివెనుక బాల్కనిలో చేతులూ కాళ్ళూ పొట్టలోకి ముడుచుకొని తూట్లుపొడిచే చలినుంచీ కాపాడుకొనే విశ్వప్రయత్నం గుర్తుకొచ్చింది.
ఇక “అపరిచితం” లో
“కలధూళి ఎగిసి
కన్నీరు గరగరలాడకుండా
నల్లని రే-బాన్ గ్లాసెస్ పెట్టచ్చు
రాత్రి
నిద్రలేమి కత్తులై కోయకుండా
ఎలక్ట్రిక్ హీటర్లలో
మొహం దాచుకోవచ్చు”
సహజత్వం లేని వస్తుజీవితాలని గుర్తుచేసింది.
“ఒక్క ముచ్చట” తెలంగాణా వుద్యమానికి మోసం చేసి పబ్బాలు గడుపుకొనే రాజకీయనాయకులకు హెచ్చరిక చేస్తుంది.
ఎంత చెప్పినా ఈ కవితలన్నీ చదివితీరాల్సినవి. శివారెడ్డి గారు, ఎన్.వేణుగోపాల్ గారు తమ ముందుమాటల్లో చక్కగా వివరించారు.
— ప్రసాద్
12:29 ఉద. వద్ద ఆగస్ట్ 30, 2006
నిజంగా గుండెని మెలిపెట్టే బాధ.
ఇండియా లో ఐన వాళ్ళందరికి దగ్గరగా ఉన్న మేమే పల్లెటూళ్ళని, చిన్ననాటి మనుషుల్ని కోల్పోతున్నామని బాధ పడుతూ ఉంటాం.
ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో.
ఎదైనా మన జీవన ప్రాధామ్యాలని బట్టి ఉంటుంది కాబోలు దేని కోసం దేన్ని కొల్పోతున్నాం అని.
అన్నట్టు ఒక చిన్న విషయం మీ బ్లాగ్ లొ కొన్ని సార్లు “దర్షనం” “సందర్షన” ఇలాంటి అక్షర దోషాలున్నాయి.
కొంచం శ్రమ తీసుకుని సరి దిద్దండి.
1:42 సా. వద్ద ఆగస్ట్ 31, 2006
స్వాతి గారూ,
అది పొరపాటు కాదు అలవాటే! దోషం తెలుసుకున్నాను.
కృతజ్ఞతలు.
— ప్రసాద్
11:36 ఉద. వద్ద సెప్టెంబర్ 5, 2006
chalaa chalaa baagaa vundi.
dileep
1:20 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2006
వందేమాతరం! వందేమాతరం!
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం !
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం !
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం !
వందేమాతరం! వందేమాతరం!