11 వ తారీఖు

ఆగస్ట్ 16, 2006

చదువరి బ్లాగు చూశాక అనిపిస్తోంది ఈ “Al queda” కి 11 వ తారీఖు మంచి రోజేమొ అని. ఇక నుంచి భద్రతను ఆగష్టు 15 లేదా జూలై 4 న పెంచకుండా ప్రతి నెలా 11 వ తారీఖు భద్రతను పెంచాలేమొ!
సెప్టెంబర్ 11, మార్చి 11, జూలై 11.
మొన్నటికి మొన్న బ్రిటన్ లో అరెస్టులు జరక్కపోయి వుంటే వాళ్ళు కూడా ఆగష్టు 11 న తమ పని కానిచ్చేవాళ్ళేమొ అని నాకనిపిస్తోంది. ఈ ఆలోచన ఇంటెలిజెన్స్ వాళ్ళకు వచ్చిందో లేదో!

స్వాతంత్ర్యము

ఆగస్ట్ 15, 2006

ఎన్ని శవాల గుట్టల మీదుగా నడిచింది!
ఎందరు మహానుభావుల ఆయువులను బలిగొంది!
ఎందరు నవ వధువుల తాళిబొట్లను తెంచింది!
ఎందరి కన్నభూమిని వారికి కాకుండా చేసింది!

నేడే వారి ఆత్మలకి శాంతి దినం.
మనకు స్వాతంత్ర్య దినం!

(http://news.bbc.co.uk/1/shared/spl/hi/pop_ups/06/south_asia_india0s_partition/html/1.stm)

నమ్మకం

ఆగస్ట్ 14, 2006

 “యజ్ఞాలు, యాగాలు మరియు
పూజలు ఎందుకు వీటిని
నమ్మవచ్చా?” ప్రశ్నకు నా సమాధానం.

దయ్యం పట్టిందని నమ్మేవాడికి భూతవైద్యుడే సరైన వైద్యం. మా తాత ఒక కథ చెప్పేవాడు. ఒకడు తెల్లవారుజామున దొడ్డికి ఆరుబయలు వెళ్ళినప్పుడు ఓ తొండ తనవైపే పరుగెట్టుకొచ్చి, తన కాళ్ళ మధ్య మాయమైపోయిందట. అప్పట్నుంచి వాడీకి కడుపులో ఏదో దేవినట్లు, తొండ తిరుగుతున్నట్లు అనిపించి మంచం పట్టేశాడట. ఎన్ని వైద్యాలు, మందులూ వాడినా వాని రుగ్మతలను నయం చేయలేక పోయాయి.
చివరికి ఒక తెలివైన మాంత్రికుడు తను నయం చేస్తానని ఒక బయలు ప్రదేశానికి తీసుకువెళ్ళి, ఏవో నోటికి వచ్చిన మంత్రాలు పఠించి దొడ్డికి కూర్చోమన్నాడట. వాడలా ముక్కుతూనే ముందే తెచ్చుకున్న సంచీలోంచి వాడికి తొండను బయటికి తోలి, అదిగో నీ కడుపులో తొండ వెళ్ళిపోతోంది చూడు అన్నాడట. అంతే వీడి కడుపు నొప్పి, తిరుగుడు దెబ్బతో పోయి మళ్ళీ మామూలు మనిషయ్యాడట.

మరి మంత్రం పని చేసిందా లేదా?

పని చేసేది మంత్రం, పూజలూ కాదు; నమ్మకం. రాతిని దేవుడని నమ్మినా అది ఎన్నో జీవితాలను మార్చట్లా? నరకం వుంటుందని నమ్మే వాళ్ళకు అవసాన దశలో యముడు కనపడట్లా? కృష్నుడే దేవుడని, అల్లా నే దేవుడని, క్రీస్తే దేవుని కుమారుడని ఎవరెట్లా నమ్మినా, నమ్మకమే సత్యం, నమ్మబడిందసత్యం. నీవెంత గాఢంగా నమ్మితే పలితం అంత దృఢంగా వుంటుంది.

( ఇప్పుడు దశమ గ్రహం కూడా వుందని అంటున్నారు పరిశోధకులు. మన పూర్వీకులు పండితులే, కానీ మన తాతలు తాగిన నేతుల వాసన మన మూతులకు అంటదు కదా!)

తెలుగు దురభిమానం 3

ఆగస్ట్ 11, 2006

“కలిసి వుంటే కలదు సుఖము” అనేది తిరుగులేని సత్యము. అది నేను చెప్పినా, అమెరికన్ చెప్పినా, అంబనాధ్ చెప్పినా. అది “పాత చింతకాయ పచ్చడి” అన్నంత మాత్రాన సత్యము అసత్యమైపోదు.
ఇక కలిసి వుండటంలో వున్న కష్టాలు, బార్యాభర్తలు కలిసి వున్నప్పుడూ వుంటాయి. అయితే విడిపోయినప్పటి కష్టాలకంటే తక్కువే. ఒక్కసారి కన్నడ, ఉత్కళ, తమిల, ఆంద్ర దేశాలను వూహించుకోండి. కావేరి యుద్దము, కృష్నా యుద్దము, పోలవరం యుద్దం ఇలా ఇప్పటికి అందరమూ నీటికోసం యుద్దాలు చేస్తూ వుండేవాళ్ళం. తెలుగు వాళ్ళు అమెరికాకి, తమిళులు సింగపూర్ కి శ్రీలంకకి, ఈశాన్య రాష్ట్రాలు చైనాకి కొమ్ము కాసి యుద్దాలో, ప్రక్షన్న యుద్దాలో చేసుకుంటు వుండేవాళ్ళం. పరువు, ప్రతిష్ట, గుర్తింపు అనేవి మానవ జీవితాలకంటే గొప్పవి కావు. స్వేచ్చను ఇందులోంచి మినహాయించవచ్చు.
ఇక ప్రత్యేక తెలుగు రాజ్య భావన కొస్తే అసలిది పూర్వమెప్పుడూ లేదనే అనిపిస్తుంది. రాజులు తమకు సాద్యమయినన్ని రాజ్యాల్ని లోబరుచుకొంటూ సామ్రాజ్యాల్ని ఏర్పరచడానికి ప్రయత్నించారేగానీ బాషను బట్టి రాజ్యాలు లేవు. అలాగే మాతృబాష తులు అయినా రాయలు తెలుగుకే తన పట్టము కట్టాడు. అసలు మొన్న మొన్నటి వరకూ మద్రాసుకు తరలిపోయిన తెలుగువారు తమ దేశాన్ని వదిలి పరాయి దేశానికి వెల్తున్నామను కొన్నారా?
అయితే ఈ ఖండమంతా అధిక కాలం వేర్వేరు రాజ్యాలుగా వున్నా, ఆచారాల వల్ల, గురువుల వల్ల దీన్నంతటిని ఏక ఖండంగానే భావించారు. ఆది శంకరాచార్యులు కేరళకే పరిమితం కాలేదు. కాకపోతే ఇప్పుడు ఆంగ్లం చేస్తున్న పని అప్పుడు సంస్కృతం చేసింది. “హంపీ నుండి హరప్పా దాకా” పుస్తకంలో వేర్వేరు భాషల వారు పరిచయవాక్యాలు సంస్కృతంలో జరుపుకొని ఆ తర్వాత ఇద్దరికీ తెలిసిన భాషలో మాట్లాడుకొనేవారని చెప్తారు రచయిత. అలాగే వక్త గానీ, ప్రవక్త గానీ పరాయి భాష వాడని ఆదరించకపోవటం పరాయి దేశస్తుడుగా భావించడం మనకు పూర్వం నుండీ లేదు. మన తెలుగు వాడు త్యాగయ్య తమిళులకు ఆరాద్యదైవమయ్యాడు కదా! అలాగే షిరిడి సాయిబాబా మన ఇంటి దైవం కాలేదా?
మన సంస్కృతిలో మతాన్ని ఆద్యాత్మిక చింతనకీ, భాషను దైనందిన జీవితావసరంగా వాడుకొన్నారే గానీ, దాన్ని బట్టి మేము ప్రత్యేకమనే పొడ వున్నట్లుగా నాకనిపించదు.
ఈ “తెలుగు జాతి”కి పశ్చిమ దేశాల వారు “జాతి”కి ఇచ్చిన గుణాలన్నీ వున్నా, మనం జాతిని విడిగా నిర్వచించుకోవాల్సిందే. మన భరతజాతికి అంతర్లీనంగా వున్న ఏకాత్మత పశ్చిమీయులకు అర్థం కాదు. ఈ రాజకీయ విభజనలన్నీ బ్రిటిష్ వాడి వల్లైతేనేమి, స్వాతంత్ర్యకాంక్షవల్లైతేనేమి, మనకందరికీ ఆంగ్లేయుడు వుమ్మడి శత్రువు కావడం వల్లైతేనేమి, పటేల్ పట్టుదల వల్లైతేనేమి ఒకటయ్యాం. దీన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించాలేగానీ పూర్వమెప్పుడు మేము కలిసిలేమని ఇప్పుడూ కలిసి వుండమంటే ఎలా?
ఈ అంబనాధే చూడండి SAARC చట్రం కింద దక్షిణాసియా రాజ్యాలన్నీ కలిసి వుండాలంటూనే, డిల్లీ చట్రం కింద వుండనంటారు. కొత్తగా ఏ దేశం సభ్యరాజ్యాలనుండీ వుద్బవించినా దాని ప్రత్యేక అనుమతి లేకుండానే అది సార్క్ సభ్యదేశమయిపోవాలంటారు. బలం లేని SAARC తాడుతో కట్టివేయాలని చూసే ఈయన, బలమైన భరతరాజ్య బావనకు మాత్రం తూట్లు పొడవాలంటారు. (మీ, నా అనుమతి లేకుండానే మనల్ని తెలుగు జాతీయవాదుల్ని చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!)
ఇక తెలుగు వారికి జరుగుతున్న న్యాయమేదైనా వుంటే దాన్ని కలిసివుండే ఎదుర్కోవాలి. విడిపోవడానికి లక్ష కారణాలు వున్నా, కలిసి వుండాటానికి ఒక మంచి కారణం చాలు. కలిసివుండటానికే నేనిష్టపడతాను.

దేవుడు రాశాడా?

ఆగస్ట్ 11, 2006

“మన జీవితం మన చేతులొ వుంది
అనడం ఒప్పా ?
ముందుగానె  దెవుడు
వ్రాస్తాడు అనడం ఒప్పా ?”
ఈ ప్రశ్నకు నా స్పందన.

ప్రతి క్రియకు ఓ నిర్దిష్ట పలితాన్ని దేవుడు రాశాడు లేదా ప్రకృతి రాసింది. పలాయన వేగం కంటే తక్కువ వేగంతో పైకి విసిరిన ప్రతిదీ కిందికే పడుతుంది. అది విసిరింది సత్య సాయిబాబా అయినా, నేనయినా. ఆటంబాంబో, హైడ్రోజన్ బాంబో వేస్తే అందరూ చస్తారు, పుణ్యం చేసిన వాడైనా, పాపం చేసిన వాడైనా. అది ప్రకృతి నియమం. రాయబడింది ఈ నియమాలే, మన జీవితాలు కాదు. విద్యుత్తీగను పట్టుకోవడమా, మానడమా అన్నది మన చేతుల్లోనే వున్నది అయితే పట్టుకున్నాక మరణించడమన్నది ప్రకృతి (అనగా దేవుడు) చేతుల్లో వుంది. దేవుడు చేతుల్లో ఏముందో అది సత్యము, మార్చ లేనిది, మార్పు లేనిది, పక్షపాతము లేనిది. మన ఋషుల మాటల్లో చెప్పాలంటే ఈ సత్యమే దేవుడు. గుణరహితమనే గుణమున్నవాడు దేవుడు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, తంత్రాలు, మంత్రాలు ఈ ప్రకృతి నియమాల్ని మార్చవు.
కాబట్టి దేవుడు రాసిందేదో రాసేశాడు, అది నీకు ఒకలా, నాకు ఒకలా రాయడు. ఎండ నిన్నెలా కాలుస్తుందో నన్నూ అలానే. అన్నం నీకెలా ఆకలిని తీరుస్తుందో నాకూ అలానే. వెన్నెల నీకెలా కాస్తుందో నాకూ అలానే. ఇందులో పక్షపాతం లేదు. ఆస్తికుడు, నాస్తికుడు అన్న భేదం లేదు.
మన జీవితం మనం రాసుకొనేదే. నీ చేతిలో రాయితో నీ తలకేసికొట్టుకుంటావో, నా తలకేసి కొడతావో అది నీ చేతిలో వుంది, అది నీవు రాసింది; దేవుడు రాసింది కాదు. ఎవడి తలకేసి కొడితే వాడి తల పగలాలి అని మాత్రమే దేవుడు రాశాడు.

గమనించారా!

ఆగస్ట్ 8, 2006

తెలుగు TV చానల్లలో వచ్చే ఏ ప్రకటనలోనూ తెలుగు ముఖాలే కనపడవు. ఆ మాటకొస్తే దక్షణాది ముఖాలే కనపడవు. అమెరికాలో అయితే తక్కువున్న నల్లవారి ముఖాలే ప్రకటనల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
“అందంగా లేనా
అసలేంబాగా లేనా ..” అని పాడాలనిపిస్తోంది. పనిగట్టుకొని వెతికినా ఒక్క పదహారణాల తెలుగు పిల్ల కానీ పిల్లాడు కానీ కనపడరు. ఈ ఉత్తరాది ముఖాలకి తెలుగు మాటల్ని అతికిస్తుంటే చాలా ఎబ్బెట్టుగా వుంటున్నాయి. సబ్బులు, క్రీములు, పెన్నులు, పెన్సిల్లు, కార్లు ఏ ప్రకటన చూసినా అంతా వుత్తరాది ముఖాలే!
అమ్మో, అంబనాధ్ చూస్తే ఇది హిందీ వాళ్ళ కుట్ర అంటాడేమొ.
మరయితే మన తెలుగు వాళ్ళే తీస్తున్న, తెలుగు వాళ్ళే చూస్తున్న ఈ తెలుగు సినిమాల్లో కూడా అంతా ఉత్తరాది వాసనే. సినిమాకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తున్నా అంతా పైనుంచే దిగుమతి అవుతున్నారు. శ్రీదేవి లాంటివాల్లని ఎగుమతి చేశాక ఇప్పుడు దక్షణాది చతికిల పడ్డట్టుంది.
“గోదావరి” ఎంత బాగుంది! సినిమా అండి. నది ఏం బాలేదిప్పుడు అందరినీ ముంచుతోంది. రాజమండ్రి, బద్రాచలం, పాపి కొండలు, గోదావరి ఇసుక తిన్నెలు అంతా బాగుంది. అమ్మాయి కూడా బాగుందనుకోండి కానీ బెంగాలీ అట కదా! తెలుగు ఆడ పిల్లలకి ఇంత కొరతా!

ఇది పరాకాష్ట

ఆగస్ట్ 7, 2006

 నిన్న జెమిని టివీలో “బంగారం మీకోసం” చూస్తున్నాను. అందులో ఒక ప్రశ్న “Sun flower” పువ్వుని తెలుగులో ఏమంటారు అని!

మన జీవిత కాలంలోనే ఇలాంటి క్విజ్ ప్రశ్నలు ఇంకా వినాల్సి వస్తుంది కాబోలు! జెమిని వాళ్ళ తర్వాతి “బంగారం మీకోసం” కార్యక్రమానికి ఈ క్రింది ప్రశ్నలు చేరిస్తే తెలుగు భాషను ఇంకా వుద్దరించిన వారిమవుతామేమొ 😦

1) మమ్మీ ని తెలుగులో ఏమంటాము?

2) thanks చెప్పాలంటే తెలుగులో ఏమనాలి? sorry అనగా ఏమి?

3) ఉగాది అనే పండుగను ఎందుకు చేసుకొనేవాళ్ళం?

— ప్రసాద్

భలే మంచి అవకాశం!

ఆగస్ట్ 4, 2006

వాళ్ళు దిక్కరించారు గనక మేమూ దిక్కరిస్తాం. వాళ్ళు అగ్గిలో దూకారు గనక మేమూ దూకుతాం. ఇదీ ఇప్పుడు మన నాయకుల వరస. గణేష్ నిమజ్జనానికి తెలంగాణా అవతరణకూ ముడిపెడుతున్న ఈ నరేంద్ర అందరినీ తలదన్నేశారు. ఒద్దురా నాయనా సాగర్ కాలుష్యమైపోతోంది అంటే వైస్రాయ్ హోటల్ చేయట్లేదా అంటాడు, మక్కా మసీదులోపలే చేయకుండా బయట నమాజు చేసి హైకోర్టును దిక్కరించలేదా అంటున్నాడు. ఈయన TRSలో చేరినా RSS వాసనలు పోవట్లేదు. ఈ RSS వాసన అంటుకున్నవాళ్ళకు అది ఆజన్మాంతమూ వుంటుంది. కాకపొతే నరేంద్ర దాన్ని తెలంగాణకు అన్వయిస్తే అంబనాధ్  తెలుగు నాడు కి అన్వయిస్తారు అంతే తేడా. ఇప్పుడు మతాభిమానాన్ని తెలంగాణా వేర్పాటువాదానికి ఎంత చక్కగా వాడుకోవాలనుకుంటున్నాడో చూడండి. మత కల్లోలాలూ జరగొచ్చు అంటూ ముందే వంద శాతం నిజాయితీతో మూర్ఖంగా పనిచేసే మత పిచ్చి గాల్ల ని ఉసిగొల్పడానికి సిద్దమవుతున్నాడు. అడ్డుపడుతున్నది కోర్టు, అక్కడే గణేషుని ముంచుతామంటున్నది మీరు మద్యలో ఈ మత కలహాలు ఎందుకు రావాలి? ముస్లిములు అడ్డుపడలేదే!
రాముడు మునిగిపోతాడని ప్రాజెక్టులు కట్టొద్దు, కాలుష్యమవుతుందని నిమజ్జనము ఆపొద్దు. ఏం హుస్సేన్ సాగర్ లోనే ముంచమని అలిగాడా వినాయకుడు?

ఆత్మలను పలికించేదే (సినారె గీతం)

ఆగస్ట్ 4, 2006

ఆత్మలను పలికించేదే
అసలైన భాష ||ఆత్మలను||
ఆ విలువ కరువైపోతే
అది కంఠ శోష ||ఆత్మలను||

వేదం ఖురాను బైబిల్
వీధిలోన పడతాయా
మతమేదైనా ఒకటేలే
ప్రతి మనిషి శ్వాస ||ఆత్మలను||

అవినీతికి పీఠం వేసి
అభ్యుదయం పూడ్చిన జాతి
ఇకనైనా కళ్ళు నులుముకో
ఇది రక్త ఘోష ||ఆత్మలను||

నానాటికి ఏమీ పతనం
నాలో ఒక తీరని మధనం
ప్రభుత్వాలు ఏమైతేనేమి
పైసాపై ధ్యాస ||ఆత్మలను||

తల నెరిసి పోతే దిగులు
తను వూరి పోతే దిగులు
అది దిగులు కాదు సినారె
తుది జీవితాశ ||ఆత్మలను||

— ప్రసాద్

ఏవో ఏవొ బాధలు (సినారె గీతం)

ఆగస్ట్ 4, 2006

ఏవో ఏవొ బాధలు
భరించె మూగ జీవితం ||ఏవో ఏవొ||
ఎన్నో ఎన్నో గీతలు
భరించె తెల్ల కాగితం ||ఏవో ఏవొ||

శతకోటి హితకోటి వున్నా
గత వైభవం చాటుతున్నా
ఎంతో ఎంతో వేదన
సహించె మాతృభారతం ||ఏవో ఏవొ||

చిరునవ్వు జలతారులున్నా
సరదాల రహదారులున్నా
అయినా అయినా లోకమే
అనంత శోకపూరితం ||ఏవో ఏవొ||

కొరలేని తత్వార్థమున్నా
భువిలోని వృత్తాంతమైనా
అయినా అయినా కావ్యమా
అనున్న కల్పనామృతం ||ఏవో ఏవొ||

తన గొంతు తడియారుతున్నా
మును ముందు ఏ కొండలున్నా
ఏరై పారే జాతికే
సినారె గీత అంకితం ||ఏవో ఏవొ||

— ప్రసాద్