అంజాన్

ఆగస్ట్ 30, 2006

(రచయిత అనుమతితో నాకు బాగా నచ్చిన కవిత “సందుక” నుండి)

తలపై
రెండు నిండు మట్టికుండలతో

అరచేతుల్లో
ఎగరడానికి సిద్దంగా ఉన్న పక్షిపిల్లలతో

దూదిమబ్బుల
నీలినీటి ఆకాశం తెరలపైన తేలుతూ

పేగు తెంచుకున్న నేల మీద
పెంచుకున్న ఎనలేని ప్రేమతో
రాలాను…

విమానం కిటికీల్లోంచి
కింద
వంటి మీద
కొత్త కొత్త నగల్తో కొత్త కొత్త వలువలతో
కొంగ్రొత్త చూపుల్తో
నా నగరం…

నా ఆదిమ ప్రేయసి!

నాకోసం నిద్రమాని
‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నా.

తెగిపోయిన నా రెక్కల్ని
సుతిమెత్తని చేతులతో నిమిరి
నా భుజాలకు అతికిస్తుందనుకున్నా.

నేను మోసుకొచ్చినవన్నీ
తనివితీరా తడిమి
అతి జాగ్రత్తగా
చీరకొంగులో పొదుపుకుంటుందనుకున్నా.

ఏడేళ్ళ నవ్వుల్నీ
పచ్చి నెత్తుటి కన్నీరు మరకలనీ
కాళ్ళ కింద నలిగిపోయిన పసిరెక్కలనీ
వాడిపోయిన కళ్ళనీ వేలాదిగా రాలిపోయిన పూలరెమ్మలనీ
ఏకబిగిన ఏకరువు పెట్టి ఊపిరాడనీయదనుకున్నా!

నేలకు దిగిన విమానంలా
వంటరిగా దిగాలుగా
నేను

నా ప్రేయసి
నా ముందు నుంచే హడవుడిగా
అటు ఇటూ నడిచిపోయింది.

ఊరుకులతో పరుగులతో
నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో
నేను పోల్చుకోలేని మూఖాల మెరుపులతో
సరసరా జారిపోయింది.

నావైపు చూసే తీరికలేదు
చూసినా గుర్తుపట్టలేదు.
అర్ధరాత్రి వర్షపు చీకట్లో పారేసుకున్న
ఉంగరంలా
జరజరా దొర్లిపోయింది.

యుగాలుగా
తన ఎడతెరిపి లేని దుఃఖ బీభత్స ప్రేమ ప్రవాహంలో
మునిగిన నన్ను
ఏడేళ్ళ ఎదబాటుతోనే పూర్తిగా మర్చిపోయింది.

నా ఊపిరి తేమలోని వెచ్చదనాన్నీ
నా పెదవుల ముద్దులోని ఉప్పదనాన్నీ
నా కౌగిలింతలోని చెమటవాసననీ

తానెన్నడూ ఎరగనట్టే
ఎడమొఖమై అంజాన్ కొట్టింది

నేనే మనసుండబట్టలేక
గ్యాపకాల సుడిగాలులతో పిలిచినా
రెండు చేతులూ విరగబూసి చాచినా
ఎవరు నువ్వు అన్నట్లుగా
ఎకసెక్కెపు చూపుల్ని విసిరి పారేసింది.

మట్టినీటి కుండలు పగిలి
రెక్కలు రాని పక్షి ఈకలు చెదిరి
నేల మీద కలలను ఏరుకుంటున్న
నన్ను

దారికడ్డం లెమ్మంటూ
నూకేసి విసవిసా పోయింది.

నిలువునా తడిసి ముద్దైన నేను

స్పర్ష మరిచిన
ప్రేయసి తడి లేని చూపుల ముందు

నాకు నేనే అజ్ఞబీని!

(రచన: నారాయణస్వామి)

 

 

సద్వినియోగము

ఆగస్ట్ 30, 2006

వేల ఏళ్ళ మానవ చరిత్రలో ఒక మనిషి జీవితము అత్యల్పము. ప్రతి మనిషి జీవితము తన తర్వాతి తరానికి మరింత మంచి జీవితాన్ని ఇవ్వడానికే ఉపయోగపడాలి. కానీ జరుగుతున్నది వేరు.
మనకున్న ఈ స్వల్ప జీవితకాలాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా? అని ప్రశ్నించుకుంటే ఏమాత్రం సంతృప్తిలేని సమాధానం మనకు ఎదురవుతుంది.
పది డాలర్లు పెట్టి సినిమా చూసి, మూడు గంటలు వృధా చేసి బాగలేదంటూ నిట్టూరుస్తాం. ఆ పది డాలర్లతో పదిమంది పొట్టలు వారం రోజులు నింపవచ్చు. ఎక్కడ సద్వినియోగమవుతుందో తెలుస్తూనే వున్నా దుర్వినియోగం వైపే మనసు ఆరాటపడుతుంది. ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా మళ్ళీ ఇంకోటి మన చిన్నోడికి, కానీ అదే బొమ్మ కడుబీదవాని పిల్లాడికిస్తే వాడి కళ్ళల్లోని మెరుపులు! మనం ఇంతేకదా అనుకునే డబ్బు కూడా మహత్యాలు చేస్తుంది అవసరమయినచోట, కానీ అవసరం లేని చోటే ఆరాటపడుతుంది మనసు.
పుట్టినరోజు వేడుకలు, పెళ్ళి వేడుకలు, దీపావళి, దసరాలు ఎన్నెన్ని వృధా ఖర్చులు. నింపినవాడి పొట్టనే మళ్ళీ నింపుతాం. వేడుకకు రాలేదంటూ మన తోటి వుద్యోగినో, బందువునో నిష్టూరమాడతాం, మన పెళ్ళింటి ముందరే తచ్చాడుతున్న బిచ్చగాన్ని అరిచి తరిమేస్తాం! తినింది అరక్క శరీరమంతా కొవ్వుపేరుకున్న వాని కొవ్వు పెంచడానికి చేసే ఖర్చు సద్వినియోగమా? ఒక్క పూటకైనా సరైన తిండి తిని ఎరుగని అభాగ్యుని ఆకలి తీర్చడానికయ్యే ఖర్చు సద్వినియోగమా?
ఇలాంటి ఖర్చు ఎంత చేయగూడదనుకున్నా మళ్ళీ ఆ వుచ్చులోనే పడ్డాను. తీరినవారి ఆకలే తీర్చడానికి ప్రయత్నం, వున్నవాళ్ళ ముందర వున్నవాళ్ళమనిపించుకోవాలని ఆరాటం. ఎంత ఖర్చు! దానితో కనీసం రెండు గుండెలకు జీవం దక్కేది, లేదా మా వూరికి ఏడాదిపాటు వైద్యం దక్కేది.
ఒక మేడ వున్నవాడు ఇంకో మేడ కట్టడం సద్వినియోగమా? గుడెసైనా లేని వాడికి గుడెసెనివ్వడం సద్వినియోగమా?
సమయమూ అంతే, ఎన్ని పనులున్నా శనివారం వేంకటేశ్వరుని గుడికో, గురువారం సాయిబాబా గుడికో వెళతామే గానీ ఇంటి ముందర పేరుకుపోయిన చెత్తను తీయడానికి అరగంట కేటాయించలేం. సాయిబాబా అంటే గుర్తొచ్చింది.. ఆయన భక్తులు ఆయనకు బంగారు సింహాసనాన్ని చేయిస్తున్నారట! కడు సాధారణంగా ఒక పాడుపడ్డ మసీదులో సాధారణ జీవితాన్ని గడిపిన ఆయనకు కనకపు సింహాసనం కావాలా? ఆయన కోరుకుంటే కూర్చోలేక పోయేవాడా? సాధారణ జీవితాన్ని గడిపిన ఆయన జీవితాన్ని మనం పాటించక, ఆయన బోధలకే విరుద్దంగా ఆయన్ను కనకసింహాసనాలెక్కించి కుబేరులు ఆయన్ను కుబేరుని చేస్తున్నారు, దేవుడున్నాడని చెప్పని బుద్దున్ని దేవున్ని చేసినట్లు! ఆ ఖర్చుతో షిర్డిని సుందరంగా చేస్తే బాబా సంతోషించడా? బీదవాళ్ళకు నివాస గృహాలో,  పిల్లలకు పాఠశాలలో, అనాధలకూ వసతులో ఎన్నిలేవు చేయడానికి, ఎన్ని మార్గాలులేవు మనల్ని వ్యక్తీకరించుకోవటానికి? వుహు! ఏ బాబా వీటికి వ్యతిరేకం కాదు కానీ మనం వీటిని చెయ్యం. చేసినా అరకొరగానే!
గుడి బయట సచేతనంగా చేతులు చాపే దేవున్ని కాదని జీవంలేని రాతినే దేవుడని, తినలేని రాయి ముందు తినమని ప్రసాదాలు పెట్టి, మానావమానాలు లేని విగ్రహానికి పట్టువస్త్రాలు కట్టి, ఊరేగింపులు, అగరొత్తుల పరిమళాలు…. ఒకటేమిటి జీవమున్న మనిషి కంటే మిన్నగా చూస్తాం!
వీటన్నిటికి మన విలువైన సమయాన్ని వృధా చేస్తాం!
ముంబయిలో గణేశుడికి 60 కిలోల బంగారు ఆభరణాలట! మురికి వీధుల్లో కూడా ఎత్తైన వినాయకుడు జిగేళ్‌మంటూ కళ్ళుమెరిపిస్తాడు. వీధిని బాగుచేయాలని ఎవడికీ వుండదు. దానికోసం ఎవ్వరూ చందాలడగరు, అడిగినా ఇవ్వరు, ఇవ్వాలనుకున్నా వాలంటీర్లు దొరకరు!
ఇన్ని పండుగలు చేస్తాం, ఇంత ఖర్చు పెడతాం, ఈ పండుగలకని బోలెడన్ని సెలవులు పెట్టి మరీ పనికొచ్చే పని ఒక్కటీ చేయం. ఎందుకని వీధుల్ని శుబ్రం చేసే పండుగ లేదు? ఎందుకని ఒక్కరోజైనా తల్లిదండ్రులు లేని అనాధకు తిండిపెట్టే పండుగ లేదు? ఎందుకని లేని వాడికి వున్నవాడిచ్చే పండుగ లేదు?
ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే జీవితంలో 99 శాతం వృధా అవుతోంది అనిపిస్తోంది.
— ప్రసాద్

సందుక

ఆగస్ట్ 29, 2006

ఇది నారాయణస్వామి గారి కవితా సంపుటి.
తెలంగాణా పల్లె జీవితాల శ్వాస ఇది. యాస వేరేనే గానీ ఆత్మ ఒక్కటే .. అది తెలంగాణా అయినా రాయలసీమ అయినా.. మా ముసలి అవ్వ నా వీపు నిమిరినంత అనుభూతి. వూరికి ఫోను చేసిన ప్రతిసారీ “ఎప్పుడొస్తావు నాయనా” అని అడిగే ఆప్యాయపు పలుకుల్ని ఈ కవిత మళ్ళీ గుర్తు చేసి గుండె తడిని మరింత పెంచింది.

“మల్ల యెప్పుడొస్తవు కొడుక”

యేండ్ల ముచ్చట్లు చెప్పుకోనే
బుద్ది తీరకముందే
బయల్దేరిన
నా చెయ్యిని చేతులల్లకు తీసుకుంది –

గుడ్డి అద్దాల కండ్లెనుక
కుర్వక కుర్వక కుండపోతగ
కురిసిన వానసుంటి
ఆపేక్ష-

ఎన్నో కోల్పోతున్నామనే బాధ మనసును ఎల్లవేళలా మెలిపెడుతూనే వున్నా ఈ స్వామి కవితలు చదివాక నా మనసు పడే బాదకు అక్షర రూపమిదేనా అని మళ్ళీ మళ్ళీ వాటిని తడిమి చూసుకుంటున్నా.

“నీ ల్లు లేవు
బెక బెక కప్పల్లేవు
మునుగుకుంట తేలె
బుడుబుంగల్లేవు”

నేను అమెరికా వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఒక్కసారే ఇండియా ద‌ర్శనం వీలయ్యింది. ఆ ముప్పై రోజుల్లో కూడా అరవై పనికిరాని పనులతో ఇండియా కౌగిల్లో నిశ్శబ్దంగా ఒదిగి వూసులాడుకొనే భాగ్యం కలగలేదు. నేను వచ్చేప్పుడు చిన్న పిల్లలుగా వున్న వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు, నన్ను గుర్తుపట్టలేని వారు మా వూర్లోనే చాలామంది అయ్యారు. ఈసారి నా సంద‌ర్శనలో నా బావాలు ఎలా వుంటాయో స్వామి గారు నాకు భవిష్యద్ద‌ర్శనం చేయించారు ఈ “అంజాన్” కవితలో.

“పేగు తెంచుకున్న నేల మీద
పెంచుకున్న ఎనలేని ప్రేమతో
రాలాను…”
….

నాకోసం నిద్రమాని
‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నా

….

నా ప్రేయసి
నా ముందు నుంచే హడావుడిగా
అటూ ఇటూ నడిచిపోయింది.

ఉరుకులతో పరుగులతో
నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో
నేను పోల్చుకోలేని ముఖాల మెరుపులతో
సర సరా జారిపోయింది.

నావైపు చూసే తీరిక లేదు
చూసినా గుర్తు పట్టలేదు.”

ఇలా ఈ కవిత మొత్తం చదువుతున్నంత సేపూ నా ప్రియమైన నెచ్చలి నాకు దూరమైన బాధలాగే గుందెను మెలిపెట్టింది.

“గాల్లోకి ఎగిరాక గానీ” కవిత చదువుతుంటే ఏ ప్రవాసుడికైనా కన్నులు చెమ్మగిల్లక మానవు.
“వణుకుతున్న చేతులతో
ముఖాన్ని తడిమిన
మట్టి ఆత్మీయత
అర్థం కాదు”

ఇక తుపాకుల మోతల మద్య మోడులైన జీవితాల గురించి రాసిన కవితలు మరీ బాగున్నాయి.

“వేకువ-సంధ్య” కవితలో
“చెప్పలేని
దిగులు వ్యధతో
చలిని కప్పుకు వణికిన
ఒక రెండు చేతుల రాత్రి-”
నాకు అమెరికా వచ్చిన తొలినాళ్ళలో ఇంటి తాళంచెవిలేక, సహ రూమ్మేట్లు ఇంటిలో లేక వాళ్ళు వచ్చేవరకు ఇంటివెనుక బాల్కనిలో చేతులూ కాళ్ళూ పొట్టలోకి ముడుచుకొని తూట్లుపొడిచే చలినుంచీ కాపాడుకొనే విశ్వప్రయత్నం గుర్తుకొచ్చింది.
ఇక “అపరిచితం” లో
“కలధూళి ఎగిసి
కన్నీరు గరగరలాడకుండా
నల్లని రే-బాన్ గ్లాసెస్ పెట్టచ్చు

రాత్రి
నిద్రలేమి కత్తులై కోయకుండా
ఎలక్ట్రిక్ హీటర్లలో
మొహం దాచుకోవచ్చు”

సహజత్వం లేని వస్తుజీవితాలని గుర్తుచేసింది.

“ఒక్క ముచ్చట” తెలంగాణా వుద్యమానికి మోసం చేసి పబ్బాలు గడుపుకొనే రాజకీయనాయకులకు హెచ్చరిక చేస్తుంది.

ఎంత చెప్పినా ఈ కవితలన్నీ చదివితీరాల్సినవి. శివారెడ్డి గారు, ఎన్.వేణుగోపాల్ గారు తమ ముందుమాటల్లో చక్కగా వివరించారు.

— ప్రసాద్
 

ఉత్తమ జీవితమా X వ్యర్థ జీవితమా?

ఆగస్ట్ 29, 2006

కొంతమంది మాట్లేడే ఉత్తమ జీవితం (Quality life) నాకసలు అర్థం కాదు. నిజానికది వ్యర్థజీవితమని నా అభిప్రాయం. అమెరికా జీవితాన్నే తీసుకుంటే ఒక ఇంటికీ మరో ఇంటికీ బోలెడంత దూరం. కనీసం కాసిన్ని టమోటాలు కావాలన్నా కారేసుకొని అధమం రెండు మైళ్ళు వెళ్ళందే కూరగాయల కొట్టు రాదు. పది మైళ్ళ లోపు పని చేసే కార్యాలయం వుంటే అది ఎంతో దగ్గరున్నట్లు. మరీ విచిత్రమేమంటే వ్యాయామం చేయటానిక్కూడా అర లీటరు పెట్రోలు తగలెట్టి కారులో వెళ్ళి అక్కడ మళ్ళీ పది యూనిట్లు విద్యుత్తు  తగలేస్తే కానీ శరీరానికి ఉత్తమ వ్యాయామం లభించినట్లు కాదు.
Quality Life పేరుతో చేస్తున్నదంతా పరమ వృధా! నేను రోజు వెళ్ళే రైల్వే స్టేషను లో ఒక sign board ఇలా అంటుంది. గడిచిన వందేళ్ళలో 130 ట్రిలియన్ గాలన్లో బ్యారళ్ళో పెట్రోలు తాగేశాం, అంత పెట్రోలు మరో ముప్పై ఏళ్ళలోనే తాగేయబోతున్నాం కనుక పొదుపు పాటించండి అని. ఈ తాగేయడంలో అమెరికా వాళ్ళ quality life 90 శాతం తాగి వుంటుంది. మొత్తం ప్రపంచానికీ చెందాల్సిన వనరులు అవసరం లేకున్నా చేతిలో పవరుంది, డబ్బుంది గదాని వనరుల్ని నాశనం చేసి భూగోళాన్ని చెత్తకుండి కింద మారుస్తున్నాం.
స్కూలు 20 మైళ్ళు, ఆఫీసు 30 మైళ్ళు, కూరగాయలు వగరా కొట్టు అధమం 2 మైళ్ళు, డాక్టరు 10 మైళ్ళు, బట్టల కొట్టు 15 మైళ్ళు, తెలిసిన దగ్గరి మితృడి ఇంటికి వెళ్ళాలంటే 5 మైళ్ళు …. భూమింది కదాని రోడ్లేసుకొని, ఎక్కడెక్కడో ఇళ్ళు కట్టేసుకొని .. అవసరమా ఇంత దూరాలు? దేవుడిచ్చిన కాళ్ళను కాదని మనిషి తయారుచేసిన కార్ల కాళ్ళు లేనిదే కదలలేని దౌర్భాగ్యం! వారానికి 30 లీటర్లు మన పిల్లలకు మిగిలిస్తామో లేదో తెలియకుండా కాల్చి భూమిని బూడిద కొట్టుగా, గనుల రంద్రాల పుట్టగా మార్చడం అవసరమా?
వాడి పారేయి (Use and throw) అనేది మన quality people తారక మంత్రం. వాడి పారేసి ఈ భూమిని చెత్తకింద మార్చేసి మళ్ళీ అదే చెత్త వాసన అంటకుండా AC రూముల్లో, కలుగుల్లో ఎలుకల్లా అవసరమా ఈ జీవితాలు?
ఒక్కసారి తిని పారేసే చెంచాలు, కప్పులు, తట్టలు, సంచులు ఎంత వ్యర్థం తయారు చేస్తున్నారు ఉత్తమ జీవితాలు గడుపుతున్నామనే వ్యర్థులు. మనం మన తరవాతి తరానికి సంపదలివ్వకపోతే మానె కనీసం ఈ వ్యర్థాన్ని ఇవ్వకపోతే మన జీవితాలు ఎంత సార్థకమవుతాయి.
మునుపటి జీవితాలే చక్కగా వుండేవి కాదూ!  మట్టి ముంతలు, మూకుళ్ళు, కుండలు, చట్లు, బానలు అవేవీ ఇప్పుడు. ఖనిజాలన్నీ వాడేస్తున్నాం రేపటి గురించి ఆలోచించకుండా!
అప్పుడెప్పుడొ Matrix సినిమా చూసినప్పుడు అందులో వాడంటాడు ..మానవులు భూమికి పట్టిన వైరస్ అని. ఈ ఒక్కమాట చాలు మనం భూమికి ఇతర జీవాలకీ చేస్తున్న హాని గురించి చెప్పాలంటే.

 

వందే మాతరం

ఆగస్ట్ 29, 2006

జాతిని ఒక్కటిగా నిలపాల్సిన జాతీయ గీతాలు జాతిని వేరు చేయటానికి మూలాలుగా వుపయోగించుకొనటం విచారించాల్సిన విషయం.
భక్తి, ఆరాధన అనేవి స్వయంగా ఎవరికి వారికి రావాలే గానీ బలవంతంగా మెడలు వంచితే వస్తుందా? వందేమాతరం మేము ఆలాపించం అంటే బలవంతంగా ఆలాపింపజేస్తే దేశభక్తి హృదయంలో పరిమళిస్తుందా?
అయితే ఆలాపించడానికి అబ్యంతరాలు సామాన్య ముస్లిములనుండీ గాకుండా ఉలేమాలనుండీ రావడం, దానికి భాజపా మరింత ఆవేశపు రంగులద్దడం అనర్థదాయకం.
ఎవరి మతం వారిది, ఎవరి దోవ వారిది, ఎవరి పిచ్చి వారిది. వాడి మతం మనకు పిచ్చి, మన మతం వాడికి పిచ్చి. ఎవడిది పిచ్చో, ఎవడిది కాదో చెప్పేందుకు ఎవరూ అర్హులు కాదు. ఎవడి పిచ్చి వాడిదని ఎంతగా సరిపెట్టుకున్నా, వాడి పిచ్చి మన పిచ్చినో, మన పిచ్చి వాడి పిచ్చినో వెక్కిరిస్తేనే అసలు సంగ్రామం మొదలవుతుంది.

అశృతర్పణం

ఆగస్ట్ 22, 2006

ఆ మహా స్వరార్చకుడు మనల్ని వీడి వెళ్ళాడు.
అప్పుడెప్పుడో గొల్లపూడి రాసిన ఒక వ్యాసం చదివి కాశీ కంటూ వెళితే విశ్వనాధున్ని కాదుగానీ బిస్మిల్లా ఖాన్ గారినే దర్శించుకోవాలి, అర్చించుకోవాలి అనుకొన్నా. నా కోరిక తీరనిదైపోయింది. ఎన్నో రాగాలూదిన శ్వాస శాశ్వతంగా మూగపోయింది. ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా స్రవిస్తూనే వున్నాయి నా కన్నులు.

Americans are now recognizing the tricolor flag with wheel at the center

ఆగస్ట్ 18, 2006

NASDAQ celebrates India's Independence Day

bmp చిత్రాన్ని wordpress కి ఎగుమతి చేయలేకపోయాను. పెద్దబొమ్మ చూడాలంటే నా వెబ్‌సైటు చూడండి.

దేవుడు అని ఎవరిని చూపించాలి? (Who is God?)

ఆగస్ట్ 18, 2006

 దేవుడు అని ఎవరిని చూపించాలి? అని అభిరాం అడిగిన ప్రశ్నకు నాకిలా సమాధానం చెప్పాలనిపించింది. కానీ ఎందుకో “అభిరాం” లో comments section పని చేయట్లేదు. మీరన్నట్లు మనిషి సృష్టించిన దేవుళ్ళలో మనిషి బుద్దులు వుండటంలో వింతలేదు.

 కానీ పిల్లలకి దేవుడెవరంటే మదర్ థెరిసాను చూపండి, మహాత్మా గాంధీని చూపండి. కూలిపోతున్న భవనంలోకి ప్రజల ప్రాణాలను కాపాడ్డానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన 300 పైగా అగ్నిమాపకదళ సభ్యులను చూపండి. 25 మందికి పైగా పిల్లలను, పెద్దలను వరదనుంచి కాపాడి విద్యుధాగాథానికి బలైన ఆ అభాగ్యున్ని చూపండి. దేవుడి గదిలో వీళ్ళ ఫోటోలు పెట్టండి. ఆపదలో వున్న వాన్ని ఆదుకున్నవాడు, ఆకలితో వున్నవానికి ఇంత అన్నం పెట్టినవాడు, బాధలో వున్నవాన్ని ఓదార్చినవాడూ వీళ్ళందరూ దేవుళ్ళే. ఎదురుగా సాయం చేసిన వాన్ని దేవుడని తలవక, దేవుడే నిన్ను పంపించాడని ఆకాశం వంక చూడటం మూర్ఖత్వం.

పాలిచ్చే ఆవు, వెలుగిచ్చే సూర్యుడు ( ఆమాటకొస్తే సర్వ శక్తులూ సూర్యుడినుంచే వస్తున్నాయి), పంటనిచ్చే భూమి, నీరిచ్చే నది ఇవే అసలైన దేవతలు. సప్తాశ్వాల రధంపై వూరేగే సూర్యున్ని దేవుడిగా చూపక్కర లేదు. ఉదయ బింబాన్ని చూపి నమస్కరిస్తే చాలు. నమస్కరించడం, గౌరవించడం మన సబ్యత.

నమస్కరించినా, నమస్కరించకపోయినా సూర్యుడు వెలుగివ్వకా పోడు, పారే నది నీరివ్వకా పోదు, వీచే గాలి ప్రాణవాయువివ్వకా పోదు, రొమ్ము కొరికినా అమ్మ పాలివ్వకా పోదు. అదే అవ్యాజమైన ప్రేమ, unconditional love. మాతా అమృతానందమయి (hugging saint)ని మీరు ఎందుకు ప్రేమిస్తారు అని అడిగితే ఆమె ఇలాగే సమాధానం చెప్పింది. సూర్యుడు ఎందుకి వెలుగిస్తాడు? నది ఎందుకు నీరిస్తుంది? అది వాటి గుణం, తత్వం అలానే ప్రేమించటం నా గుణం, దీనికి కారణం అక్కరలేదు అని. ఒక సందర్భంలో ధర్మరాజు కూడా ఇలానే అంటాడు. హిమాలయాలంటే నాకిష్టం. ఎందుకంటే నాకు తెలియదు. ఇష్టపడటానికి కారణం అక్కరలేదు అని. ఇలా ఎవ్వరయితే ప్రతిగా ఏమీ ఆశించకుండా ఫలం ఇస్తూ వుంటారో వాళ్ళందరూ దేవతలే.

మీరు సింగిలా? (Are you single?)

ఆగస్ట్ 17, 2006

అనిల్ రాసిన“మీరు సింగిలా?” చదివాక అక్కడ నా వాఖ్య రాద్దామని మొదలు పెడితే ఇంత అయ్యింది. 

ఇంతకీ అమెరికాలో మీరు సింగిలా అనడానికి “Are you married” అనేది సరిపోదు గనక. married, మరియు unmarried అనేవి మాత్రమే options అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. పెళ్ళి చేసుకోకుండా కలిసి కాపురం చేసుకొనేవారే ఎక్కువ. పెళ్ళి అయి విడాకులు తీసుకున్నవారు, పెళ్ళామో, మొగుడో చనిపోయిన వారు కూడా సింగిలే.
మీకు పెళ్ళయిందా?
అయి వుంటే, పెళ్ళాం మీతోనే వుందా?
విడాకులిచ్చారా? చచ్చి పోయిందా?
ఇలాంటి ప్రశ్నలు అడక్కుండా మీరు సింగిలా? అంటే సరిపోతుంది.
ఇంకోమాట. మనము ఇంతకుముందు జోకులేసుకొనేవాళ్ళం.
మీకు పెళ్ళయిందా?
లేదు.
పిల్లలెంతమంది? వెంటనే అవతలి వారు చెంప చెళ్ళుమనిపిస్తారు.

లేదా
మీకు పిల్లలెంతమంది?
ఇద్దరు.
మీకు పెళ్ళయిందా? వెంటనే అవతలి వారు చెంప చెళ్ళుమనిపిస్తారు.

కానీ ఇప్పుడు అమెరికాలో ఇలాంటి ప్రశ్నలు official forms అన్నింటిలోనూ వుంటాయి.

అంతే కాదు.
Are you male/female? అని అడిగాక
Is your spouse male/female? అని కూడా అడుగుతారు.
ఎందుకంటే boolean algebra లో 0, 1 కి వున్న నాలుగు combinations లోనూ పెళ్ళిళ్ళవుతాయి గనుక.
ఈ confusion కి తోడు శీల మార్పిడి (sex మార్పిడి) చేయించుకున్న వాళ్ళతో మన సమస్య అంతా ఇంతా గాదు. నిన్నటి వరకు boy friend అయినవాడు ఇప్పుడు girl friend అవుతాడు.
ఇద్దరు పిల్లలున్న Daddy ఇప్పుడు ఆడదయిపోతే ఆ పిల్లలు అతన్ని…ఛీ ఛీ ఆమెని ఏమని పిలవాలి?

ఆ మద్య ఒకాయిన నేను FDCలో పని చేస్తున్నప్పుడు “ఆమె” అయ్యాడు.
అప్పటి వరకు వెళ్తున్న మగవాళ్ళ దొడ్డికి(Toilet) వెళ్ళలేడు, పోనీ అట్లాగని మొన్నటి వరకు మగవాడు గనుక ఆడవాళ్ళ దొడ్డికి వెళ్ళలేడు. ఇక సెక్సును బట్టి తేడా చూపగూడదు గనుక అతనికోసం FDC Family restroom కట్టించింది. అందులోకి ఒక్కసారి ఒక్కరే వెళ్ళచ్చు.

స్వలింగ పెళ్ళిళ్ళు రాజ్యాంగబద్దమని వాదిస్తున్నారు స్వలింగ సంపర్కులు. వాళ్ళ స్వలింగ పెళ్ళిళ్ళలో జోక్యం చేసుకోవడం లింగబేదం చూపడమేనని, అది రాంజ్యాంగవిరుద్దమని వాదిస్తున్నారు.

రేపు కుక్కనో, పిల్లినో పెళ్ళి చేసుకొని ఇది కూడా రాజ్యాంగబద్దమే, ఇది రాంజ్యాంగమిచ్చిన వ్యక్తి స్వేక్ష అంటే కాదనగలమా?

ఆధ్యాత్మికం

ఆగస్ట్ 16, 2006

పుణ్యాత్ముని మరియు దుర్మార్గుని పట్ల డేవుడు ఒకే పక్షపాతం చూపిస్తాడా?
చూపిస్తాడు. అసలు దేవుడికి పుణ్యం, పాపం తెలియవు. ఎండ, గాలి, వెన్నెల అందరినీ ఎలా సమానంగా చూస్తాయో దేవుడూ అట్లానే. వెన్నెల అందరికీ ఒకేలా కాచినా కవికి కనిపించినంత అందంగా పామరుడికి కనిపించకుంటే భేదం మనిషి మనసులో వుందే గానీ దేవుడిలో లేదు.

పాప పుణ్యాల కర్మ పలితాలు తర్వాతి జన్మలకు అనుసరిస్తాయా?
ఏ కర్మ పలితం ఆ జన్మకే పరిమితం. ఈ రోజు మనం చేసిన ఒక పుణ్యకార్యం (పూజలూ, వ్రతాలూ పుణ్యకార్యాలు కాదు) రేపు మనకు మేలు చేయవచ్చు. ఎలాగంటే, అప్పుడెప్పుడో ఒకనికి మా నాన్న సహాయపడ్డాడని ఈ రోజు అతను నాకు సహాయపడటం. ఆ రోజు మా నాన్న చేసిన పుణ్యం ఈ రోజు నాకిలా లబ్ది చేకూర్చిందన్నమాట. అలాగే పాపమూనూ, అప్పుడెప్పుడో నీవు కొట్టిన వాడు ఈ రోజు interview boardలో సబ్యుడుగా వుంటే నీవు పాపపలితం అనుభవించక తప్పదు. ఇలా మనం చేసిన పాపపుణ్యాల పలితాలు మనమో, మన పిల్లలో ఈ భూమిమీద అనుభవించాల్సిందే తప్ప తర్వాతి జన్మలూ లేవు..అనుసరించే తతంగమూ లేదు.

అసలు పునర్జన్మలంటూ ఉన్నాయా?
మానవ జన్మే అన్ని జన్మలకూ వున్నతమయింది అయితే, మానవ జన్మే ముక్తి మార్గానికి అనుకూలమయిందయితే మని మానవ జన్మలు స్థిరంగానైనా వుండాలి లేదా తగ్గాలి గానీ ఇలా పెరుగుతూ ఎలా పోతాయి?సంబోగము, అండోత్పత్తి, ప్రసవము, జీవము ఇవన్నీ ఈ పేద్ద ప్రకృతి ప్రోగ్రాంలో ఒక బాగం. ఆ script ప్రకారం అన్నీ అలా జరుగుతూ వుంటాయి. శరీరం నశించడం తోనే శరీరానికున్న చలన స్వబావమూ, ఆలోచించే తత్వమూ అన్నీ నశిస్తాయి. పంచ భూతాలతో ఏర్పడిన శరీరము పంచ భూతాలతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన వన్నీ మళ్ళీ recycle చేయబడతాయి అయితే అలా recycle చేయబడి ఉత్పత్తి కాబడ్డ వస్తువుకి ఏవిదంగానూ తన ముందుతరపు గుణాలంటే ప్రశ్నే లేదు.

ఏది పాపం? ఏది పుణ్యం?
మహా భారత సూక్తిలా “నీకేది బాధ కలిగిస్తో అది ఇతరులకు చేయక పోవటం, నీకేదీ హాయినిస్తుందో అది ఇతరులకూ పంచటం” పుణ్యం.”నీకు బాధ కలిగించేది ఇతరులకు తలపెట్టడం పాపం.”

జన్మ యొక్క పారమార్థికత ఏమిటి?
జన్మించిన తర్వాత ఏమి చేసినా, ఏమీ చేయకున్నా ప్రకృతి మాత్రం తనపని తను చేస్తూనే వుంటుంది. శరీరం నశిస్తుంది, చలనత్వం పోతుంది.చచ్చే ముందు తర్వాతి తరం వారి జీవితాలను మరింత సుఖమయం చేయగలిగే ఏపని చేసినా జన్మ యొక్క పరమార్థం సిద్దించినట్లే.

మోక్షం అనగా ఏమిటి? అది ఎలా సిద్దిస్తుంది?
జన్మ, పునర్జన్మ చక్రం లోంచి బయట పడటం మోక్షమంటాయి వేదాలు. బయటపడి నాకు నేను మోక్షం పొందితే మానవ జన్మలు ఆగిపోవే! మానవులు పుడుతూనే వుంటారు, కష్టాలు పడుతూనే వుంటారు. వేదాల లెక్కన మనం మోక్షం పొందితే కష్టాలు పడే మానవులకి ఆసరా అందించకుండా తప్పుకున్నవాళ్ళమవుతాం.జీవితకాలంలో చేసిన మంచి పనులవల్ల ఆత్మతృప్తి కలిగి మరణించేటప్పుడు సంతృప్తిగా మరణిస్తే అది మోక్షం కలగడం. ఆ చిట్టచివరి తృప్తి తర్వాత ఏమీ లేదు.

ఇహ లోకంలో లేని స్వర్గనరకాలు పరలోకంలో ఉన్నాయా?
లేవు. అన్నీ ఇక్కడే వున్నాయి. దావూద్ లాంటి వాళ్ళు తప్పులు చేసి తప్పించుకొంటున్నామనుకుంటే పొరపాటే.

ఒకసారి శివుడుకీ, శనికీ ఏదో గొడవ వచ్చిందట. నీవు నన్నేమీ చేయలేవు అన్నాడు శివుడు. నేను తలుచుకుంటే నిన్నైన ముప్పతిప్పలు పెట్టగలనన్నాడు శని. అలా వాదించుకున్నాక ఏదీ నన్నేం చేస్తావో చూస్తానంటూ కైలాసం వదిలి ఒక భయంకరమైన అడివిలో ఓ చెట్టు తొర్రలో నివాసమున్నాడట కొన్నాళ్ళు, అక్కడైతే శని తనని కనిపెట్టలేడని.ఒక వారం తర్వాత బయటకొచ్చి శనిని పిల్చి నీవు నన్నేమీ చేయలేకపోయావు అన్నాడు. అందుకు శని “నా ప్రభావం లేనిదే నీవు చల్లని కైలాసం వదిలి చెట్టు తొర్రలో నక్కావా?” అన్నాడట.అలా అజ్ఞాతంలో, భయం నీడలో బతకడం కూడా ఒక నరకమే. ఆతని పాప పలితాలు అతని పిల్లలనీ చుట్టుకుంటాయి తర్వాత.

వివిధ మతాలు మనిషిలో పాపభీతి కలిగించుటలో ప్రవక్తల, సాదు జనుల, దైవావతారుల అంతర్లీన భావ మేమిటి?
శిక్ష వుంది అంటేనే తప్పు చేయడం మానే పిల్లల్లాంటివారు అధికమంది ప్రజలు గనుక. తప్పుకు కఠిన శిక్షలు అందుకే. పాపమూ లేదు, పునర్జన్మా లేదు, అంటి వచ్చేదీ లేదు అంటే ఏ తప్పుచేసినా కోర్టూ లేదు, తీర్పూ లేదుజైలూ లేదు అనడం లాంటిది. ప్రతి తప్పునూ చూడటానికి ప్రతి ఒక్కడి వెంటా ఒక పోలీసును ఎళ్ళవేళలా వుంచలేము. అదే భయమనే పోలీసును అతడి మనసులోనే పెడితే అదే కాపాడుతుంది తప్పును చేయనివ్వకుండా.

డేవుడు నిర్వికారుడూ, నిర్గుణాకారుడా?
దేవుడు నిర్వికారుడే. కానీ గుణం లేకపోవటమనే గుణమున్నవాడు. మనిషికి అవసరానికి అబద్దమాట్లాడటమూ తెలుసు. కానీ దేవుడికి ఎళ్ళవేళలా సత్యం మాట్లాడమే వచ్చు. గుణముంది, అదే సత్యమే మాట్లాడాలన్నది కానీ విచక్షణ లేదు. రోజూ వర్షం కురిసే చోట “ఈరోజు వర్షం కురుస్తుంది” అన్నది వార్త ఎలా కాదో, విచక్షణ లేక ఎన్ని గుణాలున్నా గుణహీనుడే.

అతని పేరు మీద భజనలు, భక్తి, తంత్రాలు, మంత్రాలు అవసరమా?
అస్సలవసరం లేదు.
దేవుడు భజనలకీ, పూజలకీ, వ్రతాలకీ లొంగడు. “7 habits of highly effective people లో ఈ కథ వుంది.

సముద్రమంతా పొగమంచు కమ్ముకొని వుంది. ఎక్కువ దూరం కనిపించటం లేదు. ఇంతలో నౌక కెప్టన్‌కి వార్త వచ్చింది. దూరంగా ఏదో లైటు వెలుగుతోంది, ఏదో నౌకలా వుంది అని.
కెప్టెన్: అది కదులుతూ వుందా స్థిరంగా వుందా?
నావికుడు: కదలటం లేదు నిశ్చలంగా వుంది.
కెప్టెన్: 20 డిగ్రీలు పక్కగా కదలమని సమాచారమివ్వు. లేకుంటే డీకొట్టుకొనే ప్రమాదముంది.
నావికుడు: డికొట్టుకొనే ప్రమాదముంది. 20 డిగ్రీలు పక్కకు జరగండి.
అటువైపునుండి: మీరే 20 డిగ్రీలు పక్కకు మరలండి.
కెప్టెన్: నేను నౌక కెప్టెన్ చెప్తున్నాను, 20 డిగ్రీలు పక్కకు జరగండి.
అటువైపునుండి: నేనూ అధికారినే, మీరే పక్కకు జరగండి.
కెప్టెన్: మాది సైనిక ఓడ. పక్కకు జరగక పోతే పర్యవసానం ఎదుర్కోవాల్సివుంటుంది, పక్కకు జరగండి.
అటువైపునుండి: ఇది దీప స్థంబము (light house).

ఇక కెప్టెన్ అయినా నౌకలో వుండేది దేశాద్యక్షుడైనా పక్కకు జరగాల్సిందే. దీప స్థంబము పక్కకు జరగదు. దేవుడూ అంతే పూజలూ, వ్రతాలూ, యజ్ఞాలూ, యాగాలూ ఏమీ చేయలేవు.
భజన అన్య విషయాల మీద మనసు పోకుండా వుంచుతుంది. అచంచలమైన భక్తి ఒక భ్రాంతిలో ముంచుతుంది. తంత్రాలూ, మంత్రాలూ ఆ బ్రాంతిని చేరుకోవడానికి సాధనాలవుతాయి. ఇవన్నీ కూడా ఎవరికి వారు తమదైన బ్రాంతిని నిర్మించుకొని అందులో జీవితాన్ని నిష్పలంగా ముగించడానికి తప్ప పరులకు ఉపయోగపడేదేమీలేదు. పరులకు వుపయోగపడని ఏ పూజా, కర్మా కూడా నిష్పలం. పిల్లవాడు బొమ్మలతో ఆటాడుకొన్నట్లు.

ఏది అసలైన దైవ సేవ?
నరసేవే నారాయణ సేవ. జీవి సేవే పరమాత్మ సేవ.”live let live”

అసలు పాపభీతితో దైవసేవ చేయటం అవసరమా?
రామనాధ రెడ్డి అన్నట్లు, గూండాను భయంతో మొక్కినట్లే పాపభీతితో దైవసేవ చేయటం. ఎవరికి వారు జవాబుదారీ. ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలుసు. చేసేది చేసి ఆనక తప్పు చేశాను క్షమించమంటే క్షమించడానికి దేవుడు మనిషి కాదు.