Archive for the ‘వర్తమానం’ Category

ఇదీ మన భారతీయం!

జూలై 13, 2006

సెప్టెంబర్ 11 తర్వాత కోలుకోవటానికి అమెరికాకు ఎన్ని రోజులు పట్టింది?
మాడ్రిడ్ దాడి తర్వాత ఇటలీకి ఎన్ని రోజులు పట్టింది?
లండన్ లో రైళ్ళు, బస్సుల మీద దాడి తర్వాత ఆ దిగ్బ్రమ నుండి తేరుకోవటానికి ఎన్నాళ్ళు పట్టింది?

ఖచ్చితంగా ఒక్క రోజు మాత్రం కాదు.

అదే మన ముంబయి చూడండి. ఒక్కరోజులో ఏమీ జరగనట్టు, రక్తం మరకలు కడిగేసి, పాడైన బోగీల్ని తుక్కు కింద పడేసి మళ్ళీ ఎంత చక్కగా జీవన ప్రయాణం సాగిస్తున్నామో!
చచ్చినవాళ్ళ కర్మ అలా చావాలని ఉంది గనక చచ్చారని సరిపెట్టుకుంటున్నాం. లేకుంటే ఇది మనకు కొత్తా, ఎన్ని బాంబు దాడులు జరగలేదు? ఎంత మంది చావ లేదు?
అయినా చావు దేహానికే గానీ ఆత్మకు కాదని మనకు తెలియదా ఏంటి? మరణం ఎంత అనివార్యమో మళ్ళీ జననమూ అంతే అనివార్యమనే సంగతి అనాది నుంచీ మనకు తెలుసు. అందుకే వీటిని నివారించాలనుకోవటం వొట్టి పనికిమాలిన పని. అసలు కర్మ అలా వున్నప్పుడు ఆపడం మన తరమా! ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లోనే వేల మంది చని పోతున్నారు, ఈ వంద మందీ, రెండొందల మందీ ఒక లెక్కా?
ఈ కర్మ సిద్దాంతాన్ని మనం ఎంత ప్రసిద్దం చేస్తే ప్రపంచంలో అంత శాంతి నెలకొంటుంది. ఎవరి చావుకు ఎవరూ కారణం కాదు, అన్నిటికీ వారి వారి కర్మలే కారణం. ఇది తెలియక జార్జి బూషయ్య ఎంత కుంపటి రగిల్చాడు!! ఆప్ఘనిస్తాను, ఇరాకు రావణ కాష్టాలయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెలు ఈ కర్మ సిద్దాంతము ఎప్పుడు నేర్చుకుంటుందో! ఒక సిపాయిని అపహరిస్తే బడబాగ్నులు కురిపించాలా? అది అతని కర్మని సరిపెట్టుకోక? ఇద్దరు సిపాయిల్ని తీవ్రవాద మూక అపహరించిందని ఏకంగా లెబనాన్ ముట్టడా? రామ రామ! మనల్ని చూసి వారెంతో నేర్చుకోవాలి. ఆ మద్య మన పక్కనున్న బుల్లి బంగ్లాదేషు సైనికులే మన సైనికుల్ని అపహరించి, మొహాలు చెక్కేసి, కిరాతకంగా చంపి పారేస్తే, వారి కర్మ అలా కాలిందని ఊరుకోలేదా?? మన విమానాన్ని హైజాకు చేసి ఆఫ్ఘనిస్తాను నుండీ రాయబారాలు చేస్తే, మనం ఎవరిమీదనైనా ఒక్క తూటా పేల్చామా? తాలిబాన్లని ఒక్కమాట అన్నామా? అది మన రాత అని సరిపెట్టుకొని, మన మంత్రివర్యులే వాళ్ళడిగిన వాన్ని వెంటబెట్టుకొని అప్పజెప్పి రాలేదా?
ఈ ఇజ్రాయెలు ఎప్పుడు నేర్చు కుంటుందో!!
సెప్టెంబర్ 11 దెబ్బకి మళ్ళీ అలాంటిది .. చిన్న బాంబు దాడి కూడా అమెరికాలో జరగలేదు. మన దేశంలో మాత్రం మళ్ళీ మళ్ళీ ఇవి జరుగుతున్నాయంటే మన చేతకానితనం, మన నేతల చేతకానితనం ఎంత మాత్రం కాదు! మన ప్రారబ్దం అంతే!

సెప్టెంబర్ 11 దాడుల తర్వాత స్టాకు బజార్లు కుప్పకూలాయి, విమాన సంస్థలు చేతులెత్తేశాయి. కాని మనం అలాంటి వాటికి జడుస్తామా! ఇలాంటి దాడులు మనల్ని ఏమీ చేయలేవు మన కర్మ అలా వుంటే తప్ప! మన కర్మను ఊహిస్తున్న వాళ్ళంతా ఇంకో పది పదిహేను ఏళ్ళల్లో మనం అగ్రరాజ్యమవుతామంటున్నారే! అందుకే మన స్టాకు బజారు ఉరకలు తీస్తోంది.

భళారే భారతీయం!

ఎంత ఘోరం! (eMta GOraM)

జూన్ 15, 2006

ఎంత ఘోరం!
ఉన్మాదుల ఉన్మత్తం చూడండి. యముడి యమపాశపు కర్ఖశత్వము చూడండి. ఆవిరవుతోన్న ఆయుష్షు చూడండి. జీవానికి, నిర్జీవానికీ నిలువురేఖ చూడండి. ఇదిగో ఈ యుద్దభూమి చూడండి. చిన భూషయ్య రగిల్చిన అగ్నిగుండమిది చూడండి.
చేతకాని తనంతో గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా అయిన వాళ్ళ కాని వాళ్ళ మాటల్ని పెడచెవిన పెట్టి బుష్ రగిల్చిన మారణహోమం ఇది.

కాలి పోతున్న ఇరాక్!

ప్రాణబయంతో నూరంతుస్తుల మీదనుండి దూకి ప్రానాలొదిన దృశ్యాల కంటే ఈ దృశ్యము ఏ విదంగానూ తక్కువది కాదు. ఒక అమాయక ఇరాకీ ప్రాణం ఒక అమాయక అమెరికన్ ప్రాణం కంటే ఏ విధంగానూ తక్కువది కాదు. ప్రాణానికి ప్రాణం, కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే ఆవేశాలు ఎప్పటికీ మంచివి కాదు. భయంతో తెచ్చే మార్పు కంటే మంచితో తెచ్చేమార్పే నిదానంగా వచ్చినా స్థిరమైంది.
జరిగిందేదో జరిగిపోయింది బుష్ గుణపాఠం నేర్చుకున్నట్లే ఉంది. కాని అమెరికా నేర్చుకుందా? ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరక్కుండా అమెరికన్లు  విజ్ఞత చూపిస్తారా?
బలంతో పాటే బాద్యతా వస్తుంది. పశుబలం ఉంది కదాని ప్రపంచాన్ని లక్ష్యపెట్టకుండా ముదుకెలితే ఫలితం ఇలాగే ఉంటుంది.
ఎంతమంది అమాయక ప్రాణాలు ఉసూరుమన్నాయి? తల్లిదండ్రులు కోల్పోయిన ఎంతమంది బాలబాలికలు కసితీర్చుకోవడానికి భయంకరవాదులు కాబోతున్నారు? ఎంతమంది కంటికి కునుకు లేక భయం గూటికింద జీవిస్తున్నారు?
ఎప్పుడు దీనికిక ముగింపు? ముగింపంటూ ఉందా?