Archive for the ‘నా ఏడుపు’ Category

‌మన చీర – Indian saree

జూన్ 28, 2006

ఇది నిజంగా అద్భుత సృష్టి. ఇది లేని గృహం ఊహించడమే కష్టం. ఉన్నవారు, లేని వారు, నాగరికులు, అనాగరికులు, సంప్రదాయవాదులు, ఆధునికులు, దక్షణాదివారు, ఉత్తరాదివారు … అందరూ ఆదరించేది చీరే గదా! మానవులకీ, దేవతలకీ సమాన్యవిషయము కూడా ఇదేనేమొ!
కాకపోతే దానికి ఎన్నో రూపాలు. సామాన్య నూలు చీరల్నుండీ పట్టు చీరల వరకూ ఎన్ని రకాలు! కార్మిక స్త్రీలు మోకాళ్ళ పైకి కట్టే పద్దతి నుండీ, నాట్యానికి అనువుగా కట్టే పద్దతి వరకూ ఎన్నెన్ని ధారణ రీతులు!
ఎన్నో భాషలు, మతాలు, ఆహారాలు ..కాని చీర మాత్రం రూపాలెన్నైనా భారతీయ నారీభూషణమే!
నేను విషయం గుర్తు పెట్టుకోగలను కానీ, సినిమా పేరు గుర్తుపెట్టుకోవటం నావల్ల కాదు. ఆ మద్య జెమిని చానల్లో ఆ సినిమా పాట విని తన్మయున్ని అయిపోయాను. చీర ఎన్ని రకాలుగా మన సంస్కృతి లో పెనవేసుకుపోయిందో విని.
ఏడ్చే పిల్లవాన్ని ఊరడించడానికి, నిద్ర పుచ్చడానికీ చీరతో వేసే ఊయలంత సౌకర్యం ఇక దేనిలో ఉండదేమో!
ఊయలైన చీర
పిల్లాడికి మూతి తుడవడానికి (చీమిడి తుడవడానికి కూడా 🙂 ) చీరకొంగంత ఆపద్బాందవి ఇంకోటి ఉందా?
పసిబిడ్డకు పాలు ఇవ్వాలంటే చీరపైట చాటు అంత అనువైనదేది?
ఎండలో నడిచేప్పుడు చీరకొంగేగా నీడ పట్టేది!
ఉద్యోగిని చీర
చిల్లర డబ్బులూ, ఆకు ఒక్కలూ కట్టుకొని దాచుకోవటానికి చీరకొంగేగా పనికొచ్చేది!
అడుక్కోవటానికి చేతిలో బొచ్చే అక్కరలేదు, చీర కొంగు చాలు.
బిక్షగత్తె చీర
అడవికి వెళ్ళినప్పుడు రాతి సందుల్లోని మురికి నీరు వడగట్టి తాగడానికి పనికొచ్చేదీ చీరకొంగే!
మొగున్ని తన వెంటే తిప్పుకోవాలంటే కట్టుకోవాల్సింది కొంగుకే!
జీవితం మీద విరక్తి చెందితే ఉరికి సహాయపడేదీ చీరే! 😦
బావిలో పడ్డవాన్ని రక్షించాలంటే వెంటనే గుర్తుకొచ్చేది చీరనే!ఇక అలరించనిది ఎవ్వరిని??

చీర గట్టిన ఏ సుందరైనా మగవాన్ని మరింత మోహవివశున్ని చేయకుండా ఉంటుందా? అన్నిటినీ దాచినట్లే దాచి వాటిని మరింత అందంగా చూపే చీరే చీర కదా!

ఆధునికపు చీర
కన్నె పిల్ల చీర
అలాగే స్త్రీ పట్ల గౌరవం, భక్తి కలగాలన్నా చీరలోనే చూడాలి.
చీర కట్టిన విగ్రహాన్ని చూస్తే ఎంత భక్తి భావన!
నాట్యమయూరి చీర
లేపాక్షి చీర
కానీ… ఇన్ని వేల సంవత్సరాలు తన ఉనికిని కాపాడుకొన్న చీర ఇకమీదటా ఉంటుందా? నాగరీకం పేరుతో బొట్టుకీ, చీరకీ, మంగళసూత్రానికీ మంగళం పాడేస్తున్నామా? నాకైతే ధోవతి కట్టడం రాదు..నా పిల్లలకి కూడా నేర్పలేను. పాత సినిమాల్లో నాగేశ్వరరావ్, మురళీమోహన్ కట్టిన పంచెకట్టు చూసి మురిసిపోవలసిందే! ఇక చీర గతీ అంతే కానుందా?
మన జీన్లలోనే ఉన్న మన జాతి లక్షణాన్ని మార్చలేని మనం, మన వంటి రంగు మార్చలేని మనం మన సంప్రదాయాన్ని మాత్రం నాగరీకం పేరుతో మార్చుకోవటం ఎందుకూ!
మెట్టెలు, తాళి, బొట్టు తీసివేసి పాశ్చాత్యుల్లా కనబడ్డంత మాత్రాన మన ఒంటి రంగు మన జాతి మూలాల్ని చెప్పకపోతుందా! మన సంప్రదాయాల్ని ఒదులుకోవటం వల్ల హంస నడక, కాకి నడక రాని చందాన మిగిలి పోమా!?

రవివర్మ చీర
అవ్వ చీర
వీరవనిత చీర
5810.jpg
కార్మికుల చీర— ప్రసాద్

మరిన్ని వివరాలకు http://www.kamat.com/kalranga/attire/saree/

ఈనాటి (వి)చిత్రాలు

జూన్ 22, 2006

ఈనాటి సినిమా గురించి 'ఏమున్నది గర్వకారణం' అన్నట్లు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ దర్షకులూ, నిర్మాతలూ, నాయకులు, నాయకీలు అంతా ఒకే ధ్యేయంతో ఒక తపస్సులా ప్రేమ గురించి (యవ్వన ప్రేమ మాత్రమే) పరిశోధిస్తున్నారా అనిపిస్తుంది. ఎన్ని పేర్లు, ఎన్ని కథలు, ఎన్ని పాటలు?? కనీసం పాత సినిమాలు ప్రేమాంశమైనవే అయినా, అందులో హీరో పేదవాడయి, నాయకి ధనవంతురాలి కూతురై అలా పల్లెలొ మొదలై పట్నంతో ముగుస్తుంది.

కానీ ఇప్పుడొస్తున్న సినిమాలు చుస్తే, అసలు పల్లెటూళ్ళే లేనట్లు, పేదరికమే లేనట్లు, ఏ కష్టమూ లేక ప్రియురాలి ప్రేమ పొందడమే జన్మ సాఫల్యమన్నట్లూ, కార్లలో షికారులూ, ఖరీదైన పార్టీలూ, విదేశాల్లో షికారులూ …..

మనిషికీ మనిషికీ మద్య ఈ సినిమా ప్రేమ బందం తప్ప ఇంకే అనురాగమూ లేదా? ఇంకే బందాన్నీ సినిమాగా తీయలేమా? సినిమాని ఇంత కృత్రిమంగా కాకుండా ఇకొంచం సహజానికి దగ్గరగా తీస్తే ఎంత బాగుండును!!!!

— ప్రసాద్

భిన్న ధృవాలు — BinnaDRvAlu

జూన్ 22, 2006

భారతీయత X వర్థమానం
స్త్రీ పూజింపబడు చోట లక్ష్మి నివసిస్తుంది X నిమిశానికో అత్యాచారం! ఆడపిల్లైతే చంపేయ్, లేదా అమ్మేయ్! గుణింపని, గణింపని, "ఖర్మ" ఖాతాలో జమ పడేవెన్నో! కట్నం తేకుంటే కాల్చి చంపేయ్.
అహింసా పరమో ధర్మః X హింస లేని గృహం పూజ్యం. చివరికి దేవాలయాలు కూడ జంతు బలులు, నర బలులతో హింసకు ఆలయాలే.

‌గురుః సాక్షాత్ పరబ్రహ్మ X ఇప్పుడు ఏ సినిమా చూసినా గురువు పాత్ర హాస్యపాత్ర అయిపోయింది. ఒకవేళ నిజజీవితమే అందులో ప్రతిభింభిస్తుంటే .. ఇక గురువు స్తానం సమాజం లో ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

అథిధి దేవోభవ X దీన్ని కేంద్ర ప్రభుత్వము ప్రజలకు ఇప్పుడు గుర్తుచేయాల్సిన ఖర్మ పట్టింది. ఆ మద్య ప్రవాసీ భారతీయ దివస్ కు హాజరైన విదేశీ వనిత పై అత్యాచారం. విదేశీ రాయబారి కూతురి అత్యాచారం.

పరమత సహనం – "అన్ని మార్గాలూ నన్నే చేరుతాయి" – కృష్నుడి ఉవాచ X దీని వల్ల సామాన్య బారతీయుడి వల్ల కాకుండా, "బారతీయత" కి కొమ్ము కాస్తున్నామని చెప్పుకునే వారినుండే ప్రమాదం. పిల్లలతో సహా క్రిస్టియన్ ప్రబోధకున్ని ఒరిస్సాలో సజీవ దహనం.

మానవ సేవే మాధవ సేవ X ప్చ్ .. దీని గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. గుడి బయట పాల కోసం ఏడ్చే బిచ్చగాడి బిడ్డ…. గుడి లోపల రాతి దేవుడికి క్షీరాభిషేకం.

సర్వజీవులందు సమ దృష్టి (అన్ని జీవులందు ఉన్న చైతన్యము పరమాత్మ అంశే కనుక జీవులన్నియును సోదర సమానులే) X సర్వ జీవులెందుకు…. మానవులే అందరూ సమానం కాదు. మాదిగ, మాల వీళ్ళందరు జంతువుల కంటే హీనం. పిల్లి ముట్టిన పాలనైనా తాగుతాం కానీ మాదిగ ముట్టిన మజ్జిగ తగలం.

ఈ వైవిద్యం నుండీ ఏ మర్థమవుతుంది? "చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు" అని.
భారతీయత మీద, వైదిక దర్మం (మను దర్మం కాదు)మీద నాకు అంతులేని ప్రేమ ఉన్నా, అనటానికీ ఆచరణకీ మద్య ఈ అంతరాన్ని చూస్తే ఒళ్ళు మండుతుంది.
మనం ఏళ్ళ తరబడి ఇన్ని భాషలూ, ఇన్ని మతాలూ, ఇన్ని వేషాలూ, ఇన్ని ఆహారపు అలవాట్లు గల వారితో సహజీవనం చేస్తున్నామూ అంటే అది నిజంగా మన సచ్చీలత వల్ల అంటారా? నాకు అనుమానమే …. మన సచ్చీలత కంటే గూడా "ఊరంతా కాలుతున్నా నా ఇల్లు కాలేప్పుడు చూద్దాం" అనే నిర్లక్ష్యం, స్వార్థపరత్వం, నిర్లిప్తత  ముఖ్య కారణాలు అనుకుంటాను. లేకుంటే వేల ఏళ్ళ చరిత్ర ఉన్న మనం, మంగోలులు, అరబ్బుల చేతిలో హీనంగా ఓడిపోయి అప్పనంగా అధికారాన్ని అప్పజెప్పి ఊడిగం చేయడమేంటి? కేవలం కొన్ని వందల తురగదళం తో, ఆటవిక సంస్కృతి తో, ఎంతో దూరం నుండీ వచ్చి, ఎంతో సువ్యవస్థితమైన, సంస్కృతి కలిగిన, సంపద కలిగిన మనం ఓడిపోవటమేమిటి.
బలహీనుడు చెఫ్ఫేది నీతి కాదు బలహీనత మాత్రమే. ఆడలేక మద్దెల ఓడు అనడమే. నీతి చెప్పే హక్కు బలవంతుడికే ఉంటుంది. దానికే విలువ ఉంటుంది. అయితే బలంతో వచ్చే అహంకారాన్ని అదుపులో పెట్టుకుని బాద్యతతో సచ్చీలతతో జీవించినప్పుడే అసలైన నీతి జీవిస్తుంది. ఈ విధంగా చుస్తే బారత్ అణుశక్తి సాధించి తన మొత్తం చరిత్రలో ఒకే ఒక మంచిపని చేసింది.

ఇలా రాసుకుంటూ పోతే ఇంకా ఎంతో. మాతృదేశం మీది ప్రేమ దాన్ని విమర్షించనీయదు. దేశాన్ని విమర్షించడమంటే, దేశ ప్రజలని విమర్షించడము. ప్రజల్లో నేను, నావాల్లూ కూడా భాగమే కనుక నన్ను నేను విమర్షించుకోవటం. ఆత్మ విమర్ష చేసుకోవటం. జరిగిన తప్పులు, జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దుకోవటం.

— ప్రసాద్

రిజర్వేషాలు

జూన్ 20, 2006

రిజర్వేషాలునాకు తెలుసు ఇది చాలా సున్నితమని. నాకు తెలుసు సమర్థించడానికీ, విమర్శించడనికీ బోలెడంత సరుకుందని. కావాలనే ఈ విషయం మీద నా బ్లాగుని నాంచాను. (వీవెన్ గారు లేఖినిలో nAncAnu ఎలా రాయాలో చెప్పండి.) అదేనండి అంత సున్నితమైన అంశము రిజర్వేషన్లు. చదువరి బ్లాగు చూశాక ఇక తప్పదనిపిస్తోంది.రిజర్వేషన్లు కావాలి, ఉండాలి. అయితే అవి కులాధారంగా ఉండకూడదు. ఇదీ నా స్థూలాభిప్రాయము.

ప్రతిభ

ప్రతిభ కే పట్టం కట్టాలి అందులో అందులో ఎవరికీ లేశమాత్రసందేహముండక్కర్లేదు. అయితే సమ ఉజ్జీల మద్యనే పోటీ ఉండాలి. ఉన్నవారి పిల్లలకి, లేని వారి పిల్లలకి మద్య పోటీ పెట్టి, అందులో అర్హత సాధించిన వాడికే అందలమిస్తామంటే ఎలా? AC రూములో చదివేవాడికీ వీధి దీపం కింద చదువుకునే వాడికీ పోటీ ఎలా సాద్యం. వేలు, లక్షలూ పెట్టి పేరున్న కాలేజీల్లో చదువు కొనే వారికీ, పిల్లల్నీ కూడా పనిలో పెడితే కాని ముద్ద నోట్లోకి రాని వారికీ ఒకే పోటి పెడితే ఎలా? నిజమే మీరన్న విధంగా అటువంటి వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించి ఉన్నవారితో సమానంగా విద్యావకాశాలు కల్పించి … ఇది సాద్యమా? ఎంత వెసులు బాటు కల్పిస్తే మాత్రం లేనివాడి పిల్ల వాడు, ఉన్నవాడి సౌకర్యాలు పొందగలుగుతాడు. నిజంగానే మనం అలాంటి అర్థిక వెసులుబాటు కల్పించగలిగితే ఇంక బీదలనే వారే ఉండరు. కడుపునిండా తినలేని వాడికి డబ్బిచ్చి పుస్తకాలు కొనుక్కోమంటే పుస్తకమా అన్నమా ఏది వాడికి రుచిస్తుంది? కడుపులో ఆకలి దంచేవాడికి, నిత్యమూ జీవనపోరాటం చేసేవాడికి చదువుకోలేని విషయం సమస్యే కాదు. వాడి ఆకలి తీర్చి, వాడి తల్లిదండ్రుల ఆకలి తీర్చి ఇంట్లో కరెంటు దీపం పెట్టి, చదువుకోవటానికి డబ్బులిస్తే ఎందుకు చదవడూ? అప్పుడు మనం ఖచ్చితంగ ప్రతిభకు పట్టం కట్టవచ్చు.

ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు వుండాల్సిందే.

ఎంత మంచి హాస్టళ్ళు ఉన్నా తల్లి ఒడిబడిలో నేర్చున్నంత సౌకర్యం హాస్టల్లో ఉంటుందా?

కారులో, లేదా కనీసం స్కూటర్లో వచ్చి స్కూల్లో చదివే వాడి కెక్కినట్లు నడుచుకుంటూనో లేకా సైకిల్లో చెమటలు కక్కుకుంటూ స్కూలుకు వచ్చి చదివే వాడికి చదువు ఎక్కుతుందా?

మరి సామజిక అసమానతలు ఉన్నంత వరకూ సమాన పోటీ ఎలా సాద్యం?

సామర్థ్యము

చాలామంది వికటంగా రిజర్వేషనుతో దాక్టరైతే వాడివాల్ల జరిగే అనర్థాల గురించి చెపుతారు. సరే, మరి అనర్హుడైనా డబ్బు పోసి పక్క రాష్త్రానికో, పక్క దేశానికో వెల్లి దాక్టరు చదువు కొన్న వారి సామర్థ్యము సంగతేంటి? రిజర్వేషన్లున్నా ప్రతిభ చూసే కదా అర్హుడయ్యేది. ఏ కులానికి ఆ కులంలో ప్రతిభ చూసే కద ఎన్నుకునేది?

ప్రతిభ అన్ని వర్గాల్లోనూ ఉంటుంది. కాకపోతే సౌకర్యాల లేమి వల్ల మార్కులు తగ్గితే అలంటి వారికి అవకాశం ఇవ్వడంలో తప్పేముంది?

కులం

కులాన్ని బట్టి రిజర్వేషన్లు తప్పే. కాని రాజ్యంగ నిర్మాణ సమయంలో ఉన్న సమాజిక పరిస్థిని బట్టి చూస్తే అది న్యాయమే. నిమ్నకులాలలో అప్పుడు ఉన్నవారు అరుదు. ఒకవేళ ఉన్నా అటువాంటివారు కూడ రాజ్యంగ రక్షణ లేనిదే ఏ పదవీ సాధించలేని దుర్గతి. సాధించినా పని చేయడానికి ప్రతి చోటా అగ్రకులాల వారి అవమానాలు పని చేయనివ్వవు. అదీగాక కొన్ని ఏళ్ళ తర్వాత రిజర్వేషన్లు ఉండకూడదనేది వారి ఆలోచన. ఇప్పుడు పరిస్థుల్లో చాలా మార్పులు వచ్చాయి, కనీసం పట్టణాల్లో అయినా కులాన్ని బట్టి అవమానించడం (నాకు తెలిసి) లేదు. బహుశా ఇది సరైన సమయం కులాల ఆధారిత రిజర్వేషన్లు కాకుండా ఆర్థికాధారిత రిజర్వేషన్లు అమలు చేయడం.

రాజకీయం

నిమ్నకులాల్ని, వెనుక బడ్డ కులాల్ని ఉద్దరించడం ఇప్పటి ఏ రాజకీయనాయకుడి అభిమతమూ కాదు. తద్వారా వారి ఓట్లకు గాలం వేయదమే వారి పని.

ప్రతి ఒక్కడు ఆ పేరుతో స్వలాభం చూసుకునేవాడే.

సంస్కరణ

ప్రస్తుత రిజర్వేషన్ల విధానం అంతగా ఫలాల్ని అందిచడం లేదు. వీటిని తప్పక సంస్కరించాలి. ఆ మద్య ఒకాయన పాయింట్ల పద్దతిని సూచించాడు. అది నాకు బాగా నచ్చింది. ఈ పద్దతి ప్రకారం ఆర్థికంగా వెనుకబడ్డందుకు కొన్ని points, నిమ్న కులం అయినందుకు కొన్ని points, స్త్రీ అయినందుకు కొన్ని points, వచ్చిన మార్కులని బట్టి కొన్ని ఇలా మార్కులు ఇస్తారు.

అయితే ఇందులో ఏ ప్రయోగం చేయాలన్నా చాలా సాహసం కావాలి.

చివరి మాట

కులాన్ని బట్టి రిజర్వేషన్లకు నేను వ్యతిరేకినే అయినా ద్వేషిని కాదు. ఎందుకంటే కులాన్ని బట్టి రిజర్వేషను మన సమాజంలో మనువునుండీ వస్తున్న పద్దతి. ఇప్పటికీ దాన్ని సమర్థించేవాళ్ళెందరో ఉన్నారు.

క్షత్రియ వంశములో పుట్టినవాడే రాజు కావాలి.

బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడే పురోహితుడు కావాలి.

వైశ్యుడే వ్యాపారం చేయాలి.

కుమ్మరే కుండలు చేయాలి.

కమ్మరే కమ్మలి పని చేయాలి.

చాకలే గుడ్డలు ఉతకాలి.

మాదిగే చెప్పులు కుట్టాలి.

ఇలాంటివి ఎన్నో అనాదినుండీ కుల రిజర్వేష్న్లుండగా ఇప్పుడు మాత్రమే వాటికి విరుద్దంగా ఇన్ని ఆవేశాలు, ప్రదర్సనలు ఎందుకు?

ఇంతకు ముందెప్పుడైనా మనం కుల రిజర్వేషన్లు ఒద్దని పోరాటం చేశామా? తెలివిలేని దద్దమ్మైనా రాజుకు మొదటి కొడుకైనందుకు రాజ్యాన్ని కట్టబెట్టి అదీ సంప్రదాయమని ఊరుకోలేదా?

తరతరాలుగా నిమ్నకులమని, అంటరానివాడని ప్రతిభ వున్నవాన్ని కుడా వెలివేసి ఊరికి దూరంగా జంతువుకంటే హీనంగా చూసిన పాపానికి ఈనాడు ఇలా ప్రయశ్చిత్తం చేసుకుంటున్నామని అనుకుంటే కొంతైనా ఆత్మతృప్తి లభించదా?

రిజర్వెషన్లు వద్దని గర్జించే మీలో ఎంతమంది ఈరోజు కూడా పల్లెల్లో దళితుడి ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగగాలరు? దలితున్ని మీ ఇంటి లోగలికి అహ్వానించి అన్నం పెట్టగలరు? ఈ రిజర్వేషన్ల మూలంగా సర్పంచులూ, MLA లూ, MP లూ అయిన ఎంతమంది అగ్రకులపు అదిపత్యాన్ని కాదని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు?

నా దేశం చంద్రుడి మీద మనిషిని నిలపక పోయినా ఫర్వాలేదు, దళితున్ని సమాన గౌరవంతో అగ్రకులపోని సరసన నిలిపితే చాలు.

అణుపాటవమున్న దేశంగా నా దేశానికి గౌరవం లేకపోయినా ఫర్వాలేదు, అబలపై నిమిశానికో అత్యాచారం లేకుంటే చాలు.

ఖజానా నిండ విదేశీమారకద్రవ్యము లేకున్నా ఫరవాలేదు, ఆకలితో చావని ఒక రోజున్నా చాలు.

— ప్రసాద్

వ్యధ

జూన్ 7, 2006

కడుపుకింత లేక అల్లాడుతున్నవారి మధ్య నేనెలా ఆకలి తీర్చుకోను?
రహదారి పక్కన కాసింత చోటు చూసుకొని, చిరిగిన బొంతలో చిక్కిన శరీరాన్ని దాచుకొని, చలికోరల్లో చస్తున్న వారి మధ్య నేనెలా సుఖంగా నిద్రింతును?
రైతన్నల ఆత్మహత్యలు, ఆకలిచావులు
నక్సలైట్ల కిరాతకాలు, పోలీసుల ఆగడాలు
ఉన్మాదుల రక్తపు క్రీడలు, పసివాళ్ళ ఆర్తనాదాలు
ఇన్ని అకృత్యాల మధ్య
నాకేమీ తెలీనట్లు, నాకేమీ వినబడనట్లు, కనబడనట్లు
మూగ, చెవిటి, గుడ్డి వాడిలా ఎన్నాళ్ళని నివసించను?