Archive for the ‘నా ఏడుపు’ Category

కొడుకా, కూతురా!

సెప్టెంబర్ 12, 2006

 ఏదో సందర్బంలో యండమూరి అంటాడు ‘ప్రతి సంబందమూ చివరికి ఆర్థిక సంబందమే’నని. ఆది ఏదో కొన్ని సందర్భాల్లొ తప్పు కావచ్చేమొ గానీ చాలా సందర్బాల్లో నిజమే! పిల్లల నుండి రేపేదో ఆశిస్తూ ఈరోజు వారిమీద ఖర్చు చేయడాన్ని పెట్టుబడిలా భావించడం ఫంక్తు వ్యాపారి లక్షణం! కొడుకైతే రేపేదో వుద్దరిస్తాడని, వంశాన్ని నిలుపుతాడనీ, పున్నామ నరకం నుండీ తప్పిస్తాడనీ కొడుకు కావాలనుకోవడం, కూతురి మీదకంటే కొడుకుమీద అధిక ప్రేమ చూపించడం అనాగరికం, అవలక్షణం. నిజం చెప్పాలంటే కొడుకు దగ్గరికంటే కూతురి దగ్గరే అధిక ప్రేమ లభిస్తుంది. అదేదో సామెత కూడా వుంది ..’కొడుకు బందువులైతే వాకిట్లోదాకా..కోడలి బందువులైతే వంటింట్లో దాకా’ అని. కోడలు నడిపే కొడుకు సంసారంలో కంటే కూతురు నడిపే సంసారంలో స్వాతంత్రం ఎక్కువ వుంటుంది. తల్లిదండ్రుల మనసు వీధులు పట్టుకు తిరిగే కొడుకు కంటే ఇంటిపట్టున వుండే కూతురికే ఎక్కువ తెలుస్తుంది. బాధలైనా కొడుకు దగ్గర చెప్పుకోవాలంటే నామోషీ పడే తల్లి కూతురి దగ్గర స్వేక్షగా చెపుతుంది. అన్నెందుకు అన్న దగ్గరకంటే అక్క దగ్గరే చనువూ, స్వాతంత్రమూనూ! ఏ విధంగా చూసినా స్త్రీ (అక్కగా, చెల్లిగా, తల్లిగా, కూతురిగా, బార్యగా) ఇచ్చే శాంతి, సుఖము ఇంకెవరిస్తారు?
మన సుఖసంతోషాల కోణం నుండీ కాకుండా పిల్లల సుఖసంతోషాల కోణం నుండీ చూస్తే కొడుకు మీద కంటే కూతురు మీదే ఎక్కువ శ్రద్ద చూపించాల్సి వుంటుంది. feminists ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడది అబలే. ఒక్క ఇందిరా గాంధీ, మార్గరెట్ థాచర్, బండరు నాయకే లను చూపించి ఆడది అబల కాదు అంటే ఎలా కుదురుతుంది? మగాళ్ళలో బలహీనులున్నట్లే ఆడవాళ్ళలో బలవంతులూ వుంటారు. అందం, సుకుమారం, సౌశీల్యం ఆడవాళ్ళ లక్షణాలు. వీటిని బట్టి చూస్తే కొడుక్కివ్వాల్సిన దానికంటే కూతురికి ఎక్కువ రక్షణ అవసరం. కొడుక్కి నేర్పించాల్సిన విద్య కంటే తన కాళ్ళపై తను నిలబడేలా శిక్షణ కూతురికే అవసరం. కూతురికి ఏ విద్యా నేర్పక మరింత బలహీనురాల్ని చేసి, ఇంకో మగాడికి అంటగట్టి, అతడి చెప్పుకింద రాయిలా అణిగిమణిగి వుండమనడం స్వంత బిడ్డకు తండ్రే చేస్తున్న అపచారం!
తల్లిదండ్రులుగా మనం పెట్టే ఖర్చు మన పిల్లల్ని తమ సొంత కాళ్ళమీద నిలబెట్టేందుకు వుపయోగపడాలిగానీ ముసలిదశలో మనకాళ్ళు నిలవటానికి కాదు.
ఇక వంశం ప్రకారంగా చూసినా కూతురే మన వాంశం నిలిపే గ్యారంటీ వారసురాలు. “తండ్రి నమ్మకం, తల్లి నిజం” అనెక్కడో చదివాను. కాబట్టి మన లక్షణాలను ఖచ్చితంగా తర్వాతి తరానికి మోసుకుపోయేది తల్లిగా కూతురే గానీ కొడుకు కాదు.
ఇక కట్నం విషయానికి వస్తే, కట్నం అనేది ఒక Status symbol అయిపోయింది. కట్నం తక్కువంటే నన్ను తక్కువవాడు గా జమకడతారేమొ అని పెళ్ళికొడుకు అనుకుంటాడు. అంతెందుకు మా అక్కకిచ్చినంత కట్నము నాకెందుకివ్వవని అడిగే కూతుర్లూ తయారయ్యారు. ఎంత ఇచ్చాం అనేది పెళ్ళికూతురు వైపు వాళ్ళకీ ఎంత తీసుకున్నాం అనేది పెళ్ళికొడుకు వైపు వాళ్ళకీ వాళ్ళవాళ్ళ మర్యాద/పరువు విషయమై పోయింది. ఇలా ఎవరిస్తోమతుకు తగ్గట్లు వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే సమస్యలేదు గానీ వచ్చిన చిక్కల్లా కొడుకుని అమూల్యమైన వస్తువుగా భావించి దాని విలువకు సరిపడా కట్నం తేలేదని కోడళ్ళని రాచిరంపాన పెట్టడం అసలు సమస్య! ఇంకా తమ కొడుకు qualifications వున్న ఎదురింటి కుర్రాడు తమకంటే ఎక్కువ కట్నం తీసుకున్నాడని తెలిస్తే తము మోసపోయినట్లుగా భావించి తమ కోడలి వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆడిపోసుకోవడం మరో అత్యాశ లక్షణం!
ఎన్నో నేరాలకు అత్యాశ, దురాశ, డబ్బు ప్రధాన కారణాలయినట్లే కట్నానికీ అవే కారణాలు. ఇవి బరితెగించి కొడుకులే కావాలి కూతుర్లు వద్దు అని బ్రూణహత్యలకు పాల్పడటం, అమ్మాయిలని అమ్మేసుకోవటం రాక్షస లక్షణం. రాక్షసులూ ఇలా చేసినట్లు ఏ పురాణంలోనూ కనపడదు. అంబనాధ్ అన్నట్లు ఇదేమాదిరి ఆడపిల్లల నిష్పత్తి తగిపోతే విపరిణామాలు తప్పవు. బహుశా అప్పుడు మళ్ళీ వ్యాపారప్రపంచపు డిమాండ్, సప్లై సూత్రం వర్తించి మళ్ళీ కన్యాశుల్కము విజృంబించి reverse trend మొదలవుతుందేమొ!
–ప్రసాద్

ఉత్తమ జీవితమా X వ్యర్థ జీవితమా?

ఆగస్ట్ 29, 2006

కొంతమంది మాట్లేడే ఉత్తమ జీవితం (Quality life) నాకసలు అర్థం కాదు. నిజానికది వ్యర్థజీవితమని నా అభిప్రాయం. అమెరికా జీవితాన్నే తీసుకుంటే ఒక ఇంటికీ మరో ఇంటికీ బోలెడంత దూరం. కనీసం కాసిన్ని టమోటాలు కావాలన్నా కారేసుకొని అధమం రెండు మైళ్ళు వెళ్ళందే కూరగాయల కొట్టు రాదు. పది మైళ్ళ లోపు పని చేసే కార్యాలయం వుంటే అది ఎంతో దగ్గరున్నట్లు. మరీ విచిత్రమేమంటే వ్యాయామం చేయటానిక్కూడా అర లీటరు పెట్రోలు తగలెట్టి కారులో వెళ్ళి అక్కడ మళ్ళీ పది యూనిట్లు విద్యుత్తు  తగలేస్తే కానీ శరీరానికి ఉత్తమ వ్యాయామం లభించినట్లు కాదు.
Quality Life పేరుతో చేస్తున్నదంతా పరమ వృధా! నేను రోజు వెళ్ళే రైల్వే స్టేషను లో ఒక sign board ఇలా అంటుంది. గడిచిన వందేళ్ళలో 130 ట్రిలియన్ గాలన్లో బ్యారళ్ళో పెట్రోలు తాగేశాం, అంత పెట్రోలు మరో ముప్పై ఏళ్ళలోనే తాగేయబోతున్నాం కనుక పొదుపు పాటించండి అని. ఈ తాగేయడంలో అమెరికా వాళ్ళ quality life 90 శాతం తాగి వుంటుంది. మొత్తం ప్రపంచానికీ చెందాల్సిన వనరులు అవసరం లేకున్నా చేతిలో పవరుంది, డబ్బుంది గదాని వనరుల్ని నాశనం చేసి భూగోళాన్ని చెత్తకుండి కింద మారుస్తున్నాం.
స్కూలు 20 మైళ్ళు, ఆఫీసు 30 మైళ్ళు, కూరగాయలు వగరా కొట్టు అధమం 2 మైళ్ళు, డాక్టరు 10 మైళ్ళు, బట్టల కొట్టు 15 మైళ్ళు, తెలిసిన దగ్గరి మితృడి ఇంటికి వెళ్ళాలంటే 5 మైళ్ళు …. భూమింది కదాని రోడ్లేసుకొని, ఎక్కడెక్కడో ఇళ్ళు కట్టేసుకొని .. అవసరమా ఇంత దూరాలు? దేవుడిచ్చిన కాళ్ళను కాదని మనిషి తయారుచేసిన కార్ల కాళ్ళు లేనిదే కదలలేని దౌర్భాగ్యం! వారానికి 30 లీటర్లు మన పిల్లలకు మిగిలిస్తామో లేదో తెలియకుండా కాల్చి భూమిని బూడిద కొట్టుగా, గనుల రంద్రాల పుట్టగా మార్చడం అవసరమా?
వాడి పారేయి (Use and throw) అనేది మన quality people తారక మంత్రం. వాడి పారేసి ఈ భూమిని చెత్తకింద మార్చేసి మళ్ళీ అదే చెత్త వాసన అంటకుండా AC రూముల్లో, కలుగుల్లో ఎలుకల్లా అవసరమా ఈ జీవితాలు?
ఒక్కసారి తిని పారేసే చెంచాలు, కప్పులు, తట్టలు, సంచులు ఎంత వ్యర్థం తయారు చేస్తున్నారు ఉత్తమ జీవితాలు గడుపుతున్నామనే వ్యర్థులు. మనం మన తరవాతి తరానికి సంపదలివ్వకపోతే మానె కనీసం ఈ వ్యర్థాన్ని ఇవ్వకపోతే మన జీవితాలు ఎంత సార్థకమవుతాయి.
మునుపటి జీవితాలే చక్కగా వుండేవి కాదూ!  మట్టి ముంతలు, మూకుళ్ళు, కుండలు, చట్లు, బానలు అవేవీ ఇప్పుడు. ఖనిజాలన్నీ వాడేస్తున్నాం రేపటి గురించి ఆలోచించకుండా!
అప్పుడెప్పుడొ Matrix సినిమా చూసినప్పుడు అందులో వాడంటాడు ..మానవులు భూమికి పట్టిన వైరస్ అని. ఈ ఒక్కమాట చాలు మనం భూమికి ఇతర జీవాలకీ చేస్తున్న హాని గురించి చెప్పాలంటే.

 

తెలుగు దురభిమానం 3

ఆగస్ట్ 11, 2006

“కలిసి వుంటే కలదు సుఖము” అనేది తిరుగులేని సత్యము. అది నేను చెప్పినా, అమెరికన్ చెప్పినా, అంబనాధ్ చెప్పినా. అది “పాత చింతకాయ పచ్చడి” అన్నంత మాత్రాన సత్యము అసత్యమైపోదు.
ఇక కలిసి వుండటంలో వున్న కష్టాలు, బార్యాభర్తలు కలిసి వున్నప్పుడూ వుంటాయి. అయితే విడిపోయినప్పటి కష్టాలకంటే తక్కువే. ఒక్కసారి కన్నడ, ఉత్కళ, తమిల, ఆంద్ర దేశాలను వూహించుకోండి. కావేరి యుద్దము, కృష్నా యుద్దము, పోలవరం యుద్దం ఇలా ఇప్పటికి అందరమూ నీటికోసం యుద్దాలు చేస్తూ వుండేవాళ్ళం. తెలుగు వాళ్ళు అమెరికాకి, తమిళులు సింగపూర్ కి శ్రీలంకకి, ఈశాన్య రాష్ట్రాలు చైనాకి కొమ్ము కాసి యుద్దాలో, ప్రక్షన్న యుద్దాలో చేసుకుంటు వుండేవాళ్ళం. పరువు, ప్రతిష్ట, గుర్తింపు అనేవి మానవ జీవితాలకంటే గొప్పవి కావు. స్వేచ్చను ఇందులోంచి మినహాయించవచ్చు.
ఇక ప్రత్యేక తెలుగు రాజ్య భావన కొస్తే అసలిది పూర్వమెప్పుడూ లేదనే అనిపిస్తుంది. రాజులు తమకు సాద్యమయినన్ని రాజ్యాల్ని లోబరుచుకొంటూ సామ్రాజ్యాల్ని ఏర్పరచడానికి ప్రయత్నించారేగానీ బాషను బట్టి రాజ్యాలు లేవు. అలాగే మాతృబాష తులు అయినా రాయలు తెలుగుకే తన పట్టము కట్టాడు. అసలు మొన్న మొన్నటి వరకూ మద్రాసుకు తరలిపోయిన తెలుగువారు తమ దేశాన్ని వదిలి పరాయి దేశానికి వెల్తున్నామను కొన్నారా?
అయితే ఈ ఖండమంతా అధిక కాలం వేర్వేరు రాజ్యాలుగా వున్నా, ఆచారాల వల్ల, గురువుల వల్ల దీన్నంతటిని ఏక ఖండంగానే భావించారు. ఆది శంకరాచార్యులు కేరళకే పరిమితం కాలేదు. కాకపోతే ఇప్పుడు ఆంగ్లం చేస్తున్న పని అప్పుడు సంస్కృతం చేసింది. “హంపీ నుండి హరప్పా దాకా” పుస్తకంలో వేర్వేరు భాషల వారు పరిచయవాక్యాలు సంస్కృతంలో జరుపుకొని ఆ తర్వాత ఇద్దరికీ తెలిసిన భాషలో మాట్లాడుకొనేవారని చెప్తారు రచయిత. అలాగే వక్త గానీ, ప్రవక్త గానీ పరాయి భాష వాడని ఆదరించకపోవటం పరాయి దేశస్తుడుగా భావించడం మనకు పూర్వం నుండీ లేదు. మన తెలుగు వాడు త్యాగయ్య తమిళులకు ఆరాద్యదైవమయ్యాడు కదా! అలాగే షిరిడి సాయిబాబా మన ఇంటి దైవం కాలేదా?
మన సంస్కృతిలో మతాన్ని ఆద్యాత్మిక చింతనకీ, భాషను దైనందిన జీవితావసరంగా వాడుకొన్నారే గానీ, దాన్ని బట్టి మేము ప్రత్యేకమనే పొడ వున్నట్లుగా నాకనిపించదు.
ఈ “తెలుగు జాతి”కి పశ్చిమ దేశాల వారు “జాతి”కి ఇచ్చిన గుణాలన్నీ వున్నా, మనం జాతిని విడిగా నిర్వచించుకోవాల్సిందే. మన భరతజాతికి అంతర్లీనంగా వున్న ఏకాత్మత పశ్చిమీయులకు అర్థం కాదు. ఈ రాజకీయ విభజనలన్నీ బ్రిటిష్ వాడి వల్లైతేనేమి, స్వాతంత్ర్యకాంక్షవల్లైతేనేమి, మనకందరికీ ఆంగ్లేయుడు వుమ్మడి శత్రువు కావడం వల్లైతేనేమి, పటేల్ పట్టుదల వల్లైతేనేమి ఒకటయ్యాం. దీన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించాలేగానీ పూర్వమెప్పుడు మేము కలిసిలేమని ఇప్పుడూ కలిసి వుండమంటే ఎలా?
ఈ అంబనాధే చూడండి SAARC చట్రం కింద దక్షిణాసియా రాజ్యాలన్నీ కలిసి వుండాలంటూనే, డిల్లీ చట్రం కింద వుండనంటారు. కొత్తగా ఏ దేశం సభ్యరాజ్యాలనుండీ వుద్బవించినా దాని ప్రత్యేక అనుమతి లేకుండానే అది సార్క్ సభ్యదేశమయిపోవాలంటారు. బలం లేని SAARC తాడుతో కట్టివేయాలని చూసే ఈయన, బలమైన భరతరాజ్య బావనకు మాత్రం తూట్లు పొడవాలంటారు. (మీ, నా అనుమతి లేకుండానే మనల్ని తెలుగు జాతీయవాదుల్ని చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!)
ఇక తెలుగు వారికి జరుగుతున్న న్యాయమేదైనా వుంటే దాన్ని కలిసివుండే ఎదుర్కోవాలి. విడిపోవడానికి లక్ష కారణాలు వున్నా, కలిసి వుండాటానికి ఒక మంచి కారణం చాలు. కలిసివుండటానికే నేనిష్టపడతాను.

చిన్న తప్పుకు పెద్ద శిక్ష!

జూలై 27, 2006

http://news.bbc.co.uk/2/hi/programmes/5217424.stm
అసలు నన్నడిగితే వ్యభిచారం నేరమే కాదు. బలాత్కారమే నేరం. ఇద్దరిమద్య సంపూర్ణాంగీకారముతో లైంగిక సంబందం ఏర్పడితే దాన్ని ఎలా నేరమనాలి? ఎవరు ఎవరికీ ఏ హానీ చేయకున్నా అది నేరమెలా అవుతుంది? కాకపోతే దీన్ని అంగీకరించడానికి మన preconditioned mindset ఒప్పుకోదు. అందునా ఒడలెల్ల మతోన్మాదము తలకెక్కిన మతపిచ్చి గాళ్ళకి అసలు ఎక్కదు. ఆడవాళ్ళు, అన్యమతస్తులు మనుషులకింద లెక్కరారు వీరికి, వాళ్ళకు తెలిసిందే వేదం, న్యాయం. వ్యభిచారం స్త్రీ, పురుషుల ఇద్దరి భాగస్వామ్యం తోనే జరిగినా స్త్రీకి ఒక న్యాయం, పురుషునికి ఒక న్యాయం. ముందే అబల ఆపైన పురుషాహంకారము, మతపిచ్చి ప్రాధమిక న్యాయసూత్రాలనే తుంగలో తొక్కి స్త్రీని నలిపివేస్తాయి. చీకట్లో రంకు నేర్చినవాడే పదిమందిలో అది పతిత అని తీర్పిస్తాడు.
పాకిస్తాన్‌లో జరిగినా, బీహార్‌లో జరిగినా, ఇరాన్‌లో జరిగినా పదిక్షణాలు సుఖాన్ననుభవించి గాలికిపోయే దుర్మార్గుడి చేతిలో ఆ తర్వాత తొమ్మిది నేలలు ఆ భారం మోయాల్సిన ఆడదే బలిపీఠమెక్కుతోంది. నన్ను బలాత్కరించాడహో అని మొరపెట్టుకున్నా నిరూపించడానికి మరికొందరు మగాళ్ళే సాక్ష్యం కావాలట! ఒక ఆడది బెదిరింపులకు లోంగిరాకుంటే అది పతిత అని ఒక మగవాడు ముద్ర ఏస్తే సరి ఇక ఆ ఆడది బలిపీథమెక్కాల్సిందే! అసలు ఈ నీతిపోలీసులు మగవాళ్ళే అయినప్పుడు, వాళ్ళకు నచ్చిన అబలను కేసుల పేరు చెప్పి లొంగదీసుకోరని గ్యారంటీ ఏమిటి?
ఎంత నాగరీకులమైనా ఇలాంటి అనాగరికులని ఇంకా బరించాల్సిరావటం మన ఖర్మ.

— ప్రసాద్

ఇది ఎన్నోది?

జూలై 24, 2006

చేతులు కాలాక ఆకులు పట్టుకునే మన నైజం ఎంతకూ మారదనేందుకు ఈ ఉదాహరణ చాలు. ఆ మధ్య ఒకసారి చెన్నైలో బోర్‌బావిలో పడిన బాలుడు, ఒకటి రెండురోజుల విఫలప్రయత్నం తర్వాత ఆ బాలుడి శవం వెలికితీత. ఆ తర్వాత కర్నాటకలో ఒకసారి, మన రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఇలాగే జరిగింది. నాకు గుర్తున్నంత వరకు ఒకేఒక్కసారి ఒక సాహసబాలుడు కాళ్ళకు తాడు కట్టించుకుని ఆ బావిలోకి తలక్రిందులుగా వెళ్ళి ఇరుక్కుపోయిన బాలున్ని రక్షించగలిగాడు. మిగిలిన అన్ని కేసుల్లోనూ ఎన్నో ప్రయత్నాల తర్వాత బాలుడు చని పోవటం, తల్లిదండ్రులు విపిరీతంగా ఏడవటం, మనందరం కూడా తరగని కన్నీళ్ళలోంచి కొన్ని బొట్లు రాల్చి జాలిగుండెవారమనిపించుకోవడం.
ఇప్పుడు మళ్ళీ ఇంకో బాలుడు http://www.cnn.com/2006/WORLD/asiapcf/07/23/india.boy.saved.ap/index.html. కథ సుఖాంతమే, కానీ ఇన్ని ప్రమాదాలు, కేవలం మన నిర్లక్షము వల్ల జరుగుతుంటే, మళ్ళీ ఇంకో బాలుడు పడే వరకూ వేచిచూడడమేనా మనం చేయగలిగింది? ఆ బావిని అలా తెరిచివుండడానికి కారకులెవరు వారికి శిక్ష ఏంటి? ఇలాంటివి జరక్కుండా ప్రతి ఊరిలోనూ కనీసం పిల్లలున్న తల్లిదండ్రులైనా వాటిని కప్పడానికి చర్య తీసుకుంటున్నారా? మన పిల్లాడు పడితే గానీ తెలియదు భాధ! పడిన తర్వాత దేవున్ని, సైన్యాన్ని, అల్లా ను ప్రార్థించడం తప్ప ముందుగా నివారణ ఏమీ చేయలేనంత పెద్ద కార్యమా ఇది, కేవలం నిర్లక్ష్యము, కర్మను నమ్మడము తప్ప?
ఆ మధ్య ఎప్పుడో అమెరికాలో కిటికీ తెరలకు వేలాడే దారాలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఒక బాలుడు మెడకు చుట్టుకొని చనిపోయాడట, ఇప్పుడు వాటి గురించీ ఎన్నో జాగ్రత్తలు చెప్పే లబెల్ వాటికి వుంటుంది. పిల్లలకు అపాయకరమన్న ప్రతి దాని మీద ప్రమాద హెచ్చరిక వుంటుంది.(ప్లాస్టిక్ సంచీలతో సహా!) మనకు అలాంటి జాగ్రత్త వుందా? వేలాడే విధ్యుత్ తీగలు, ముందు హెచ్చరికలు లేని తీవ్రమైన దారి మలుపులు, పిల్లలకు వీలయ్యే విధంగా మందుసీసాల బిరడాలు! ఒకటేమిటి ప్రతి దాని విషయంలోనూ అజాగ్రత్త, నిర్లక్షం.
అమెరికాలో ఏమందు సీసా కూడా పిల్లలకు వచ్చేవిధంగా వుండదు. మొన్నామధ్య మా మూడేళ్ళ అమ్మాయి, ముక్కుల్లో వేసే మందును బలవంతంగా మా ఏడాది వయసున్న అబ్బాయికి ముక్కులో వేస్తోంది. (ఇది ప్రమాదకరం కాదు కనక దీని మూత సులభంగానే వస్తుంది). చూసి వారిస్తే, “వాడికి జలుబు చేసి, ముక్కులు గాలి ఆడకుండా వుంటే వేస్తున్నా” అంటు సమర్థిస్తోంది. అదే ఏ ప్రమాదకరమైన మందో అయివుంటే ఎంత అనర్థం జరగడానికి వీలుందో ఆలోచించండి. మనకు ఏ మందైనా చాలా సులభంగా మూత వచ్చేస్తుంది, దాన్ని జాగ్రత్తగా పెట్టడం తల్లిదండ్రుల విజ్ఞతపైనే ఆధారపడి వుంటుంది.
ఈ జాగ్రత్తలన్నీ మనం మళ్ళీ కొత్తగా నేర్చుకొని కనిపెట్టక్కర్లేదు, అభివృద్ది చెందిన దేశాలను చూసి నేర్చుకుంటే చాలు. చూసి నేర్చుకోవడం తక్కువతనమనిపించుకుంటే చూసికూడా నేర్చుకోకపోవటాన్ని ఏమనుకోవాలి? మందబుద్దులా, వాజమ్మలా?

— ప్రసాద్

ఆరో వేతన సంఘమట!

జూలై 20, 2006

ఏడవాలో నవ్వాలో తెలియట్లేదు. మొన్న మొన్ననే నడ్డి విరిచిన అయిదో వేతన సంఘం జ్ఞాపకాలు మరుగున పడక ముందే ఆరో వేతన సంఘము వచ్చేస్తోంది. ఠంచనుగా ప్రతి నెలా జీతాలు అందుకునే ఉద్యోగుల జీతభత్యాలు పట్టించుకునే వారే గానీ, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు, దినసరి కూలీలకు పట్టించుకునే వారేరి? ఈ వేతన సంఘాలు జీతాలు పెంచిన ప్రతిసారీ ద్రవ్యోల్బణం పెరిగి ముందే కష్టాలలో ఉన్న వారి వెతలు మరింతగా పెరిగిపోతున్నాయి. వాళ్ళకు నెలసరి రాబడి గ్యారంటీ చేసేదెవరు?
విపరీతమైన IT జీతాలే బీదల్ని మరింత దూరంగా ఉంచుతున్నాయంటే ఈ వేతన సంఘాలు తమ వంతు భాద్యత తీసుకుంటున్నాయి.
MP లు తమ జీతాలు, అలవెన్సులు తమ ఇష్టం వచ్చినట్లు పెచ్చుకుంటారు. MLAలు తమ జీతాలు, భత్యాలకు తోడుగా ఖరీదైన నగరాల్లో ఇళ్ళ స్థలాలు కూడా కేటాయింపజేసుకుంటారు.
బీదవాడి వేతన ఎవరికి పట్టింది. ఏరుగాలం కాయకష్టం చేసే రైతుకు ప్రకృతి కొంత అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాలు, వేతన సంఘాలు వీలయినంతమేర వాళ్ళ కష్టాల్ని పెంచుతున్నాయి.

— ప్రసాద్

పల్లె ప్రజలు అమాయకులా?!

జూలై 17, 2006

హు..నేనూ పల్లెనుండే వచ్చాను. నాకైతే వాళ్ళు అమాయకులు కాదనే అనిపిస్తుంది. కాకపోతే అజ్ఞానులు అనవచ్చు. పట్టణాలలో ఉన్నవారికున్నంత ప్రపంచజ్ఞానం లేకపోయినంత మాత్రాన వాళ్ళు వుట్టి అమాయకులేం కాదు. స్వాతిముత్యం సినిమాలో కమల్‌హాసన్ పాత్ర వుందే అదీ అమాయకమంటే. అమాయకులంటూ వుంటే వాళ్ళు పల్లెల్లోనూ వున్నారు, పట్టణాల్లోనూ వున్నారు.
కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, మోసం, దగా అన్నీ వారికి తెలిసినంతలో వాళ్ళు చేస్తూనే వుంటారు. కాకపోతే వాళ్ళ పరిమితమైన జ్ఞాన పరిధి వల్ల కోలా కృష్నమోహన్ లాగానో, కృషి వెంకటేశ్వర్లు లాగానో మోసం చేయలేరంతే! అవకాశం దొరకక దొరల్లా (అమాయకుల్లా) మిగిలిపోతున్నారంతే!

ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు కదా! మా ఊరూ ఒక చిన్న పంచాయితీయే. మా అన్నయ్య వెళ్ళి ఉరి అందరినీ సమావేశ పరిచి ఎవరికి సర్పంచిగా నిలబడాలనుందో, వాళ్ళు ఊరికి ఏమి మేలు చేద్దామనుకుంటున్నారో అడిగాడట. నిజమే వాళ్ళెంత అమాయకులంటే నిలబడితే ఊరికి చేయడమేమిటి, మమ్మల్ని గెలిపిస్తే ఊరికి లక్ష ఇస్తానని ఒకడంటే, లక్షన్నర ఇస్తానని ఇంకొకడు. అందరికీ పొట్టేళ్ళతో విందు పెడతానని ఒకడంటే, సారాయి కూడా పోయిస్తానని ఇంకొకడు! నేను పోయిన సర్పంచి ఎన్నికల్లో ఓడిపోయా గనుక ఈసారి నన్నే గెలిపించాలని ఒకడు, నేనూ MPTC ఎన్నికల్లో ఓడిపోయాను గనుక నన్ను సర్పంచినైనా చేయాలని ఇంకొకని ఏడుపు.

పోనీ వింటున్న మన ప్రజల్లోనైనా ఇది తప్పు అన్న స్పృహైనా వుందా? అనుమానమే. వాళ్ళక్కూడా ఎక్కువ ఎవడిస్తాడనే. ఎవడు సర్పంచి అయినా వాళ్ళకు పట్టదు, దాని పేరు చెప్పి డబ్బులిస్తున్నారంటే ఎంతో సంతోషము! ఎంతో హడావుడి, హంగామా. ముచ్చట్లకు బోలెడంత ముడిసరుకు.

అలా కాదు, పల్లెకు ఎవరు ఎక్కువ పనులు చేసిపేడతారో, అసలు సర్పంచిగా ఏం చేస్తారు అంటే ఒకరిమీద ఒకరు అరుచుకోవటం ఎవరిపాటికి వాళ్ళు శాసనసభలోలా మాట్లాడటం తప్ప ఏమీ చెప్పలేరు. ప్రతి ఒక్కడి ఉద్దేశ్యమూ ఒకటే, ప్రతిష్ట, అంతో ఇంతో సంపాదించుకోవడం. ఆ మద్య ఓ సర్పంచు మధ్యాహ్నభోజన పథకపు బియ్యాన్ని తోకున సారాకొట్టు బాకీ కింద చెల్లేస్తుంటే, అది సర్పంచిగా వాడి హక్కు అనుకొన్నారే గానీ నోరు ఒక్కరూ మెదపలేదు. మెదపడానికి శక్తి లేక కాదు, వాడేం చేసుకుంటే మనకెందుకు? మన బియ్యం కాదుగా అనే నిర్లిప్తత!

ప్రజాస్వామ్యం, కలిసి నిర్ణయించడం, మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించడం తెలియనన్నాళ్ళూ ఈ స్థానిక ప్రభుత్వాలతో ఊర్లలో గ్రూపులు ఏర్పడడం, కక్షలూ కార్పణ్యాలూ హత్యలకు దారితీయడం మినహా అభివృద్దికి దారితీస్తుందనుకోవడం అత్యాశేమో!

— ప్రసాద్

ఇదీ మన భారతీయం!

జూలై 13, 2006

సెప్టెంబర్ 11 తర్వాత కోలుకోవటానికి అమెరికాకు ఎన్ని రోజులు పట్టింది?
మాడ్రిడ్ దాడి తర్వాత ఇటలీకి ఎన్ని రోజులు పట్టింది?
లండన్ లో రైళ్ళు, బస్సుల మీద దాడి తర్వాత ఆ దిగ్బ్రమ నుండి తేరుకోవటానికి ఎన్నాళ్ళు పట్టింది?

ఖచ్చితంగా ఒక్క రోజు మాత్రం కాదు.

అదే మన ముంబయి చూడండి. ఒక్కరోజులో ఏమీ జరగనట్టు, రక్తం మరకలు కడిగేసి, పాడైన బోగీల్ని తుక్కు కింద పడేసి మళ్ళీ ఎంత చక్కగా జీవన ప్రయాణం సాగిస్తున్నామో!
చచ్చినవాళ్ళ కర్మ అలా చావాలని ఉంది గనక చచ్చారని సరిపెట్టుకుంటున్నాం. లేకుంటే ఇది మనకు కొత్తా, ఎన్ని బాంబు దాడులు జరగలేదు? ఎంత మంది చావ లేదు?
అయినా చావు దేహానికే గానీ ఆత్మకు కాదని మనకు తెలియదా ఏంటి? మరణం ఎంత అనివార్యమో మళ్ళీ జననమూ అంతే అనివార్యమనే సంగతి అనాది నుంచీ మనకు తెలుసు. అందుకే వీటిని నివారించాలనుకోవటం వొట్టి పనికిమాలిన పని. అసలు కర్మ అలా వున్నప్పుడు ఆపడం మన తరమా! ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లోనే వేల మంది చని పోతున్నారు, ఈ వంద మందీ, రెండొందల మందీ ఒక లెక్కా?
ఈ కర్మ సిద్దాంతాన్ని మనం ఎంత ప్రసిద్దం చేస్తే ప్రపంచంలో అంత శాంతి నెలకొంటుంది. ఎవరి చావుకు ఎవరూ కారణం కాదు, అన్నిటికీ వారి వారి కర్మలే కారణం. ఇది తెలియక జార్జి బూషయ్య ఎంత కుంపటి రగిల్చాడు!! ఆప్ఘనిస్తాను, ఇరాకు రావణ కాష్టాలయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెలు ఈ కర్మ సిద్దాంతము ఎప్పుడు నేర్చుకుంటుందో! ఒక సిపాయిని అపహరిస్తే బడబాగ్నులు కురిపించాలా? అది అతని కర్మని సరిపెట్టుకోక? ఇద్దరు సిపాయిల్ని తీవ్రవాద మూక అపహరించిందని ఏకంగా లెబనాన్ ముట్టడా? రామ రామ! మనల్ని చూసి వారెంతో నేర్చుకోవాలి. ఆ మద్య మన పక్కనున్న బుల్లి బంగ్లాదేషు సైనికులే మన సైనికుల్ని అపహరించి, మొహాలు చెక్కేసి, కిరాతకంగా చంపి పారేస్తే, వారి కర్మ అలా కాలిందని ఊరుకోలేదా?? మన విమానాన్ని హైజాకు చేసి ఆఫ్ఘనిస్తాను నుండీ రాయబారాలు చేస్తే, మనం ఎవరిమీదనైనా ఒక్క తూటా పేల్చామా? తాలిబాన్లని ఒక్కమాట అన్నామా? అది మన రాత అని సరిపెట్టుకొని, మన మంత్రివర్యులే వాళ్ళడిగిన వాన్ని వెంటబెట్టుకొని అప్పజెప్పి రాలేదా?
ఈ ఇజ్రాయెలు ఎప్పుడు నేర్చు కుంటుందో!!
సెప్టెంబర్ 11 దెబ్బకి మళ్ళీ అలాంటిది .. చిన్న బాంబు దాడి కూడా అమెరికాలో జరగలేదు. మన దేశంలో మాత్రం మళ్ళీ మళ్ళీ ఇవి జరుగుతున్నాయంటే మన చేతకానితనం, మన నేతల చేతకానితనం ఎంత మాత్రం కాదు! మన ప్రారబ్దం అంతే!

సెప్టెంబర్ 11 దాడుల తర్వాత స్టాకు బజార్లు కుప్పకూలాయి, విమాన సంస్థలు చేతులెత్తేశాయి. కాని మనం అలాంటి వాటికి జడుస్తామా! ఇలాంటి దాడులు మనల్ని ఏమీ చేయలేవు మన కర్మ అలా వుంటే తప్ప! మన కర్మను ఊహిస్తున్న వాళ్ళంతా ఇంకో పది పదిహేను ఏళ్ళల్లో మనం అగ్రరాజ్యమవుతామంటున్నారే! అందుకే మన స్టాకు బజారు ఉరకలు తీస్తోంది.

భళారే భారతీయం!

జయమాల అయ్యప్ప స్వామిని తాకిందా?

జూలై 3, 2006

అయితే ఏంటట? ఎందుకీ గోల? అసలీ రాతికాలపు ఆచారాలనుండీ మనం బయటికి వచ్చేది ఎన్ని యుగాలకూ జరగదా! అసలు ఆడవాళ్ళని ఎందుకు నిషేదించాలట? స్వామి వారికి ఆ మాత్రము నిగ్రహము లేదా? లేక ఆయన్ను దర్షించే ఆడవాళ్ళు అదుపు తప్పి ఆయన్ను లోబర్చుకుంటారని భయమా? ఆదీ 10 నుంచి 50 ఏళ్ళ మద్య  స్త్రీలు అంటేనే భయమట!!
పవిత్రం, అపవిత్రం.. మ్మ్ .. గూండాలు, ఖూనీకోరులు మెడలో మాలలేసుకొని పాపాలు పోయాయ్, పవిత్రమైపోయాం అనుకొని యాత్ర చేసేస్తున్నారు.. ఏ దుర్బుద్దీ లేకుండా, కేవలం దైవాన్ని చూద్దామని పవిత్ర భావనతోనే వచ్చినా ఆడవాళ్ళన్న కారణంగా తిరస్కారమా??
ఆడవాళ్ళైనందున వారిది పాపమా! కోరికలు అదుపులో పెట్టుకోలేని నీచులది పాపమా!! ఎవరు నిషిద్దులు??
నామట్టుకు నేనైతే ఆ గుడి చాయలకే నా జీవితం లో వెళ్ళను. ఏదో కవి అన్నట్లు “ఈ లోకానికే ప్రవేశద్వారం అమ్మ” ఆ అమ్మకే లేని ప్రవేశం మనకు అవసరమా?
— ప్రసాద్

అన్నయ్యకో లేఖ – a letter to my brother

జూన్ 29, 2006

ప్రియమైన అన్నయ్యకు నమస్కారములు.

      పిల్లలకు నా శుభాకాంక్షలు. వదిన గారికి నమస్సులు.

      నాకీ మద్య ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. బహుశా తగినంత పని ఆఫీసులో లేకపోవడం వల్ల అనుకుంటాను. idle mind is devils workshop అని ఎవరో అన్నారట గదా! దెయ్యాలో, దేవతలో గాని మొత్తానికి నా మెదడు పరిపరి విధాలా అలోచిస్తున్నది. ముఖ్యంగా ఈ జీవితము, దీని గమ్యము గురించి పెద్ద చింతే పట్టుకున్నది.

ఎదీ రుచించడము లేదు.ఏది తిందామన్నా ఆకలికి ఆకొన్నవారూ, ఆకలితో చస్తున్నవారూ నా చేతిలోది లాక్కుంటున్నట్లే ఉంది. ఆకలిగొన్న వాడికి పెట్టకుండా నా కడుపుకే నిర్దాక్షన్యంగా, నిర్దయగా తింటున్నట్లే ఉంటుంది. ఆ ఆకలికళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఏమి తిందామన్నా! నా పిల్లల బోసి నవ్వుల్ని చూసినప్పుడల్లా, తల్లీదండ్రీ లేని అనాధ పిల్లలు, బాలకార్మికులూ, వెట్టిచాకిరీ చేస్తున్న వాళ్ళు నాకూ కావాలి ఆ బోసినవ్వులని అడిగినట్లే ఉంటోంది. సరైన వైద్యము లేక చని పోతున్న పసిపిల్లలు ‘మాకేదీ ఆ బోసినవ్వు” అని ప్రశ్నిస్తున్నట్లే ఉంది. మెత్తటి పరుపు మీద ఆఛ్ వేసుకొని పడుకున్నా నిద్రే రావటం లేదు. చలికి, ఎండలకీ చని పోతున్న వాళ్ళ చావుకేకలే విని పిస్తున్నాయి. ఇల్లులేని వాళ్ళు,రోడ్డు పక్క నిద్రపోయి వాహనాల కింద నలిగి చచ్చేవారి రోదనలే వినిపిస్తున్నాయి ఇక నిద్ర ఎలా వస్తుంది. కారులో రోజూ ప్రయానిస్తున్నాననే మాటేగానీ, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి దీనాలాపనలు, చావుకేకలు విపిస్తున్నాయి.

గాలిబ్ గీతాలూ, ఠాగూర్ గీతాంజలి ఇప్పుడేమాత్రమూ రుచించటము లేదు.

ఎందుకు పుట్టాము? ఎందుకు జీవిస్తున్నాము? మనం సంపాదించి, మన పొట్ట నింపుకొని, మన పిల్లల బాగుచూసుకొని, వీలైతే మన మనవల కోసం, మునిమనవల కోసం దాచి పెట్టడమేనా జీవితమంటే!!!! ఇన్ని రోదనల మద్యా, ఆకలి చావుల మద్యా, అభాగ్యుల మద్యా!!! చూస్తుంటే ఈ లోకంలో నాకు తప్ప అందరికీ, అన్నిటికీ ఎదో ఒక పరమార్థము ఉన్నట్లే తోస్తోంది. తనకోసమే తాను ఎదీ కనపట్టం లేదు ఒక స్వార్థపరుడైన మానవుడు తప్ప. చచ్చిన తర్వాత శవాలు కూడా ఉపయోగపడుతున్నాయి, కళ్ళు ఇంక ఇతర శరీర భాగాలూ! క్రిములూ, కీటకాలూ, మన్నూ, ఆకాశం, అగ్ని, నీరు, సముద్రాలూ, కొండలూ అన్నీ, అన్నీ ఎదో విధంగా ఇతరులకు ఉపయోగపడుతున్నాయి…ఒక స్వార్థపరుడైన మనిషి తప్ప. ఉదయాన లేచిన దగ్గరినుండీ పరుగే పరుగు కాస్తంత సమయం దొరుకుట లేదు, పరచింతనకీ, పరోపకారానికి! పరసేవ చేయలేని జీవతము జీవించడమెందుకూ? అదేకదా మనం చేయాల్సిన ఫుల్ల్ తిమె జొబ్? కానీ అంతా తారుమారు అయినట్లుంది, నా పొట్ట కోసం తొంబైతొమ్మిది శాతం, ఒక్క శాతం లేకుంటే అదీ లేదు .. ఇతరుల కోసం!

ఇన్ని ఆలోచనల తర్వాతే మన ఊరిలో తన వారంటూ ఎవరూ లేని ముసలి వారికి, తమ పని తాము చేసుకోలేని బలహీనులకీ కనీసం అన్నం పెడదామనుకొన్నాం కద? పెడితే వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి లేకుంటే ఎవరికీ వద్దు అంటే ఎలా? మనకున్న స్తోమతుకి తిండిలేని అభాగ్యులకు, బలహీనులకూ మాత్రమే కదా ప్రస్తుతానికి పెట్టగలం. మిగతా వారు పెట్టకపోతే నిందిస్తారంటారా? నిందలూ, అపనిందలూ, కీర్తి, అపకీర్తి వీటికి మనం చింతించాలా? ఎవరు ఎన్ని అంటే మనకెందుకు? మన అంతరాత్మ చెప్పిందే చేద్దాం. ఇక ఊరిలో ఎవరికో ఇచ్చి వండమంటే కాజేస్తారంటారా? కాజేయనీ కనీసం కొంతలో కొంతైన అనుకున్న పని జరక్క పోతుందా!

నన్నడిగితే మనమే ఆ పని ఎందుకు చేయకూడదు? నాన్న రోజూ ఉదయం, సాయంత్రం గర్భగుడిలో దేవున్ని పూజించడానికి వెళ్ళేబదులు, ఆకలిగొన్న మనిషి గుడిలోని ఆత్మారామున్ని కొలవడం పుణ్యం కాదా?

నాకైతే ఏదో రోజు ఈ తీవ్రమైన సంఘర్షణ తట్టుకోలేక అన్ని ఇక్కడే వదిలేసి ఇండియా వచ్చి బీదజనుల సేవ చేసుకోవాలని పిస్తోంది. అందరూ నన్ను పిచ్చివాడంటారేమొ! అననివ్వు, ఇన్ని బాధల మద్యా, ఆకలి కేకల మద్యా నవ్వుతూ బతకడం కంటే వారి మద్యనే ఆ బాధల్ని అనుభవిస్తూ చావడం మంచిదేమొ! ఇన్ని ఘోరాల మద్య, నేరాల మద్య, ఆకలి దప్పుల మద్యా చలం ప్రేమ లేఖలో, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమో చదువుతూ ఆనందింపలేకున్నాను. ఎప్పటికైనా నా గమ్యము అదే అనిపిస్తుంది. దీనజన సేవే అసలైన దైవ సేవ అనిపిస్తొంది. ఇప్పుడిప్పుడే నాకు దారి స్పష్టమవుతోంది.

మీరేమంటారో సెలవియ్యండి. అమ్మానాన్నలతో అనకండి వాళ్ళకిదంతా అర్థం కాదు.

ఉంటాను మరి.

ఇట్లు

మీ ప్రియమైన తమ్ముడు

ప్రసాద్