Archive for సెప్టెంబర్ 12th, 2006

కొడుకా, కూతురా!

సెప్టెంబర్ 12, 2006

 ఏదో సందర్బంలో యండమూరి అంటాడు ‘ప్రతి సంబందమూ చివరికి ఆర్థిక సంబందమే’నని. ఆది ఏదో కొన్ని సందర్భాల్లొ తప్పు కావచ్చేమొ గానీ చాలా సందర్బాల్లో నిజమే! పిల్లల నుండి రేపేదో ఆశిస్తూ ఈరోజు వారిమీద ఖర్చు చేయడాన్ని పెట్టుబడిలా భావించడం ఫంక్తు వ్యాపారి లక్షణం! కొడుకైతే రేపేదో వుద్దరిస్తాడని, వంశాన్ని నిలుపుతాడనీ, పున్నామ నరకం నుండీ తప్పిస్తాడనీ కొడుకు కావాలనుకోవడం, కూతురి మీదకంటే కొడుకుమీద అధిక ప్రేమ చూపించడం అనాగరికం, అవలక్షణం. నిజం చెప్పాలంటే కొడుకు దగ్గరికంటే కూతురి దగ్గరే అధిక ప్రేమ లభిస్తుంది. అదేదో సామెత కూడా వుంది ..’కొడుకు బందువులైతే వాకిట్లోదాకా..కోడలి బందువులైతే వంటింట్లో దాకా’ అని. కోడలు నడిపే కొడుకు సంసారంలో కంటే కూతురు నడిపే సంసారంలో స్వాతంత్రం ఎక్కువ వుంటుంది. తల్లిదండ్రుల మనసు వీధులు పట్టుకు తిరిగే కొడుకు కంటే ఇంటిపట్టున వుండే కూతురికే ఎక్కువ తెలుస్తుంది. బాధలైనా కొడుకు దగ్గర చెప్పుకోవాలంటే నామోషీ పడే తల్లి కూతురి దగ్గర స్వేక్షగా చెపుతుంది. అన్నెందుకు అన్న దగ్గరకంటే అక్క దగ్గరే చనువూ, స్వాతంత్రమూనూ! ఏ విధంగా చూసినా స్త్రీ (అక్కగా, చెల్లిగా, తల్లిగా, కూతురిగా, బార్యగా) ఇచ్చే శాంతి, సుఖము ఇంకెవరిస్తారు?
మన సుఖసంతోషాల కోణం నుండీ కాకుండా పిల్లల సుఖసంతోషాల కోణం నుండీ చూస్తే కొడుకు మీద కంటే కూతురు మీదే ఎక్కువ శ్రద్ద చూపించాల్సి వుంటుంది. feminists ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడది అబలే. ఒక్క ఇందిరా గాంధీ, మార్గరెట్ థాచర్, బండరు నాయకే లను చూపించి ఆడది అబల కాదు అంటే ఎలా కుదురుతుంది? మగాళ్ళలో బలహీనులున్నట్లే ఆడవాళ్ళలో బలవంతులూ వుంటారు. అందం, సుకుమారం, సౌశీల్యం ఆడవాళ్ళ లక్షణాలు. వీటిని బట్టి చూస్తే కొడుక్కివ్వాల్సిన దానికంటే కూతురికి ఎక్కువ రక్షణ అవసరం. కొడుక్కి నేర్పించాల్సిన విద్య కంటే తన కాళ్ళపై తను నిలబడేలా శిక్షణ కూతురికే అవసరం. కూతురికి ఏ విద్యా నేర్పక మరింత బలహీనురాల్ని చేసి, ఇంకో మగాడికి అంటగట్టి, అతడి చెప్పుకింద రాయిలా అణిగిమణిగి వుండమనడం స్వంత బిడ్డకు తండ్రే చేస్తున్న అపచారం!
తల్లిదండ్రులుగా మనం పెట్టే ఖర్చు మన పిల్లల్ని తమ సొంత కాళ్ళమీద నిలబెట్టేందుకు వుపయోగపడాలిగానీ ముసలిదశలో మనకాళ్ళు నిలవటానికి కాదు.
ఇక వంశం ప్రకారంగా చూసినా కూతురే మన వాంశం నిలిపే గ్యారంటీ వారసురాలు. “తండ్రి నమ్మకం, తల్లి నిజం” అనెక్కడో చదివాను. కాబట్టి మన లక్షణాలను ఖచ్చితంగా తర్వాతి తరానికి మోసుకుపోయేది తల్లిగా కూతురే గానీ కొడుకు కాదు.
ఇక కట్నం విషయానికి వస్తే, కట్నం అనేది ఒక Status symbol అయిపోయింది. కట్నం తక్కువంటే నన్ను తక్కువవాడు గా జమకడతారేమొ అని పెళ్ళికొడుకు అనుకుంటాడు. అంతెందుకు మా అక్కకిచ్చినంత కట్నము నాకెందుకివ్వవని అడిగే కూతుర్లూ తయారయ్యారు. ఎంత ఇచ్చాం అనేది పెళ్ళికూతురు వైపు వాళ్ళకీ ఎంత తీసుకున్నాం అనేది పెళ్ళికొడుకు వైపు వాళ్ళకీ వాళ్ళవాళ్ళ మర్యాద/పరువు విషయమై పోయింది. ఇలా ఎవరిస్తోమతుకు తగ్గట్లు వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే సమస్యలేదు గానీ వచ్చిన చిక్కల్లా కొడుకుని అమూల్యమైన వస్తువుగా భావించి దాని విలువకు సరిపడా కట్నం తేలేదని కోడళ్ళని రాచిరంపాన పెట్టడం అసలు సమస్య! ఇంకా తమ కొడుకు qualifications వున్న ఎదురింటి కుర్రాడు తమకంటే ఎక్కువ కట్నం తీసుకున్నాడని తెలిస్తే తము మోసపోయినట్లుగా భావించి తమ కోడలి వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆడిపోసుకోవడం మరో అత్యాశ లక్షణం!
ఎన్నో నేరాలకు అత్యాశ, దురాశ, డబ్బు ప్రధాన కారణాలయినట్లే కట్నానికీ అవే కారణాలు. ఇవి బరితెగించి కొడుకులే కావాలి కూతుర్లు వద్దు అని బ్రూణహత్యలకు పాల్పడటం, అమ్మాయిలని అమ్మేసుకోవటం రాక్షస లక్షణం. రాక్షసులూ ఇలా చేసినట్లు ఏ పురాణంలోనూ కనపడదు. అంబనాధ్ అన్నట్లు ఇదేమాదిరి ఆడపిల్లల నిష్పత్తి తగిపోతే విపరిణామాలు తప్పవు. బహుశా అప్పుడు మళ్ళీ వ్యాపారప్రపంచపు డిమాండ్, సప్లై సూత్రం వర్తించి మళ్ళీ కన్యాశుల్కము విజృంబించి reverse trend మొదలవుతుందేమొ!
–ప్రసాద్