మన నరనరాల్లో బానిసబుద్ది జీర్ణించుకుపోయింది. జీ హుజూర్, బాంచెన్ కాల్మొక్త! అనేవి మన రక్తంలోనే వున్నాయి. ఎవడో ఒకడికి మనల్ని మనం అర్పించుకొంటేనే గానీ ముక్తి రాదనే భ్రమలో కూరుకుపోయాం. మనకు వాడూ గొప్ప అని మనం ఎదుటి వాన్ని పొగిడి, ఆరాధించి, కొలిచి సంతృప్తి పడాలని పిస్తుంది. “మా కాలంలో ఆ జమిందారు…ఆయన సోయగం… ఆ రాచటీవి …” ఇలా మన పూర్వపు జమిందారుల వైభవాన్ని, రాజుల గొప్పదనాన్ని నోరార చెప్పుకొంటేగానీ మనకు కడుపు నిండదు.
ఈ విశ్వాసంతో బతకడం చాకలి దగ్గర గాడిదలా, రైతు దగ్గర కుక్కలా అంటే మనకు భారతీయులకు అందునా తెలుగు వాళ్ళకు మహా ప్రీతి.
నాకు కె.విశ్వనాథ్ సినిమాలంటే చాలా ప్రీతి. కానీ శుభసంకల్పం చూడండి. అందులో కమల్‌హాసన్ పాత్ర చూడండి. ఆ విశ్వాసం చూస్తే నాకు ఎగటు పుట్టింది. మీలో చాలా మంది నాతో ఏకీభవించకపోవచ్చు. కానీ నాకెందుకో ఆ అతి వినయం, అతి విశ్వాసం, రాజ భక్తి నాకు నచ్చ లేదు. నాకైతే అది కుక్కలా పడి వుండే విశ్వాసం అంపించింది.
ఇప్పుడు ఈ రాజశేఖరుని చూడండి. ఎంత వల్లమాలిన ప్రేమ వుంటే మాత్రం అవకాశం దొరికితే ఆంద్రప్రదేశ్‌ని ‘ఇందిరాప్రధేశ్’ గానో ‘రాజీవ్‌ప్రధేశ్’ గానో పేరు మార్చేట్లున్నాడు. నిన్ను నీవు గౌరవించుకోలేనప్పుడు వాడెవడో మనల్ని గౌరవిస్తాడనుకోవడం ఒట్టి భ్రమ.
నిన్న జెమినిలో ‘బంగారం మీకోసం’లో ఒక ప్రశ్న. “మేఘమధనం’ ప్రాజెక్టు పేరేమిటి అని. దాని పేరే మేఘమధనం కదా ఇంకా పేరేమిటబ్బా అనుకొని, ఇంకేమయ్యుంటుంది ‘ఇందిరా మేఘమధనమో’ రాజీవ్ మేఘమధనమో’ అనుకున్నాను లోలోపల. అంతే నేననుకున్నదే సరైనది. జవాబు “ఇందిరా మేఘమధనము”.
నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మనకింతకంటే మహామహులు లేరా? ఆయనకున్న రాజభక్తిలో మనమందరం కూడా మునిగితేలాలా? రాజీవ్ విమానాశ్రయం, ఇందిరమ్మ పధకం, రాజీవ్ గడ్డి తినే పధకం, ఇందిరా గోళ్ళు కొరుక్కునే పధకం.. ఇంకేం పేర్లు లేవా? తెలుగు దేశం వాళ్ళు ఎంత నయం, అన్న గారు సంస్కృతాంద్రం లో పేర్లు పెడితే బాబు ‘వెలుగూ, ‘దీపం’, ‘జన్మ భూమి, ఇలా అచ్చ తెలుగు పదాల్లో పధకాల పేర్లు పెట్టాడు.
ఈ కాంగిరేసొల్లకి ప్రజలమీద భక్తి కంటే రాచరికభక్తి ఎక్కువ, సేవలో తరించిపోదామనే ఆర్తి ఎక్కువ! అమ్మా సోనియా నీ పాదధూళి సోకినా మా జన్మ ధన్యం అంటూ సాగిలపడతారు. ఆ మధ్య పంచాయితీ ఎన్నికలయ్యాక సర్పంచులు ముఖ్యమంత్రిని కలిసే సీను చూశాను. చిన్నా పెద్దా అని వయసు తేడా కూడా చూడకుండా కాళ్ళమీద సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి నివ్వెరపోయా! ఎంత ప్రజాస్వామ్యదేశమైనా యుగాల రాచరిక వాసనలు ఎలా వదుల్తాయి అంత గమ్మున? ఎంత ప్రభుభక్తి! ప్రజలమీద నమ్మకమున్నవాడు అలా సాగిలపడి నమస్కరించాల్సిన అవసరముందా?
ఇక పోనీలే ఎవడి పిచ్చి వాడిది, ఎవడి భక్తి వాడిది అని వొదిలేద్దామంటే పుట్టపర్తి విగ్రహం తీసేసి ఇందిరమ్మ విగ్రహం, వేమన విగ్రహం తీసేసి రాజీవ్ విగ్రహం పెట్టేస్తే ఎలా? రేపు హైదరాబాద్ పేరు కూడా ఇందిరా నగర్ అని పెట్టేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఎవడి పిచ్చి వాడితో వుంటే ప్రమాదం లేదు కానీ ఆ పిచ్చితో మనల్ని కరిస్తే మాత్రం ప్రమాదమే!
— ప్రసాద్
6:21 సా. వద్ద సెప్టెంబర్ 11, 2006
meeru ceppindi aksharaalaa nijam andi.manam matram emi ceeyagalam.ilaa blogullo boorumanadam tappa.prati pakshaale edoti ceeyali.
11:24 సా. వద్ద సెప్టెంబర్ 11, 2006
చాలా బాగా వ్రాసారు. మీతో నేనూ ఏకీభవిస్తాను.
2:10 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2006
🙂 ఇదే తరహా చాలా సినిమాల్లో ఉంటుంది.పైవాణ్ణి దేవుడి కి కాస్త అటు ఇటు గా చూపించడం.ఐతే మన ప్రభుత్వాలకి కూడా ఈ జబ్బు పట్టిందనమాట.
అన్నట్టు ఈటివీ లో సుమన్ ని కూడా చాలా మంది తెగ పొగిడేస్తూ పైకి ఎత్తేస్తు ఉంటారు(వాళ్ళ ఉద్యోగస్తులే లెండి).
6:36 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2006
మన భారతీయుల రక్తం లో ఇంకా బానిసతనం పోలేదు. “సార్” అనేది మనము తరచుగా వినే మాట. అదే పదం ఇప్పుడు మీరు లండన్ వెళ్ళి అన్నా వాళ్ళు తెగ బాధపడి, అలా పిలవొద్దు ప్లీజ్ అని చెప్తారు. ఇక్కడ మాత్రం ఈ బానిస పదాలన్ని కాకా పట్టడానికి, గౌరవానికి పనికొస్తున్నాయి.
మన రాష్ట్రం నయమండి బాబు..తమిళనాడులో అయితే, కాళ్ళ మీద పడిపోవటమే. ఇక్కడ కూడా ఆ మధ్య చిరంజీవి జన్మదిన వేడుకలలో పవన్ కల్యాణ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. వచ్చిన ప్రతి పిచ్చోడు కాళ్ళ మీద పడి హంగామా చేసారు.
9:35 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2006
అతి వినయం ధూర్త లక్షణం అని..!!! “ఎవడి పిచ్చి వాడితో వుంటే ప్రమాదం లేదు కానీ ఆ పిచ్చితో మనల్ని కరిస్తే మాత్రం ప్రమాదమే!”. So true.. కనీసం కుక్క కరిస్తే మందేసుకోవచ్చు, కొన్ని రోజుల్లో/వారాల్లో తగ్గుతుందేమో, పథకాలకి ఇందిరా/రాజీవ్ పేర్లు పెట్టడం కూడా ఒక రకంగా అలాంటిదేనేమో (TDP వాళ్ళు వచ్చి ఎలాగో ఆ పథకాలు కొనసాగించరు, ఒకవేళ కొనసాగించినా వేరే ఏదో పేరు మారుస్తారు) కాని కేవలం తమ ప్రాపకం కోసం విగ్రహాలు పీకెయ్యడాలు, ఇందిరా/అంబేద్కర్/రాజీవ్ విగ్రహాలతో ఊరూరు వాడ వాడా నింపేయడాలూ, ఊర్లకి/ప్రజా సౌకర్యాలకి పేర్లు మార్చేయడాలు లాంటి చారిత్రక తప్పిదాలు (coz there is no undoing for these kind of things, nobody ever in future would care to/dare to change/correct them) అనేది మాత్రం ఘోరం..!! thats totally unpardonable
11:51 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2006
అవును ఇది మరీ ఎక్కువ చేశాడనిపించింది. వినయానికంటే విధేయత నా కిష్టము. వినయము అంటే పైకి చూపించేదేకదా?
11:53 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2006
ఒక మంచి వ్యాఖ్య గుర్తొచ్చింది.
Those whose serve classes will live in masses. Those who serve masses will live in classes
మహాత్మా గాంధీ మాస్ జనాలకు సేవచేశాడు. అందుకే అలా క్లాస్ గా మిగిలిపోయాడు.
12:37 సా. వద్ద సెప్టెంబర్ 12, 2006
Bhaaratha Yuvatha lo maarpu raanannallu desa rajakeeyala gathi ilage edusthundi.
6:46 సా. వద్ద సెప్టెంబర్ 12, 2006
ఈ పిచ్హి ఎంతగా ముదిరింది అంటె ఇంకా కొన్ని రొజులకు మన బట్టలు కుడా పీకి ఇందిరమ్మ గొవునులు ,సీరలు. రజీవ్ గాంది చొక్క పంచలు వెసుకొవలి లెదంటె పీకి మెమె వెస్తాము…. అనెవిదంగా తయారు అయ్యారండి బాబు ఈ కాంగ్రెసు వాల్లు.
దిలీప్.