Archive for సెప్టెంబర్ 7th, 2006

ఒకసారి ఏమయిందంటే!

సెప్టెంబర్ 7, 2006

నేను కొత్తగా అమెరికా వచ్చిన రోజులు. cobol కు రోజులు చెల్లి Java నేర్చుకుంటున్న రోజులు. ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నప్పూడు అప్పుడే పుట్టిన ఒక దేసి కంపెని నన్నాదుకుంది. ఫుడ్డు బెడ్డు ఇచ్చి జావా నేర్చుకోమంది. ఇంకేం సాధన మొదలెట్టాను. నాకు ఇతరులు చెప్పేది విని నేర్చుకోవడం కంటే చదివి నేర్చుకోవడం ఆసక్తి. వినాలంటే మాత్రం నిద్ర వస్తుంది. Thinking in Java సహాయంతో జావా బాగానే వొంటబట్టింది త్వరగానె! నేనె ఇతరులకు చెప్పడం మొదలు పెట్టాను.
అప్పుడు నాకు ఆశ్రయమిచ్చిన కంపెనీకి జావా ట్రయినింగ్ తరగతులు నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. ఈ కంపెనీ యజమాన్యంలో ఒకాయన వుండేవాడు. ఆయనకు విషయపరిజ్ఞానం లేదనను గానీ, జావా గురించి మాత్రం ఏమీ తెలియదు. ఆయనకు తెలిసిన వన్నీ C++ గురించి. ఆయన పేరు ప్రస్తుతానికి వెంకట్ అనుకుందాం. ఈ వెంకట్ తనకున్న C++ పరిజ్ఞానం తోనే java క్లాసులు నెట్టుకొచ్చేవాడు. ఏదో ఒక బుక్‌లోని సమస్య ఇచ్చి ప్రోగ్రాం రాయమనేవాడు. రాసింది సరిగ్గా వుండొ లేదో నన్ను చూడమనే వాడు! వాళ్ళకు వచ్చిన ఏదైనా ప్రాక్టికల్ సమస్యలకు నన్ను సహాయం చేయమనే వాడు. ఇదంతా తనకు java రాక పడే అవస్త అనే విషయం నాకు రెండు sessions అయ్యాక గానీ అవగతమవలేదు. వచ్చి నట్లుగానే OOPS Concepts చెప్పేవాడు. ఎలాగూ C++ వచ్చు గనక సమస్య లేక పోయింది. అయితే ఒకసారి java లో multiple inheritance ఎందుకు లేదు అనేదానికి సమాధానం చెప్పలేకపోయాడు. “ఏదో కొత్త లాంగ్వేజ్ కనిపెట్టలని తాపత్రయపడి multiple inheritance తీసేసి మళ్ళీ దాన్నే multiple interfaces ను implement చేయవచ్చంటూ మెలికలు తిప్పారు” అని ఈసడించుకున్నాడు. అప్పటికే Thinking in Java ను జీర్ణం చేసుకొని వున్నాను గనుక ఆయన వాదన అసంబద్దమనిపించింది.
ఇదే విషయమై ఒకసారి restroom లో నా సహచరుడు అడిగితే నా అబిప్రాయం చెప్పి “ఈయనకు జావా రాదు గీవా రాదు..ఏదో నెట్టుకొస్తున్నట్టున్నాడు” అన్నాను. దానికి తోడు అవతలి వాడు అతని మీదున్న తన అక్కసు వెళ్ళగక్కాడు.
ఇదంతా అదే restroomలో దొడ్డికి కూర్చొని ఆ ఆఫీసు మేనేజరు వింటున్నాడని మాకు తెలియదు.
ఇక ఆ సాయంత్రం వెంకట్ జావా క్లాసులు ఎలా చెప్తున్నాడు feedbak ఇవ్వండి అంటూ ఆ కంపెనీ డైరెక్టర్ సమావేశం ఏర్పాటు చేశాడు. (ఈ బాత్‌రూంలో విన్న వాడు ఆయనకు అంతా చెప్పేశాడు) మేము బాగానే చెప్తున్నాడు అంటాం మొహమాటం కొద్దీ! అలా గాదు మళ్ళి చెప్పండి అంటాడు ఆ మేనేజరు! మాకెంతకీ అర్థం కాలేదు. చివరికి మధ్యాహ్నం బాత్‌రూంలో మీరనుకున్నదే చెప్పండి అన్నాడు.
అప్పుడు చూడాలి మా మొహం! అప్పుడిక చెప్పక తప్పలేదు ఆయన బోధనలోని కుప్పిగంతులు. అందరికీ తప్పినాయి ఆయన క్లాసులు గానీ మాకు మాత్రం చాలా రోజులు తప్పుచేసిన ఫీలింగ్!

— ప్రసాద్

ఓ గేయమా! నీకు నా వందనం!

సెప్టెంబర్ 7, 2006

వందేమాతరం! వందేమాతరం!

సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం !

శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం !

సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం !

వందేమాతరం! వందేమాతరం!

హా! పాడుతుంటే ఎంత ఆహ్లాదం! ఎంత సుఖం! నరనరాల్ని సంతోషం మత్తులో ముంచే ఈ పాదాలు ఎంత రమ్యం! అది ఏ భాష అని గానీ ఎవరు రాశారు అనిగానీ నా మదిలో స్పురణకు రావు. అవ్యక్తానంద పరిమళాలు ఒళ్ళంతా నిమురుతాయి! రోమాలు సంతోషంతో నిక్కబొడుచుకుంటాయి! ఈ పాట పాడి తన్మయం చెందడం ఎంత వరం! ఏ కారణం వల్లనైనా పాడలేకపోవడం, వినలేకపోవడం ఎంత దౌర్భాగ్యం!

— ప్రసాద్