రామనాధరెడ్డి గారి ఇన్స్పిరేషనుతో నాక్కూడా నా చిన్నప్పటి సంగతులు బ్లాగిద్దామనిపించింది.
బహుశా నాకప్పుడు పద్నాలుగేళ్ళనుకుంటాను. ఇంటి దగ్గర పుస్తకాలు పట్టుకొని చదువుకోవడం మా నాన్నకు ఇష్టం ఉండేది కాదు. పుస్తకం పట్టుకొని ఊరికే ఇంటిదగ్గర కూర్చోకపోతే అలా పొలానికెళ్ళి చెట్టుకింద కూర్చొని చదువుకోవచ్చుగా ఆనేవారు. అలా పుస్తకం పట్టుకొని ఒకసారి పొలానికెళ్ళాను.
అప్పుడు పొలంలో పుచ్చకాయలు ( మా ప్రాంతంలో కర్బూజ కాయలంటాము) మంచి పక్వ దశలో వున్నాయి. మంచి పండిన కాయను తినాలని ఆశ. మంచి కాయను తినే భాగ్యము పండించేవాడికుండదని సామెత కదా! అలా మా నాన్న కూడా అంత ఆకర్షణీయంగా వుండని పళ్ళు తినడానికి ఇచ్చేవాడు.
ఇక ఇప్పుడు కాపలా కాస్తున్నది నేనే కదా! తోటంతటికీ పెద్ద కాయని, బాగా పండిన దానిని తినాలనే నా కోరికను తీర్చుకోవాలను కున్నాను. కానీ పెద్ద కాయ తెలుసుకోవచ్చు గానీ పండిందో లేదో తెలుసుకోవడం ఎలాగా? అన్ని కాయలూ ఆకుపచ్చగానే వున్నాయి. అప్పుడు తళుక్కున ఓ ఉపాయం తట్టింది. మనం పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు అమ్మేవాడు దానికి రంద్రం పెట్టి (టాకా వేసి) పండిందో లేదో చూపిస్తాడు కదా!
మరింకేం వెంటనే నాకు నచ్చిన పెద్ద పెద్ద కాయలను తీగకు తెంపకుండానే రంద్రం వేసి పండిందో లేదో చూస్తున్నాను. పండకపోయి వుంటే రంద్రం కనిపించకుండా కింది వైపుకు తిప్పి ఆకులమధ్యలో వుంచేస్తున్నాను. అలా నాకు నచ్చిన పండిన పండు దొరికేసరికి పదిహేను మంచి కాయలకు టాకాలు పడ్డాయ్.
రెండు మూడు రోజులు గడిచినా మనం చేసిన గొప్పపని తెలియలేదు. మెల్లమెల్లగా వారం గడిచే సరికి నేను చేసిన పని కుళ్ళి పళ్ళు రంగు మారి కుంగిపోవడం మొదలయ్యింది. మా నాన్నకు ఇంట్లో పిల్లలు గుర్తున్నట్లే ఎక్కడ ఏ పళ్ళు ఉన్నాయో కూడ తెలుసు. ఇక ఆరోగ్యంగా వున్న పళ్ళు అలా కుంగి కుళ్ళిపోవడం చూసి వాటిని పరీక్షించారు. ఇంకేముంది అన్నిటికీ ఒకటే కత్తిఫోటు, అన్నిటికీ కిందివైపే. దొంగలకైతే వాటిని దాచిపెట్టాల్సిన అసరమేముంది? దొంగ సులభంగా దొరికిపోయాడు.
ఇక చూడాలి నా అవస్థ. అప్పుడనిపించింది ఇంత తెలివితక్కువగా చేశానేంటి అని. ఏదేమైయినా జరిగింది జరిగిపోయింది. నా అమాయకత్వం వూరందరికీ తెలిసిపోయింది. అందరూ నన్ను చూసి “చదివినోడి కంటే చాకలోడు మేలురా!” అనేవాళ్ళు. ఆ guilty feeling చాలా రోజులు నన్ను వెంటాడింది.
— ప్రసాద్
10:11 సా. వద్ద సెప్టెంబర్ 1, 2006
మీ పుచ్చకాయల పిచ్చి 🙂 బాగుంది.
“మా నాన్నకు ఇంట్లో పిల్లలు గుర్తున్నట్లే ఎక్కడ ఏ పళ్ళు ఉన్నాయో కూడ తెలుసు.” ఈ వాక్యం మరీ బాగుంది.
బర్రెలన్నీ ఒకే రకంగానే ఉంటాయి. మనదేదో కానిదేదో ఎలా కనుక్కుంటారో నాకు అర్థం అయ్యేది కాదు. నాకదో అద్భుతంగా ఉండేది.
1:30 ఉద. వద్ద సెప్టెంబర్ 2, 2006
🙂 baagundi.
2:01 ఉద. వద్ద సెప్టెంబర్ 2, 2006
🙂 బాగుంది.
ఆపాత మధుర జ్ఞాపకాల నెమరు – ఆరిపోబోయే గతస్మృతీ దీపాలకు పోసే చమురు.
10:35 సా. వద్ద సెప్టెంబర్ 5, 2006
భలే వారే! హహ్హహా!
ofcourse ఆ మాత్రం తుంటరి పనులు చెయ్యకపోతే బాల్యానికి fulfilment ఎముందీ?
బాగా వ్రాసారు..
5:54 సా. వద్ద సెప్టెంబర్ 6, 2006
భలే..చాలాబాగుంది
12:23 సా. వద్ద సెప్టెంబర్ 7, 2006
ha ha..chala baagundi.mee chinnanati sangati ela vunna…manchi feeling ni icharu mee rachanatho.