Archive for సెప్టెంబర్ 1st, 2006

పుచ్చకాయ (watermelon)

సెప్టెంబర్ 1, 2006

రామనాధరెడ్డి గారి ఇన్స్పిరేషనుతో నాక్కూడా నా చిన్నప్పటి సంగతులు బ్లాగిద్దామనిపించింది.

బహుశా నాకప్పుడు పద్నాలుగేళ్ళనుకుంటాను. ఇంటి దగ్గర పుస్తకాలు పట్టుకొని చదువుకోవడం మా నాన్నకు ఇష్టం ఉండేది కాదు. పుస్తకం పట్టుకొని ఊరికే ఇంటిదగ్గర కూర్చోకపోతే అలా పొలానికెళ్ళి చెట్టుకింద కూర్చొని చదువుకోవచ్చుగా ఆనేవారు. అలా పుస్తకం పట్టుకొని ఒకసారి పొలానికెళ్ళాను.

అప్పుడు పొలంలో పుచ్చకాయలు ( మా ప్రాంతంలో కర్బూజ కాయలంటాము) మంచి పక్వ దశలో వున్నాయి. మంచి పండిన కాయను తినాలని ఆశ. మంచి కాయను తినే భాగ్యము పండించేవాడికుండదని సామెత కదా! అలా మా నాన్న కూడా అంత ఆకర్షణీయంగా వుండని పళ్ళు తినడానికి ఇచ్చేవాడు.
ఇక ఇప్పుడు కాపలా కాస్తున్నది నేనే కదా! తోటంతటికీ పెద్ద కాయని, బాగా పండిన దానిని తినాలనే నా కోరికను తీర్చుకోవాలను కున్నాను. కానీ పెద్ద కాయ తెలుసుకోవచ్చు గానీ పండిందో లేదో తెలుసుకోవడం ఎలాగా? అన్ని కాయలూ ఆకుపచ్చగానే వున్నాయి. అప్పుడు తళుక్కున ఓ ఉపాయం తట్టింది. మనం పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు అమ్మేవాడు దానికి రంద్రం పెట్టి (టాకా వేసి) పండిందో లేదో చూపిస్తాడు కదా!
మరింకేం వెంటనే నాకు నచ్చిన పెద్ద పెద్ద కాయలను తీగకు తెంపకుండానే రంద్రం వేసి పండిందో లేదో చూస్తున్నాను. పండకపోయి వుంటే రంద్రం కనిపించకుండా కింది వైపుకు తిప్పి ఆకులమధ్యలో వుంచేస్తున్నాను. అలా నాకు నచ్చిన పండిన పండు దొరికేసరికి పదిహేను మంచి కాయలకు టాకాలు పడ్డాయ్.
రెండు మూడు రోజులు గడిచినా మనం చేసిన గొప్పపని తెలియలేదు. మెల్లమెల్లగా వారం గడిచే సరికి నేను చేసిన పని కుళ్ళి పళ్ళు రంగు మారి కుంగిపోవడం మొదలయ్యింది. మా నాన్నకు ఇంట్లో పిల్లలు గుర్తున్నట్లే ఎక్కడ ఏ పళ్ళు ఉన్నాయో కూడ తెలుసు. ఇక ఆరోగ్యంగా వున్న పళ్ళు అలా కుంగి కుళ్ళిపోవడం చూసి వాటిని పరీక్షించారు. ఇంకేముంది అన్నిటికీ ఒకటే కత్తిఫోటు, అన్నిటికీ కిందివైపే. దొంగలకైతే వాటిని దాచిపెట్టాల్సిన అసరమేముంది? దొంగ సులభంగా దొరికిపోయాడు.
ఇక చూడాలి నా అవస్థ. అప్పుడనిపించింది ఇంత తెలివితక్కువగా చేశానేంటి అని. ఏదేమైయినా జరిగింది జరిగిపోయింది. నా అమాయకత్వం వూరందరికీ తెలిసిపోయింది. అందరూ నన్ను చూసి “చదివినోడి కంటే చాకలోడు మేలురా!” అనేవాళ్ళు. ఆ guilty feeling చాలా రోజులు నన్ను వెంటాడింది.

— ప్రసాద్

డబ్బు డబ్బు

సెప్టెంబర్ 1, 2006

ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చుకుంటున్నాం కదా. మరి మన రెవెన్యూ శాఖ ఆ ధనాన్ని మన దేశంలోనే ముద్రించవచ్చు కదా?” శ్రీనివాస గారు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానంగా!
ఆయనకు జవాబు తెలియక కాదు బహుశా ఈ విషయం పై బ్లాగుల్ను ప్రోత్సహించడానికి ఈ ప్రశ్న వేసి వుంటారు.

డబ్బు అనేది మన శ్రమకు, లేదా తయారయిన వస్తువుకు, లేదా సేవకు ప్రతిరూపం. ఈ డబ్బు లేనప్పుడు వస్తు మార్పిడి విధానముండేది. నీవు నాకు గిద్దెడు గోధుమలిస్తే, నేను నీకు గిన్నెడు బియ్యమిస్తా. నీవు నా పొలంలో ఒకరోజు పని చేస్తే నేను రెండుపూటలా భోజనం పెట్టి, ఒక పావు బియ్యమిస్తా! ఇలా వుండేది డబ్బు సృష్టించకముందు లావాదేవీలు జరపడం. అయితే ప్రతి శ్రమకూ దాని విలువను బియ్యం తోనో, పాలతోనో, బంగారంతోనో సరికట్టడం ప్రాతి ప్రాంతానికీ వేరు వేరుగా వుండేది పైగా నిలకడగా వుంచడమూ సాద్యం అయ్యేది కాదు. పైగా శ్రమకు ప్రతిఫలంగా బియ్యమో, నువ్వులో ఇస్తానంటే వాటిని మూటగట్టుకొని వెళ్ళడం ఒక సమస్య! అంతే గాక బహుమానాలు ఇవ్వాలనుకొనే రాజులకు ఇంకా సమస్య!
అప్పుడు డబ్బు పుట్టింది. “ఇదిగో నేను రాజముద్ర వేసి రాసిచ్చిన ఈ పత్రము లేదా నాణెము ఎక్కడికయినా తీసుకెళ్ళి నీక్కావలిసిన బియ్యమో, చింతపండో తీసుకో” అని రాజు ఆజ్ఞాపిస్తే అది రాజాజ్ఞ గనుక అందరూ పాటించేవాళ్ళు. అలా రాజముద్ర వున్న ఆ నాణెమే తదుపరి డబ్బుగా చెలామణీ కావడం ప్రారంబించి వుంటుంది.
అయితే పూర్వము రాజులు ఏవిధంగా సంపదను లెక్కగట్టి ఈ నాణేలను ముద్రించేవారో గానీ ప్రస్తుత ప్రభుత్వాలకు మాత్రము కొన్ని లెక్కలున్నాయి. దాన్ని బట్టి దేశంలో వున్న సేవా సంపద, ఉత్పత్తి విలువనూ బట్టి దానికి సమానంగా డబ్బు చలామణిలో వుండేలా చూస్తారు. డబ్బు ముద్రణ ఉత్పత్తి కంటే ఎక్కువయితే అందరిచేతిలో కొత్త కొత్త కరన్సీ నోట్లు ప్రత్యక్షమై ద్రవ్యోల్బణం అధికమై వస్తువుల రేట్లు పెరిగి డబ్బుకి విలువ తగ్గి పోతుంది. డబ్బులనే తిని అరిగించుకోలేం గదా కావలిసింది వస్తువులు, సేవ, తిండి గింజలు. కనుక డబ్బు అనేది మన సంపదకు ప్రతిరూపమే గానీ అదే సంపద కాదు. డబ్బు అనేది భూమి పట్టా లాంటిది. భూమి లేకుండా పట్టా కాగితాలు తయారుచేసి పంచితే భూమిని పంచినట్లా? ఇది అంతే సంపదను సృష్టించకుండా డబ్బును సృష్టిస్తే దాని విలువ చిత్తు కాగితంతో సమానం. ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా తయారుచేసిన డబ్బుతో జింబాబ్వేలో జరుగుతున్న అరాచకం చూడండి.

ఇక ప్రపంచ బ్యాంకు నుండి అప్పుతెచ్చుకోవడం అంటే పక్కదేశాల సరుకుల్ని, సేవల్ని ప్రస్తుతం ఉచితంగా పొంది భవిష్యత్తులో మన సేవల్ని , వస్తువుల్ని ఉచితంగా ఇస్తామనడం!
— ప్రసాద్