Archive for ఆగస్ట్, 2006

మీరు సింగిలా? (Are you single?)

ఆగస్ట్ 17, 2006

అనిల్ రాసిన“మీరు సింగిలా?” చదివాక అక్కడ నా వాఖ్య రాద్దామని మొదలు పెడితే ఇంత అయ్యింది. 

ఇంతకీ అమెరికాలో మీరు సింగిలా అనడానికి “Are you married” అనేది సరిపోదు గనక. married, మరియు unmarried అనేవి మాత్రమే options అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. పెళ్ళి చేసుకోకుండా కలిసి కాపురం చేసుకొనేవారే ఎక్కువ. పెళ్ళి అయి విడాకులు తీసుకున్నవారు, పెళ్ళామో, మొగుడో చనిపోయిన వారు కూడా సింగిలే.
మీకు పెళ్ళయిందా?
అయి వుంటే, పెళ్ళాం మీతోనే వుందా?
విడాకులిచ్చారా? చచ్చి పోయిందా?
ఇలాంటి ప్రశ్నలు అడక్కుండా మీరు సింగిలా? అంటే సరిపోతుంది.
ఇంకోమాట. మనము ఇంతకుముందు జోకులేసుకొనేవాళ్ళం.
మీకు పెళ్ళయిందా?
లేదు.
పిల్లలెంతమంది? వెంటనే అవతలి వారు చెంప చెళ్ళుమనిపిస్తారు.

లేదా
మీకు పిల్లలెంతమంది?
ఇద్దరు.
మీకు పెళ్ళయిందా? వెంటనే అవతలి వారు చెంప చెళ్ళుమనిపిస్తారు.

కానీ ఇప్పుడు అమెరికాలో ఇలాంటి ప్రశ్నలు official forms అన్నింటిలోనూ వుంటాయి.

అంతే కాదు.
Are you male/female? అని అడిగాక
Is your spouse male/female? అని కూడా అడుగుతారు.
ఎందుకంటే boolean algebra లో 0, 1 కి వున్న నాలుగు combinations లోనూ పెళ్ళిళ్ళవుతాయి గనుక.
ఈ confusion కి తోడు శీల మార్పిడి (sex మార్పిడి) చేయించుకున్న వాళ్ళతో మన సమస్య అంతా ఇంతా గాదు. నిన్నటి వరకు boy friend అయినవాడు ఇప్పుడు girl friend అవుతాడు.
ఇద్దరు పిల్లలున్న Daddy ఇప్పుడు ఆడదయిపోతే ఆ పిల్లలు అతన్ని…ఛీ ఛీ ఆమెని ఏమని పిలవాలి?

ఆ మద్య ఒకాయిన నేను FDCలో పని చేస్తున్నప్పుడు “ఆమె” అయ్యాడు.
అప్పటి వరకు వెళ్తున్న మగవాళ్ళ దొడ్డికి(Toilet) వెళ్ళలేడు, పోనీ అట్లాగని మొన్నటి వరకు మగవాడు గనుక ఆడవాళ్ళ దొడ్డికి వెళ్ళలేడు. ఇక సెక్సును బట్టి తేడా చూపగూడదు గనుక అతనికోసం FDC Family restroom కట్టించింది. అందులోకి ఒక్కసారి ఒక్కరే వెళ్ళచ్చు.

స్వలింగ పెళ్ళిళ్ళు రాజ్యాంగబద్దమని వాదిస్తున్నారు స్వలింగ సంపర్కులు. వాళ్ళ స్వలింగ పెళ్ళిళ్ళలో జోక్యం చేసుకోవడం లింగబేదం చూపడమేనని, అది రాంజ్యాంగవిరుద్దమని వాదిస్తున్నారు.

రేపు కుక్కనో, పిల్లినో పెళ్ళి చేసుకొని ఇది కూడా రాజ్యాంగబద్దమే, ఇది రాంజ్యాంగమిచ్చిన వ్యక్తి స్వేక్ష అంటే కాదనగలమా?

ఆధ్యాత్మికం

ఆగస్ట్ 16, 2006

పుణ్యాత్ముని మరియు దుర్మార్గుని పట్ల డేవుడు ఒకే పక్షపాతం చూపిస్తాడా?
చూపిస్తాడు. అసలు దేవుడికి పుణ్యం, పాపం తెలియవు. ఎండ, గాలి, వెన్నెల అందరినీ ఎలా సమానంగా చూస్తాయో దేవుడూ అట్లానే. వెన్నెల అందరికీ ఒకేలా కాచినా కవికి కనిపించినంత అందంగా పామరుడికి కనిపించకుంటే భేదం మనిషి మనసులో వుందే గానీ దేవుడిలో లేదు.

పాప పుణ్యాల కర్మ పలితాలు తర్వాతి జన్మలకు అనుసరిస్తాయా?
ఏ కర్మ పలితం ఆ జన్మకే పరిమితం. ఈ రోజు మనం చేసిన ఒక పుణ్యకార్యం (పూజలూ, వ్రతాలూ పుణ్యకార్యాలు కాదు) రేపు మనకు మేలు చేయవచ్చు. ఎలాగంటే, అప్పుడెప్పుడో ఒకనికి మా నాన్న సహాయపడ్డాడని ఈ రోజు అతను నాకు సహాయపడటం. ఆ రోజు మా నాన్న చేసిన పుణ్యం ఈ రోజు నాకిలా లబ్ది చేకూర్చిందన్నమాట. అలాగే పాపమూనూ, అప్పుడెప్పుడో నీవు కొట్టిన వాడు ఈ రోజు interview boardలో సబ్యుడుగా వుంటే నీవు పాపపలితం అనుభవించక తప్పదు. ఇలా మనం చేసిన పాపపుణ్యాల పలితాలు మనమో, మన పిల్లలో ఈ భూమిమీద అనుభవించాల్సిందే తప్ప తర్వాతి జన్మలూ లేవు..అనుసరించే తతంగమూ లేదు.

అసలు పునర్జన్మలంటూ ఉన్నాయా?
మానవ జన్మే అన్ని జన్మలకూ వున్నతమయింది అయితే, మానవ జన్మే ముక్తి మార్గానికి అనుకూలమయిందయితే మని మానవ జన్మలు స్థిరంగానైనా వుండాలి లేదా తగ్గాలి గానీ ఇలా పెరుగుతూ ఎలా పోతాయి?సంబోగము, అండోత్పత్తి, ప్రసవము, జీవము ఇవన్నీ ఈ పేద్ద ప్రకృతి ప్రోగ్రాంలో ఒక బాగం. ఆ script ప్రకారం అన్నీ అలా జరుగుతూ వుంటాయి. శరీరం నశించడం తోనే శరీరానికున్న చలన స్వబావమూ, ఆలోచించే తత్వమూ అన్నీ నశిస్తాయి. పంచ భూతాలతో ఏర్పడిన శరీరము పంచ భూతాలతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన వన్నీ మళ్ళీ recycle చేయబడతాయి అయితే అలా recycle చేయబడి ఉత్పత్తి కాబడ్డ వస్తువుకి ఏవిదంగానూ తన ముందుతరపు గుణాలంటే ప్రశ్నే లేదు.

ఏది పాపం? ఏది పుణ్యం?
మహా భారత సూక్తిలా “నీకేది బాధ కలిగిస్తో అది ఇతరులకు చేయక పోవటం, నీకేదీ హాయినిస్తుందో అది ఇతరులకూ పంచటం” పుణ్యం.”నీకు బాధ కలిగించేది ఇతరులకు తలపెట్టడం పాపం.”

జన్మ యొక్క పారమార్థికత ఏమిటి?
జన్మించిన తర్వాత ఏమి చేసినా, ఏమీ చేయకున్నా ప్రకృతి మాత్రం తనపని తను చేస్తూనే వుంటుంది. శరీరం నశిస్తుంది, చలనత్వం పోతుంది.చచ్చే ముందు తర్వాతి తరం వారి జీవితాలను మరింత సుఖమయం చేయగలిగే ఏపని చేసినా జన్మ యొక్క పరమార్థం సిద్దించినట్లే.

మోక్షం అనగా ఏమిటి? అది ఎలా సిద్దిస్తుంది?
జన్మ, పునర్జన్మ చక్రం లోంచి బయట పడటం మోక్షమంటాయి వేదాలు. బయటపడి నాకు నేను మోక్షం పొందితే మానవ జన్మలు ఆగిపోవే! మానవులు పుడుతూనే వుంటారు, కష్టాలు పడుతూనే వుంటారు. వేదాల లెక్కన మనం మోక్షం పొందితే కష్టాలు పడే మానవులకి ఆసరా అందించకుండా తప్పుకున్నవాళ్ళమవుతాం.జీవితకాలంలో చేసిన మంచి పనులవల్ల ఆత్మతృప్తి కలిగి మరణించేటప్పుడు సంతృప్తిగా మరణిస్తే అది మోక్షం కలగడం. ఆ చిట్టచివరి తృప్తి తర్వాత ఏమీ లేదు.

ఇహ లోకంలో లేని స్వర్గనరకాలు పరలోకంలో ఉన్నాయా?
లేవు. అన్నీ ఇక్కడే వున్నాయి. దావూద్ లాంటి వాళ్ళు తప్పులు చేసి తప్పించుకొంటున్నామనుకుంటే పొరపాటే.

ఒకసారి శివుడుకీ, శనికీ ఏదో గొడవ వచ్చిందట. నీవు నన్నేమీ చేయలేవు అన్నాడు శివుడు. నేను తలుచుకుంటే నిన్నైన ముప్పతిప్పలు పెట్టగలనన్నాడు శని. అలా వాదించుకున్నాక ఏదీ నన్నేం చేస్తావో చూస్తానంటూ కైలాసం వదిలి ఒక భయంకరమైన అడివిలో ఓ చెట్టు తొర్రలో నివాసమున్నాడట కొన్నాళ్ళు, అక్కడైతే శని తనని కనిపెట్టలేడని.ఒక వారం తర్వాత బయటకొచ్చి శనిని పిల్చి నీవు నన్నేమీ చేయలేకపోయావు అన్నాడు. అందుకు శని “నా ప్రభావం లేనిదే నీవు చల్లని కైలాసం వదిలి చెట్టు తొర్రలో నక్కావా?” అన్నాడట.అలా అజ్ఞాతంలో, భయం నీడలో బతకడం కూడా ఒక నరకమే. ఆతని పాప పలితాలు అతని పిల్లలనీ చుట్టుకుంటాయి తర్వాత.

వివిధ మతాలు మనిషిలో పాపభీతి కలిగించుటలో ప్రవక్తల, సాదు జనుల, దైవావతారుల అంతర్లీన భావ మేమిటి?
శిక్ష వుంది అంటేనే తప్పు చేయడం మానే పిల్లల్లాంటివారు అధికమంది ప్రజలు గనుక. తప్పుకు కఠిన శిక్షలు అందుకే. పాపమూ లేదు, పునర్జన్మా లేదు, అంటి వచ్చేదీ లేదు అంటే ఏ తప్పుచేసినా కోర్టూ లేదు, తీర్పూ లేదుజైలూ లేదు అనడం లాంటిది. ప్రతి తప్పునూ చూడటానికి ప్రతి ఒక్కడి వెంటా ఒక పోలీసును ఎళ్ళవేళలా వుంచలేము. అదే భయమనే పోలీసును అతడి మనసులోనే పెడితే అదే కాపాడుతుంది తప్పును చేయనివ్వకుండా.

డేవుడు నిర్వికారుడూ, నిర్గుణాకారుడా?
దేవుడు నిర్వికారుడే. కానీ గుణం లేకపోవటమనే గుణమున్నవాడు. మనిషికి అవసరానికి అబద్దమాట్లాడటమూ తెలుసు. కానీ దేవుడికి ఎళ్ళవేళలా సత్యం మాట్లాడమే వచ్చు. గుణముంది, అదే సత్యమే మాట్లాడాలన్నది కానీ విచక్షణ లేదు. రోజూ వర్షం కురిసే చోట “ఈరోజు వర్షం కురుస్తుంది” అన్నది వార్త ఎలా కాదో, విచక్షణ లేక ఎన్ని గుణాలున్నా గుణహీనుడే.

అతని పేరు మీద భజనలు, భక్తి, తంత్రాలు, మంత్రాలు అవసరమా?
అస్సలవసరం లేదు.
దేవుడు భజనలకీ, పూజలకీ, వ్రతాలకీ లొంగడు. “7 habits of highly effective people లో ఈ కథ వుంది.

సముద్రమంతా పొగమంచు కమ్ముకొని వుంది. ఎక్కువ దూరం కనిపించటం లేదు. ఇంతలో నౌక కెప్టన్‌కి వార్త వచ్చింది. దూరంగా ఏదో లైటు వెలుగుతోంది, ఏదో నౌకలా వుంది అని.
కెప్టెన్: అది కదులుతూ వుందా స్థిరంగా వుందా?
నావికుడు: కదలటం లేదు నిశ్చలంగా వుంది.
కెప్టెన్: 20 డిగ్రీలు పక్కగా కదలమని సమాచారమివ్వు. లేకుంటే డీకొట్టుకొనే ప్రమాదముంది.
నావికుడు: డికొట్టుకొనే ప్రమాదముంది. 20 డిగ్రీలు పక్కకు జరగండి.
అటువైపునుండి: మీరే 20 డిగ్రీలు పక్కకు మరలండి.
కెప్టెన్: నేను నౌక కెప్టెన్ చెప్తున్నాను, 20 డిగ్రీలు పక్కకు జరగండి.
అటువైపునుండి: నేనూ అధికారినే, మీరే పక్కకు జరగండి.
కెప్టెన్: మాది సైనిక ఓడ. పక్కకు జరగక పోతే పర్యవసానం ఎదుర్కోవాల్సివుంటుంది, పక్కకు జరగండి.
అటువైపునుండి: ఇది దీప స్థంబము (light house).

ఇక కెప్టెన్ అయినా నౌకలో వుండేది దేశాద్యక్షుడైనా పక్కకు జరగాల్సిందే. దీప స్థంబము పక్కకు జరగదు. దేవుడూ అంతే పూజలూ, వ్రతాలూ, యజ్ఞాలూ, యాగాలూ ఏమీ చేయలేవు.
భజన అన్య విషయాల మీద మనసు పోకుండా వుంచుతుంది. అచంచలమైన భక్తి ఒక భ్రాంతిలో ముంచుతుంది. తంత్రాలూ, మంత్రాలూ ఆ బ్రాంతిని చేరుకోవడానికి సాధనాలవుతాయి. ఇవన్నీ కూడా ఎవరికి వారు తమదైన బ్రాంతిని నిర్మించుకొని అందులో జీవితాన్ని నిష్పలంగా ముగించడానికి తప్ప పరులకు ఉపయోగపడేదేమీలేదు. పరులకు వుపయోగపడని ఏ పూజా, కర్మా కూడా నిష్పలం. పిల్లవాడు బొమ్మలతో ఆటాడుకొన్నట్లు.

ఏది అసలైన దైవ సేవ?
నరసేవే నారాయణ సేవ. జీవి సేవే పరమాత్మ సేవ.”live let live”

అసలు పాపభీతితో దైవసేవ చేయటం అవసరమా?
రామనాధ రెడ్డి అన్నట్లు, గూండాను భయంతో మొక్కినట్లే పాపభీతితో దైవసేవ చేయటం. ఎవరికి వారు జవాబుదారీ. ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలుసు. చేసేది చేసి ఆనక తప్పు చేశాను క్షమించమంటే క్షమించడానికి దేవుడు మనిషి కాదు.

11 వ తారీఖు

ఆగస్ట్ 16, 2006

చదువరి బ్లాగు చూశాక అనిపిస్తోంది ఈ “Al queda” కి 11 వ తారీఖు మంచి రోజేమొ అని. ఇక నుంచి భద్రతను ఆగష్టు 15 లేదా జూలై 4 న పెంచకుండా ప్రతి నెలా 11 వ తారీఖు భద్రతను పెంచాలేమొ!
సెప్టెంబర్ 11, మార్చి 11, జూలై 11.
మొన్నటికి మొన్న బ్రిటన్ లో అరెస్టులు జరక్కపోయి వుంటే వాళ్ళు కూడా ఆగష్టు 11 న తమ పని కానిచ్చేవాళ్ళేమొ అని నాకనిపిస్తోంది. ఈ ఆలోచన ఇంటెలిజెన్స్ వాళ్ళకు వచ్చిందో లేదో!

స్వాతంత్ర్యము

ఆగస్ట్ 15, 2006

ఎన్ని శవాల గుట్టల మీదుగా నడిచింది!
ఎందరు మహానుభావుల ఆయువులను బలిగొంది!
ఎందరు నవ వధువుల తాళిబొట్లను తెంచింది!
ఎందరి కన్నభూమిని వారికి కాకుండా చేసింది!

నేడే వారి ఆత్మలకి శాంతి దినం.
మనకు స్వాతంత్ర్య దినం!

(http://news.bbc.co.uk/1/shared/spl/hi/pop_ups/06/south_asia_india0s_partition/html/1.stm)

నమ్మకం

ఆగస్ట్ 14, 2006

 “యజ్ఞాలు, యాగాలు మరియు
పూజలు ఎందుకు వీటిని
నమ్మవచ్చా?” ప్రశ్నకు నా సమాధానం.

దయ్యం పట్టిందని నమ్మేవాడికి భూతవైద్యుడే సరైన వైద్యం. మా తాత ఒక కథ చెప్పేవాడు. ఒకడు తెల్లవారుజామున దొడ్డికి ఆరుబయలు వెళ్ళినప్పుడు ఓ తొండ తనవైపే పరుగెట్టుకొచ్చి, తన కాళ్ళ మధ్య మాయమైపోయిందట. అప్పట్నుంచి వాడీకి కడుపులో ఏదో దేవినట్లు, తొండ తిరుగుతున్నట్లు అనిపించి మంచం పట్టేశాడట. ఎన్ని వైద్యాలు, మందులూ వాడినా వాని రుగ్మతలను నయం చేయలేక పోయాయి.
చివరికి ఒక తెలివైన మాంత్రికుడు తను నయం చేస్తానని ఒక బయలు ప్రదేశానికి తీసుకువెళ్ళి, ఏవో నోటికి వచ్చిన మంత్రాలు పఠించి దొడ్డికి కూర్చోమన్నాడట. వాడలా ముక్కుతూనే ముందే తెచ్చుకున్న సంచీలోంచి వాడికి తొండను బయటికి తోలి, అదిగో నీ కడుపులో తొండ వెళ్ళిపోతోంది చూడు అన్నాడట. అంతే వీడి కడుపు నొప్పి, తిరుగుడు దెబ్బతో పోయి మళ్ళీ మామూలు మనిషయ్యాడట.

మరి మంత్రం పని చేసిందా లేదా?

పని చేసేది మంత్రం, పూజలూ కాదు; నమ్మకం. రాతిని దేవుడని నమ్మినా అది ఎన్నో జీవితాలను మార్చట్లా? నరకం వుంటుందని నమ్మే వాళ్ళకు అవసాన దశలో యముడు కనపడట్లా? కృష్నుడే దేవుడని, అల్లా నే దేవుడని, క్రీస్తే దేవుని కుమారుడని ఎవరెట్లా నమ్మినా, నమ్మకమే సత్యం, నమ్మబడిందసత్యం. నీవెంత గాఢంగా నమ్మితే పలితం అంత దృఢంగా వుంటుంది.

( ఇప్పుడు దశమ గ్రహం కూడా వుందని అంటున్నారు పరిశోధకులు. మన పూర్వీకులు పండితులే, కానీ మన తాతలు తాగిన నేతుల వాసన మన మూతులకు అంటదు కదా!)

తెలుగు దురభిమానం 3

ఆగస్ట్ 11, 2006

“కలిసి వుంటే కలదు సుఖము” అనేది తిరుగులేని సత్యము. అది నేను చెప్పినా, అమెరికన్ చెప్పినా, అంబనాధ్ చెప్పినా. అది “పాత చింతకాయ పచ్చడి” అన్నంత మాత్రాన సత్యము అసత్యమైపోదు.
ఇక కలిసి వుండటంలో వున్న కష్టాలు, బార్యాభర్తలు కలిసి వున్నప్పుడూ వుంటాయి. అయితే విడిపోయినప్పటి కష్టాలకంటే తక్కువే. ఒక్కసారి కన్నడ, ఉత్కళ, తమిల, ఆంద్ర దేశాలను వూహించుకోండి. కావేరి యుద్దము, కృష్నా యుద్దము, పోలవరం యుద్దం ఇలా ఇప్పటికి అందరమూ నీటికోసం యుద్దాలు చేస్తూ వుండేవాళ్ళం. తెలుగు వాళ్ళు అమెరికాకి, తమిళులు సింగపూర్ కి శ్రీలంకకి, ఈశాన్య రాష్ట్రాలు చైనాకి కొమ్ము కాసి యుద్దాలో, ప్రక్షన్న యుద్దాలో చేసుకుంటు వుండేవాళ్ళం. పరువు, ప్రతిష్ట, గుర్తింపు అనేవి మానవ జీవితాలకంటే గొప్పవి కావు. స్వేచ్చను ఇందులోంచి మినహాయించవచ్చు.
ఇక ప్రత్యేక తెలుగు రాజ్య భావన కొస్తే అసలిది పూర్వమెప్పుడూ లేదనే అనిపిస్తుంది. రాజులు తమకు సాద్యమయినన్ని రాజ్యాల్ని లోబరుచుకొంటూ సామ్రాజ్యాల్ని ఏర్పరచడానికి ప్రయత్నించారేగానీ బాషను బట్టి రాజ్యాలు లేవు. అలాగే మాతృబాష తులు అయినా రాయలు తెలుగుకే తన పట్టము కట్టాడు. అసలు మొన్న మొన్నటి వరకూ మద్రాసుకు తరలిపోయిన తెలుగువారు తమ దేశాన్ని వదిలి పరాయి దేశానికి వెల్తున్నామను కొన్నారా?
అయితే ఈ ఖండమంతా అధిక కాలం వేర్వేరు రాజ్యాలుగా వున్నా, ఆచారాల వల్ల, గురువుల వల్ల దీన్నంతటిని ఏక ఖండంగానే భావించారు. ఆది శంకరాచార్యులు కేరళకే పరిమితం కాలేదు. కాకపోతే ఇప్పుడు ఆంగ్లం చేస్తున్న పని అప్పుడు సంస్కృతం చేసింది. “హంపీ నుండి హరప్పా దాకా” పుస్తకంలో వేర్వేరు భాషల వారు పరిచయవాక్యాలు సంస్కృతంలో జరుపుకొని ఆ తర్వాత ఇద్దరికీ తెలిసిన భాషలో మాట్లాడుకొనేవారని చెప్తారు రచయిత. అలాగే వక్త గానీ, ప్రవక్త గానీ పరాయి భాష వాడని ఆదరించకపోవటం పరాయి దేశస్తుడుగా భావించడం మనకు పూర్వం నుండీ లేదు. మన తెలుగు వాడు త్యాగయ్య తమిళులకు ఆరాద్యదైవమయ్యాడు కదా! అలాగే షిరిడి సాయిబాబా మన ఇంటి దైవం కాలేదా?
మన సంస్కృతిలో మతాన్ని ఆద్యాత్మిక చింతనకీ, భాషను దైనందిన జీవితావసరంగా వాడుకొన్నారే గానీ, దాన్ని బట్టి మేము ప్రత్యేకమనే పొడ వున్నట్లుగా నాకనిపించదు.
ఈ “తెలుగు జాతి”కి పశ్చిమ దేశాల వారు “జాతి”కి ఇచ్చిన గుణాలన్నీ వున్నా, మనం జాతిని విడిగా నిర్వచించుకోవాల్సిందే. మన భరతజాతికి అంతర్లీనంగా వున్న ఏకాత్మత పశ్చిమీయులకు అర్థం కాదు. ఈ రాజకీయ విభజనలన్నీ బ్రిటిష్ వాడి వల్లైతేనేమి, స్వాతంత్ర్యకాంక్షవల్లైతేనేమి, మనకందరికీ ఆంగ్లేయుడు వుమ్మడి శత్రువు కావడం వల్లైతేనేమి, పటేల్ పట్టుదల వల్లైతేనేమి ఒకటయ్యాం. దీన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించాలేగానీ పూర్వమెప్పుడు మేము కలిసిలేమని ఇప్పుడూ కలిసి వుండమంటే ఎలా?
ఈ అంబనాధే చూడండి SAARC చట్రం కింద దక్షిణాసియా రాజ్యాలన్నీ కలిసి వుండాలంటూనే, డిల్లీ చట్రం కింద వుండనంటారు. కొత్తగా ఏ దేశం సభ్యరాజ్యాలనుండీ వుద్బవించినా దాని ప్రత్యేక అనుమతి లేకుండానే అది సార్క్ సభ్యదేశమయిపోవాలంటారు. బలం లేని SAARC తాడుతో కట్టివేయాలని చూసే ఈయన, బలమైన భరతరాజ్య బావనకు మాత్రం తూట్లు పొడవాలంటారు. (మీ, నా అనుమతి లేకుండానే మనల్ని తెలుగు జాతీయవాదుల్ని చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!)
ఇక తెలుగు వారికి జరుగుతున్న న్యాయమేదైనా వుంటే దాన్ని కలిసివుండే ఎదుర్కోవాలి. విడిపోవడానికి లక్ష కారణాలు వున్నా, కలిసి వుండాటానికి ఒక మంచి కారణం చాలు. కలిసివుండటానికే నేనిష్టపడతాను.

దేవుడు రాశాడా?

ఆగస్ట్ 11, 2006

“మన జీవితం మన చేతులొ వుంది
అనడం ఒప్పా ?
ముందుగానె  దెవుడు
వ్రాస్తాడు అనడం ఒప్పా ?”
ఈ ప్రశ్నకు నా స్పందన.

ప్రతి క్రియకు ఓ నిర్దిష్ట పలితాన్ని దేవుడు రాశాడు లేదా ప్రకృతి రాసింది. పలాయన వేగం కంటే తక్కువ వేగంతో పైకి విసిరిన ప్రతిదీ కిందికే పడుతుంది. అది విసిరింది సత్య సాయిబాబా అయినా, నేనయినా. ఆటంబాంబో, హైడ్రోజన్ బాంబో వేస్తే అందరూ చస్తారు, పుణ్యం చేసిన వాడైనా, పాపం చేసిన వాడైనా. అది ప్రకృతి నియమం. రాయబడింది ఈ నియమాలే, మన జీవితాలు కాదు. విద్యుత్తీగను పట్టుకోవడమా, మానడమా అన్నది మన చేతుల్లోనే వున్నది అయితే పట్టుకున్నాక మరణించడమన్నది ప్రకృతి (అనగా దేవుడు) చేతుల్లో వుంది. దేవుడు చేతుల్లో ఏముందో అది సత్యము, మార్చ లేనిది, మార్పు లేనిది, పక్షపాతము లేనిది. మన ఋషుల మాటల్లో చెప్పాలంటే ఈ సత్యమే దేవుడు. గుణరహితమనే గుణమున్నవాడు దేవుడు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, తంత్రాలు, మంత్రాలు ఈ ప్రకృతి నియమాల్ని మార్చవు.
కాబట్టి దేవుడు రాసిందేదో రాసేశాడు, అది నీకు ఒకలా, నాకు ఒకలా రాయడు. ఎండ నిన్నెలా కాలుస్తుందో నన్నూ అలానే. అన్నం నీకెలా ఆకలిని తీరుస్తుందో నాకూ అలానే. వెన్నెల నీకెలా కాస్తుందో నాకూ అలానే. ఇందులో పక్షపాతం లేదు. ఆస్తికుడు, నాస్తికుడు అన్న భేదం లేదు.
మన జీవితం మనం రాసుకొనేదే. నీ చేతిలో రాయితో నీ తలకేసికొట్టుకుంటావో, నా తలకేసి కొడతావో అది నీ చేతిలో వుంది, అది నీవు రాసింది; దేవుడు రాసింది కాదు. ఎవడి తలకేసి కొడితే వాడి తల పగలాలి అని మాత్రమే దేవుడు రాశాడు.

గమనించారా!

ఆగస్ట్ 8, 2006

తెలుగు TV చానల్లలో వచ్చే ఏ ప్రకటనలోనూ తెలుగు ముఖాలే కనపడవు. ఆ మాటకొస్తే దక్షణాది ముఖాలే కనపడవు. అమెరికాలో అయితే తక్కువున్న నల్లవారి ముఖాలే ప్రకటనల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
“అందంగా లేనా
అసలేంబాగా లేనా ..” అని పాడాలనిపిస్తోంది. పనిగట్టుకొని వెతికినా ఒక్క పదహారణాల తెలుగు పిల్ల కానీ పిల్లాడు కానీ కనపడరు. ఈ ఉత్తరాది ముఖాలకి తెలుగు మాటల్ని అతికిస్తుంటే చాలా ఎబ్బెట్టుగా వుంటున్నాయి. సబ్బులు, క్రీములు, పెన్నులు, పెన్సిల్లు, కార్లు ఏ ప్రకటన చూసినా అంతా వుత్తరాది ముఖాలే!
అమ్మో, అంబనాధ్ చూస్తే ఇది హిందీ వాళ్ళ కుట్ర అంటాడేమొ.
మరయితే మన తెలుగు వాళ్ళే తీస్తున్న, తెలుగు వాళ్ళే చూస్తున్న ఈ తెలుగు సినిమాల్లో కూడా అంతా ఉత్తరాది వాసనే. సినిమాకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తున్నా అంతా పైనుంచే దిగుమతి అవుతున్నారు. శ్రీదేవి లాంటివాల్లని ఎగుమతి చేశాక ఇప్పుడు దక్షణాది చతికిల పడ్డట్టుంది.
“గోదావరి” ఎంత బాగుంది! సినిమా అండి. నది ఏం బాలేదిప్పుడు అందరినీ ముంచుతోంది. రాజమండ్రి, బద్రాచలం, పాపి కొండలు, గోదావరి ఇసుక తిన్నెలు అంతా బాగుంది. అమ్మాయి కూడా బాగుందనుకోండి కానీ బెంగాలీ అట కదా! తెలుగు ఆడ పిల్లలకి ఇంత కొరతా!

ఇది పరాకాష్ట

ఆగస్ట్ 7, 2006

 నిన్న జెమిని టివీలో “బంగారం మీకోసం” చూస్తున్నాను. అందులో ఒక ప్రశ్న “Sun flower” పువ్వుని తెలుగులో ఏమంటారు అని!

మన జీవిత కాలంలోనే ఇలాంటి క్విజ్ ప్రశ్నలు ఇంకా వినాల్సి వస్తుంది కాబోలు! జెమిని వాళ్ళ తర్వాతి “బంగారం మీకోసం” కార్యక్రమానికి ఈ క్రింది ప్రశ్నలు చేరిస్తే తెలుగు భాషను ఇంకా వుద్దరించిన వారిమవుతామేమొ 😦

1) మమ్మీ ని తెలుగులో ఏమంటాము?

2) thanks చెప్పాలంటే తెలుగులో ఏమనాలి? sorry అనగా ఏమి?

3) ఉగాది అనే పండుగను ఎందుకు చేసుకొనేవాళ్ళం?

— ప్రసాద్

భలే మంచి అవకాశం!

ఆగస్ట్ 4, 2006

వాళ్ళు దిక్కరించారు గనక మేమూ దిక్కరిస్తాం. వాళ్ళు అగ్గిలో దూకారు గనక మేమూ దూకుతాం. ఇదీ ఇప్పుడు మన నాయకుల వరస. గణేష్ నిమజ్జనానికి తెలంగాణా అవతరణకూ ముడిపెడుతున్న ఈ నరేంద్ర అందరినీ తలదన్నేశారు. ఒద్దురా నాయనా సాగర్ కాలుష్యమైపోతోంది అంటే వైస్రాయ్ హోటల్ చేయట్లేదా అంటాడు, మక్కా మసీదులోపలే చేయకుండా బయట నమాజు చేసి హైకోర్టును దిక్కరించలేదా అంటున్నాడు. ఈయన TRSలో చేరినా RSS వాసనలు పోవట్లేదు. ఈ RSS వాసన అంటుకున్నవాళ్ళకు అది ఆజన్మాంతమూ వుంటుంది. కాకపొతే నరేంద్ర దాన్ని తెలంగాణకు అన్వయిస్తే అంబనాధ్  తెలుగు నాడు కి అన్వయిస్తారు అంతే తేడా. ఇప్పుడు మతాభిమానాన్ని తెలంగాణా వేర్పాటువాదానికి ఎంత చక్కగా వాడుకోవాలనుకుంటున్నాడో చూడండి. మత కల్లోలాలూ జరగొచ్చు అంటూ ముందే వంద శాతం నిజాయితీతో మూర్ఖంగా పనిచేసే మత పిచ్చి గాల్ల ని ఉసిగొల్పడానికి సిద్దమవుతున్నాడు. అడ్డుపడుతున్నది కోర్టు, అక్కడే గణేషుని ముంచుతామంటున్నది మీరు మద్యలో ఈ మత కలహాలు ఎందుకు రావాలి? ముస్లిములు అడ్డుపడలేదే!
రాముడు మునిగిపోతాడని ప్రాజెక్టులు కట్టొద్దు, కాలుష్యమవుతుందని నిమజ్జనము ఆపొద్దు. ఏం హుస్సేన్ సాగర్ లోనే ముంచమని అలిగాడా వినాయకుడు?