కొంతమంది మాట్లేడే ఉత్తమ జీవితం (Quality life) నాకసలు అర్థం కాదు. నిజానికది వ్యర్థజీవితమని నా అభిప్రాయం. అమెరికా జీవితాన్నే తీసుకుంటే ఒక ఇంటికీ మరో ఇంటికీ బోలెడంత దూరం. కనీసం కాసిన్ని టమోటాలు కావాలన్నా కారేసుకొని అధమం రెండు మైళ్ళు వెళ్ళందే కూరగాయల కొట్టు రాదు. పది మైళ్ళ లోపు పని చేసే కార్యాలయం వుంటే అది ఎంతో దగ్గరున్నట్లు. మరీ విచిత్రమేమంటే వ్యాయామం చేయటానిక్కూడా అర లీటరు పెట్రోలు తగలెట్టి కారులో వెళ్ళి అక్కడ మళ్ళీ పది యూనిట్లు విద్యుత్తు తగలేస్తే కానీ శరీరానికి ఉత్తమ వ్యాయామం లభించినట్లు కాదు.
Quality Life పేరుతో చేస్తున్నదంతా పరమ వృధా! నేను రోజు వెళ్ళే రైల్వే స్టేషను లో ఒక sign board ఇలా అంటుంది. గడిచిన వందేళ్ళలో 130 ట్రిలియన్ గాలన్లో బ్యారళ్ళో పెట్రోలు తాగేశాం, అంత పెట్రోలు మరో ముప్పై ఏళ్ళలోనే తాగేయబోతున్నాం కనుక పొదుపు పాటించండి అని. ఈ తాగేయడంలో అమెరికా వాళ్ళ quality life 90 శాతం తాగి వుంటుంది. మొత్తం ప్రపంచానికీ చెందాల్సిన వనరులు అవసరం లేకున్నా చేతిలో పవరుంది, డబ్బుంది గదాని వనరుల్ని నాశనం చేసి భూగోళాన్ని చెత్తకుండి కింద మారుస్తున్నాం.
స్కూలు 20 మైళ్ళు, ఆఫీసు 30 మైళ్ళు, కూరగాయలు వగరా కొట్టు అధమం 2 మైళ్ళు, డాక్టరు 10 మైళ్ళు, బట్టల కొట్టు 15 మైళ్ళు, తెలిసిన దగ్గరి మితృడి ఇంటికి వెళ్ళాలంటే 5 మైళ్ళు …. భూమింది కదాని రోడ్లేసుకొని, ఎక్కడెక్కడో ఇళ్ళు కట్టేసుకొని .. అవసరమా ఇంత దూరాలు? దేవుడిచ్చిన కాళ్ళను కాదని మనిషి తయారుచేసిన కార్ల కాళ్ళు లేనిదే కదలలేని దౌర్భాగ్యం! వారానికి 30 లీటర్లు మన పిల్లలకు మిగిలిస్తామో లేదో తెలియకుండా కాల్చి భూమిని బూడిద కొట్టుగా, గనుల రంద్రాల పుట్టగా మార్చడం అవసరమా?
వాడి పారేయి (Use and throw) అనేది మన quality people తారక మంత్రం. వాడి పారేసి ఈ భూమిని చెత్తకింద మార్చేసి మళ్ళీ అదే చెత్త వాసన అంటకుండా AC రూముల్లో, కలుగుల్లో ఎలుకల్లా అవసరమా ఈ జీవితాలు?
ఒక్కసారి తిని పారేసే చెంచాలు, కప్పులు, తట్టలు, సంచులు ఎంత వ్యర్థం తయారు చేస్తున్నారు ఉత్తమ జీవితాలు గడుపుతున్నామనే వ్యర్థులు. మనం మన తరవాతి తరానికి సంపదలివ్వకపోతే మానె కనీసం ఈ వ్యర్థాన్ని ఇవ్వకపోతే మన జీవితాలు ఎంత సార్థకమవుతాయి.
మునుపటి జీవితాలే చక్కగా వుండేవి కాదూ! మట్టి ముంతలు, మూకుళ్ళు, కుండలు, చట్లు, బానలు అవేవీ ఇప్పుడు. ఖనిజాలన్నీ వాడేస్తున్నాం రేపటి గురించి ఆలోచించకుండా!
అప్పుడెప్పుడొ Matrix సినిమా చూసినప్పుడు అందులో వాడంటాడు ..మానవులు భూమికి పట్టిన వైరస్ అని. ఈ ఒక్కమాట చాలు మనం భూమికి ఇతర జీవాలకీ చేస్తున్న హాని గురించి చెప్పాలంటే.
స్పందించండి