Archive for ఆగస్ట్ 4th, 2006

భలే మంచి అవకాశం!

ఆగస్ట్ 4, 2006

వాళ్ళు దిక్కరించారు గనక మేమూ దిక్కరిస్తాం. వాళ్ళు అగ్గిలో దూకారు గనక మేమూ దూకుతాం. ఇదీ ఇప్పుడు మన నాయకుల వరస. గణేష్ నిమజ్జనానికి తెలంగాణా అవతరణకూ ముడిపెడుతున్న ఈ నరేంద్ర అందరినీ తలదన్నేశారు. ఒద్దురా నాయనా సాగర్ కాలుష్యమైపోతోంది అంటే వైస్రాయ్ హోటల్ చేయట్లేదా అంటాడు, మక్కా మసీదులోపలే చేయకుండా బయట నమాజు చేసి హైకోర్టును దిక్కరించలేదా అంటున్నాడు. ఈయన TRSలో చేరినా RSS వాసనలు పోవట్లేదు. ఈ RSS వాసన అంటుకున్నవాళ్ళకు అది ఆజన్మాంతమూ వుంటుంది. కాకపొతే నరేంద్ర దాన్ని తెలంగాణకు అన్వయిస్తే అంబనాధ్  తెలుగు నాడు కి అన్వయిస్తారు అంతే తేడా. ఇప్పుడు మతాభిమానాన్ని తెలంగాణా వేర్పాటువాదానికి ఎంత చక్కగా వాడుకోవాలనుకుంటున్నాడో చూడండి. మత కల్లోలాలూ జరగొచ్చు అంటూ ముందే వంద శాతం నిజాయితీతో మూర్ఖంగా పనిచేసే మత పిచ్చి గాల్ల ని ఉసిగొల్పడానికి సిద్దమవుతున్నాడు. అడ్డుపడుతున్నది కోర్టు, అక్కడే గణేషుని ముంచుతామంటున్నది మీరు మద్యలో ఈ మత కలహాలు ఎందుకు రావాలి? ముస్లిములు అడ్డుపడలేదే!
రాముడు మునిగిపోతాడని ప్రాజెక్టులు కట్టొద్దు, కాలుష్యమవుతుందని నిమజ్జనము ఆపొద్దు. ఏం హుస్సేన్ సాగర్ లోనే ముంచమని అలిగాడా వినాయకుడు?

ఆత్మలను పలికించేదే (సినారె గీతం)

ఆగస్ట్ 4, 2006

ఆత్మలను పలికించేదే
అసలైన భాష ||ఆత్మలను||
ఆ విలువ కరువైపోతే
అది కంఠ శోష ||ఆత్మలను||

వేదం ఖురాను బైబిల్
వీధిలోన పడతాయా
మతమేదైనా ఒకటేలే
ప్రతి మనిషి శ్వాస ||ఆత్మలను||

అవినీతికి పీఠం వేసి
అభ్యుదయం పూడ్చిన జాతి
ఇకనైనా కళ్ళు నులుముకో
ఇది రక్త ఘోష ||ఆత్మలను||

నానాటికి ఏమీ పతనం
నాలో ఒక తీరని మధనం
ప్రభుత్వాలు ఏమైతేనేమి
పైసాపై ధ్యాస ||ఆత్మలను||

తల నెరిసి పోతే దిగులు
తను వూరి పోతే దిగులు
అది దిగులు కాదు సినారె
తుది జీవితాశ ||ఆత్మలను||

— ప్రసాద్

ఏవో ఏవొ బాధలు (సినారె గీతం)

ఆగస్ట్ 4, 2006

ఏవో ఏవొ బాధలు
భరించె మూగ జీవితం ||ఏవో ఏవొ||
ఎన్నో ఎన్నో గీతలు
భరించె తెల్ల కాగితం ||ఏవో ఏవొ||

శతకోటి హితకోటి వున్నా
గత వైభవం చాటుతున్నా
ఎంతో ఎంతో వేదన
సహించె మాతృభారతం ||ఏవో ఏవొ||

చిరునవ్వు జలతారులున్నా
సరదాల రహదారులున్నా
అయినా అయినా లోకమే
అనంత శోకపూరితం ||ఏవో ఏవొ||

కొరలేని తత్వార్థమున్నా
భువిలోని వృత్తాంతమైనా
అయినా అయినా కావ్యమా
అనున్న కల్పనామృతం ||ఏవో ఏవొ||

తన గొంతు తడియారుతున్నా
మును ముందు ఏ కొండలున్నా
ఏరై పారే జాతికే
సినారె గీత అంకితం ||ఏవో ఏవొ||

— ప్రసాద్

నా హృదయం చలించిపోగానే (సినారె గీతం)

ఆగస్ట్ 4, 2006

నా హృదయం చలించిపోగానే
నడకలు నేర్చుకొంది ఆకాశం ||నా హృదయం||
నా నయనం భ్రమించి పోగానే
నవ్వులు రాల్చుకొంది మధుమాసం ||నా హృదయం||

తనలో తన నీడ చూసుకొని
తననే తడిపి ఆరవేసుకొని
ఎదలో తనకు చోటు చాలదని
పెదవిని చేరుకొంది ధరహాసం ||నా హృదయం||

వీచే గాలి పిలుపు గమనించి
పూచే నేల ఎరుపు పరికించి
పెదవుల బాసలింక చాలునని
పిడికిలి కోరుతుంది ఆవేశం ||నా హృదయం||

బ్రతుకే ఆటలాగ భావించి
పగలే కాగడాలు వెలిగించి
ఆఖరి జాములోన చితిలోన
అశ్రువు లేరుతుంది పరిహాసం ||నా హృదయం||

ఎదురుగా ఎండమావి రమ్మన్నా
ఇదిగో చేదబావి అంటున్నా
కదలని ఓ సినారె నినుచూసి
కాలం మార్చుకొంది తన వేషం ||నా హృదయం||

— ప్రసాద్