Archive for ఆగస్ట్ 3rd, 2006

తెలుగు దురభిమానం 2

ఆగస్ట్ 3, 2006

ప్రతి దానికీ ఎదుటివాళ్ళని నిందించేవాళ్ళు కూడా మానసిక రుగ్మతతో బాధపడుతున్న వాళ్ళే. ఎదుటి పిల్లాడు కొట్టాడనేది మన పిల్ల చెప్పింది సరే మరి మన పిల్ల ఏంచేసిందో తెలుసుకోవడం విజ్ఞుల లక్షణం. ఏ సంఘటననైనా మన తన అనే భేదాలు లేకుండా విశ్లేషించినప్పుడే సత్యం బయట పడుతుంది. మనల్ని ఇంకొకడు ఒకసారి మోసం చేస్తే వాడిది తప్పు, రెండోసారి, మూడోసారీ కూడా మోసం చేస్తే అది మన తప్పు. మీరు, వారూ ఎంత పరాయి వాళ్ళయినా ఈ పరస్పరాధారిత  ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఇంకొకరికి ఏదో ఒకటి అవుతారు. తెలుగు జాతి అభివృద్దికి, తెలుగు భాషకు యూనియ‌న్లో వుండటం ఏ విధంగా చెడు చేస్తుందో? ఆంధ్ర ప్రభుత్వాన్ని తెలుగు భాషను అభివృద్ది చేయకుండా అడ్డుకుంటున్నదెవరో చెప్తే బావుండేది. ఉమ్మడి కుటుంబంలో కొందరికి కొంత అన్యాయం జరగొచ్చు, ఇంకొకరికి కొంత లాభం జరగొచ్చు. నేను సుఖంగా వుండాలి ఇతరులతో నాకు పని లేదు అనేవాడు స్వార్థపరుడు. నేనే గాక నా కులం వాళ్ళూ (లేదా నా భాష వాళ్ళు) బాగుండాలనే వారు ఇంకొంచం హృదయాన్ని తెరిచిన వారు. నేను, నా రాష్ట్రం, నా దేశం, ఈ మొత్తం మానవాళి బాగుండాలని కోరుకునే వారు విశాలహృదయులు. మానవ జాతే కాకుండా సర్వ భూతాలూ బాగుండలని కోరుకొనేవారు ఉత్తమోత్తములు.
చరిత్రలో ఎప్పుడు కూడా మన దేశంలో భాషను బట్టి దేశాలు లేవు, ఇప్పుడు కనీసం రాష్ట్రాలైనా వున్నాయి. మతాలను బట్టి, కులాలను బట్టి పోరాటాలు జరిగాయి కానీ, నాకు తెలిసి భాష ప్రధానంగా యుద్దాలు చేయలేదు.
మనపేర్లు హిందీ పేర్లు పెట్టుకోమని హిందీ వాళ్ళు బలవంతం చేశారా? ఇంగ్లీషు నేర్చుకోమని ఆంగ్లేయులు మనల్ని బలవంతం చేస్తున్నారా? ఇండియన్ యూనియన్‌లో వున్నా, వూడినా మన వాళ్ళు అలా పేర్లు పెట్టుకోవడం మానరు. తెలుగు మీద మీకు శ్రద్ద వుంటే దాని మీద ప్రజల్ని జాగృతం చెయ్యండి, మిమ్మల్ని యూనియన్ ప్రభుత్వము అడ్డుకుంటుందా? ఎంతో మంది తమ పిల్లలకి ‘లెనిన్’ అని పెట్టుకోవడం చూశాను, కానీ మనం కంయూనిస్టుల ఏలుబాదిలో వుండటం వల్ల అలా పెట్టుకోలేదే?
ఇండియా, పాకిస్తాన్ ముక్కలైతేనే గుండెలు బద్దల్వటం ఎందుకు? ఇజ్రాయెల్, లెబనాన్ పోరాటంలో చనిపోతున్న వారి గురించి కూడా బ్రద్దలవుతుంది. ఖచ్చితంగా ఇలా ఆలోచించబట్టె గదా కొన్ని వేల సైన్యంతో ఎక్కడినుంచో వచ్చి విదేశీయులు ఒక్కో బాగాన్ని ఆక్రమించుకోగలిగారు. హిందీ వాళ్ళకి, ముస్లిములకీ కయ్యముంటే మనకెందుకు అని వూరకుంటే చరిత్ర పునరావృతమవుతుంది, పక్కిల్లుతో పాటూ మనిల్లూ కాలుతుంది.
“ఓహ్ ! ఆంధ్రా అంటే రీజినల్. తెలుగంటే narrow mind. అబ్బే, నేను ఆంధ్రాకి పరిమితం కాదు, నేనో జాతీయజీవిని, నేనో అంతర్జాతీయజీవిని” అంటూ అంధ్రాకి సంబంధించినదేదీ వినడానిక్కూడా ఇష్టపడకుండా దులుపుకునిపోయే జాతి సృష్టించబడింది. వలసపోయినవాళ్ళకి ఈ మాట బాధాకరంగా ఉండొచ్చు.”
నన్నడిగితే వలసపోయినోల్లలో వున్న ఆంద్రాభిమానం, దేశాబిమానం స్థానికంగా వున్న వాళ్ళ కంటే గూడా ఎక్కువే. తల్లికి దూరంగా వున్నపుడు తల్లి ప్రేమ గుర్తొచ్చినట్లు, జీవనోపాధి కోసం దూర దేశాల్లో వున్నా ప్రవాసులకున్న బాషాభిమానం ఎవరికీ తక్కువది కాదు. హైదరాబాదు కైనా, బెంగుళురు కైనా, ఇండియా కైనా ఇప్పుడొచ్చిన పేరు ప్రఖ్యాతుల వెనుక ప్రవాసుల హస్తం లేకుండానే జరిగాయి అనుకుంటున్నారా? “ఏ దేశమేగినా ఎందు కాలిడినా..” అన్న గీతాన్ని పాడటమే గాదు, పాటిస్తున్న వాళ్ళూ ప్రవాసులే. ప్రవాసమెళ్ళిన ఏ వూరి గడపైనా తొక్కి చూడండి ప్రవాసుడి మమకారం తెలుస్తుంది మాతృభూమి మీద. ఆంధ్రాకి సంబందించింది వినడమే కాదు, ఆంద్రా అలవాట్లని, ఆచారాల్ని, భాషని ప్రవాసులు తమ పిల్లలకి నేర్పించినట్లు స్థానికులు నేర్పిస్తున్నారంటే సందేహమే. దూరంగావున్న ప్రవాసులకే తెలుసు జన్మభూమి విలువేంటో.
మీరే ఒకచోట అన్నట్లు 8 కోట్లమంది ఆంధ్రాలో వుంటే మరంత మంది విదేశాల్లో వున్నారు, కొత్త ప్రదేశాలకు విస్తరించకుండా వున్న దాంట్లోనే కాళ్ళు ముడుచుకు కూర్చొని వుంటే కూపస్థమండూకంలా వుండేది తెలుగు జాతి. ప్రవాసులందరూ కన్ననేలని విసర్జించి వచ్చిన వాళ్ళు కాదు, వుంటే కొందరు వుండవచ్చు. బతుకు పోరాటంలో నిచ్చెలనెక్కిన వాళ్ళు, ఆభివృద్దిచెందినా దేశాల ఆకర్షణతో వచ్చిన వాళ్ళు వున్నారు, అయితే మాతృభూమిని మరువని వారే అధికులు.
immigration తోనే అమెరికా బాగుపడిందనే విషయం మీకు తెలియంది కాదు.
” ఆ రకంగా, ఈరోజు తెలుగుభూమిమీద రైతుకూలీలూ, చిన్నజీతగాళ్ళూ, కిరాణా/బట్టల వ్యాపారులూ, మహా ఐతే వీధివీధికీ రాజకీయ నాయకులూ తప్ప, దీని తలరాత మార్చగల మేధావులెవరూ లేకుండా పోయారు. వాళ్ళు లేరు గనక ఇక్కడ పరిస్థితులు మారవు. పరిస్థితులు మారవు గనక వాళ్ళు వెళ్ళిపోతారు.ఇదో విషవలయం.”
ఇంకా మీరు బ్రైన్ గైన్ గురించి తెలుసుకోలేదా? తల రాత మార్చడానికి మేధావులు కావాలనడంలో నేను మీతో ఏకీభవిస్తాను, కానీ అది యూనియన్ నుంచీ విడిపోవడం ద్వార సాధ్యమా?  విడిపోతే మేధావులంతా వలస పోకుండ ఆగుతారా?
“తెలుగుజాతి, ఇండియా- ఈ రెండూ పరస్పర విరుధ్ధమైన loyalties”
తరచి చూస్తే ఈ రెండే కాదు ఇంకా ఎన్నో విరుద్దమైన loyalties కనిపిస్తాయి.
బార్యకు(బర్తకు) విధేయంగా వుండాలా? తల్లిదండ్రులకు విధేయంగా వుండాలా?
కుటుంబానికి విధేయంగా వుండాలా? వూరికి విధేయంగా వుండలా?
జిల్లాకా, రాష్ట్రానికా? రాష్ట్రానికా, దేశానికా?
కన్న తల్లికా, పెంపుడు తల్లికా?
ఇంత మందికి ఏకకాలంలో విధేయంగా వుండగలుగు తున్నప్పుడు తెలుగు జాతికి, భరత జాతికీ విధేయంగా ఎందుకు వుండలేము?
తండ్రిగా, కొడుగ్గా, భర్తగా, మామగా ఇలా ఎన్నో పాత్రలను వ్యక్తిగా పోషించగలుతున్నప్పుడు, తెలుగు సమాజం తనకూ భారతానికీ ఎందుకు విధేయంగా వుండలేదు?

ప్రతి వారికీ తనదే న్యాయంగా అని పిస్తుంది. వాళ్ళ వాళ్ళ పెరిగిన నేపధ్యమూ కారణమవుతుంది. హిట్లర్ తను అనుకొన్నది ధర్మమూ న్యాయమనే అనుకొన్నాడు. జర్మన్ జాతి శ్రేయస్సుకు యూదులే కారణమన్నాడు. రావణాసురున్ని రాముడు చంపడమంత ధర్మమనుకొన్నాడు, యూదుల్ని చంపి జర్మన్ జాతిని రక్షించడం కోసం. మన బుర్రలు కూడా సినిమా మొదలైన దగ్గరినుంచీ విలన్ మీద అసహ్యాన్ని పెంచుకుంటాయి గనక సినిమా చివర్లో హీరో విలన్ని ఎంత క్రూరంగా చంపినా ఈలలు వేస్తాం, సంతోషపడిపోతాం.
మన పరిసరాలు, జీవితంలో ఎదురైన అవమానాలు, కష్టాలు మనం తప్పు చేస్తున్నా తప్పు అననియ్యవు. మన తప్పుకి కారణాలుగా మంకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తాం.

— ప్రసాద్