రావు గారు నన్ను దేవుడి పుట్టుక, రూపం, అంచెలంచెలుగా ఎదిగిన వైనం గురించి రాయమన్నారు.
నేను పురాణాల్లో చెప్పబడిన దేవున్ని, గుడిలో దేవున్ని నమ్మను. ఇకా నేను నమ్మే దేవుడెవరంటే ఈ సృష్టి, ఈ శక్తి. ఈ గ్రహాలూ, నక్షత్రాలూ, జీవులూ అన్నిటిలోనూ చోదక శక్తిగా వున్న శక్తిని దేవుడంటాను. సైన్సు చెప్పే ప్రాధమిక సూత్రాలన్నీ దేవుడి లక్షణాలంటాను. దేవుడి గుణాలయినా, లక్షణాలయినా స్థిరమయినవి. అవి నీతిమంతుడికి, నేరస్తుడికి ఒకేలా వర్తిస్తాయి. నీరు ఒకేలా దప్పిక తీర్చినట్లు, నీడ ఒకేలా చల్లదనాన్ని ఇచ్చినట్లు. ఆ శక్తికి మంచి, చెడ్డా విచక్షణ తెలియదు. పసి పాపకి, వృద్దుడికి తేడా తెలియదు. ఈ విశ్వమంతా కొన్ని భౌతికసూత్రాలమీద ఆధారపడి వుంది. ఆ సూత్రాలే దేవుడనుకొంటాను.
ఇప్పుడు ఆ దేవుడి పుట్టుక ఎప్పుడు అంటే ఏమనాలి? దేవుడికి పుట్టుక లేదు. ఆది అంతాలు లేవు. ఈ దేవుడు ఎప్పుడూ వున్నాడు, కాలం ఎప్పుడూ వున్నట్లు. దేవుడిని నీవు గుర్తించినా గుర్తించకున్నా దేవుడున్నాడు. నీవు గుర్తించిన రోజు దేవుడు పుట్టినట్లు కాదు. న్యూటన్ కనుక్కోక ముందూ గురుత్వాకర్షణ వుంది తర్వాతా వుంది. అది కనుక్కోబడిందే కానీ తయారుకాబడలేదు, సృష్టింపబడలేదు. దానికి పుట్టుక లేదు. అలాగే అంతమూ లేదు. రేపు మానవ జాతి అంతా అంతమైనా అది వుంటుంది. దాన్నే సత్యము అని కూడ అనొచ్చు. ఏది మార్పు చెందదో, ఎప్పటికీ నిలిచి వుంటుందో అది సత్యము. దానికి ఆది అంతాలు లేవు. వేదాలు గురించి ఇలాగే అంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది రాయబడిన వాటి గురించి కాదు ప్రవచించబడిన ధర్మాల గురించి. ధర్మము ఎప్పుడూ ధర్మమే మనిషి పుట్టకముందునుంచీ, మనిషి నశించి పోయాక కూడా!
ఇక రూపము! నా దేవుడికి రూపం లేదు. అయినా ప్రతి దానిలోనూ చోడొచ్చు. శక్తి కనపడదు, దాన్ని అనుభవించాల్సిందే! గాలిని స్పర్షాజ్ఞానముతో తెలుసుకున్నట్లు. ప్రతి శక్తీ దేవుడే, ప్రతి జీవీ దేవుడే. ఈ సకల చరాచరాలలోనూ దేన్నీ అతన్నుంచీ మినహాయించలేము. జలచరాలన్నీ ఎలా సముద్రంలోనే వుండి సముద్రం రూపాన్ని చూడలేవో అలానే మనమూ దేవుడిలోనే వుండి అతని రూపాన్ని చూడలేము. ఎల్లలు లేని రూపాన్ని, ఊహకు కూడా అందని దూరాన్ని ఎలా అదిగమించి రూపాన్ని చూడగలం! అయిటే ఈ కనిపించేదీ, కనిపించనిదీ, నేను, నువ్వూ అందరం దేవుడిలో భాగమే! ఎక్కడయితే ప్రాధమిక భౌతిక సూత్రాలు న్యాయమౌతున్నాయో అవన్నీ కూడా దేవునిలో భాగమే! రెండు రెళ్ళు నాలుగయ్యే ప్రతిచోటూ దేవుడే!
ఇక అంచెలంచెలుగా ఎదగడానికేముంది. సర్వ వ్యాపితమైనవాడు, పుట్టుక, నశింపు లేనివాడు ఇక పెరిగేదెలా? పెరగడానికి ఇంకేం మిగిలివుంది? పుట్టడం, పెరగడం, నశింపచడం నిర్దేశించే దేవుడికే పుట్టుక వుంటే, పెరుగుదల వుంటే మరి ఆ దేవుడి పుట్టుకకు ముందు ఏమున్నట్లు? వుందడం, వుండకపోవడమనేవి రెండూ దేవుడి భిన్న పార్శ్వాలే అయితే ఇక దేవుడు సృష్టికి ముందూ వున్నట్లే కదా!
— ప్రసాద్