Archive for జూలై, 2006

దృక్కోణ మార్పు (paradigm shift)

జూలై 19, 2006

రెండోసారి 7 habits of higly effective people చదువుతున్నాను. క్రితంసారి ఎప్పుడో చదివాను. నాకు బాగా నచ్చిన విషయాలను ఇందులో ముచ్చటించాలనుకుంటున్నాను.

ఇందులో ఈ దృక్కోణ మార్పు గురించి చాలా బాగా చెపుతాడు. నిజమేంటో అది అట్లాగే ఉంటుంది కానీ వీక్షించేవాడి అద్దాలను బట్టి ఎవదికి వాడు వేరు వేరుగా అర్థం చేసుకుంటాడు అని చక్కటి ఉదాహరణలతో చెప్తాడు.

ఒకసారి రచయిత మెట్రో రైలులో ప్రయాణం చేస్తూ వుంటాడు. అంతా నిశ్శబ్దంగా ఎవరి పనిలో వాళ్ళున్నారు. పత్రికాపఠనంలో కొందరు, నిద్రలో జోగుతూ కొందరు. ఒక స్టేషనులో ఒక పెద్దాయన తన పిల్లలతో ఆ భోగీలోకి ఎక్కుతాడు. ఎక్కినదే తడవు ఆ పిల్లలు అల్లరి చేయటం ప్రారంబిస్తారు. గట్టిగా అరవటం, పరిగెత్తడం ఇలా నిశ్శబ్దాన్ని బంగం చేశారు. కానీ వళ్ళతో వచ్చిన ఆ పెద్ద మనిషి మాత్రం వాళ్ళని పల్లెత్తు మాట అనటం లేదు, తనదే లోకంగా వాళ్ళు చేస్తున్నది ఎరగనట్లుగా కూర్చుని వున్నాడు. సహజంగానే రచయితకు అతని మౌనం కాస్త ఇబ్బంది కలిగించింది. “మీ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, కాస్తా వాళ్ళని అదుపులో పెట్టడానికి ప్రయత్నించండి.” అని ఆ పెద్దాయనతో అన్నాడు.

అపుడా పెద్దాయన “క్షమించండి ఒక గంట క్రితమే వాళ్ళమ్మ చనిపోయింది, నేను దాన్ని గురించే ఆలోచిస్తున్నాను, ఈ పిల్లలు కూడా ఆ బాధనుండి బయటపడ్డం తెలియక అలా ప్రవర్తిస్తున్నారేమొ.” అంటూ ఆ పిల్లలని మందలించబోయాడు. రచయిత ఆలోచనా దృక్పధంలో వెంటనే మార్పు వచ్చింది. “అయ్యొయ్యో! పరవాలేదు, ఆడుకోనివ్వండి, మీకు నేనేమైనా సహాయం చేయగలనా” అన్నాడు.

ఇప్పటివరకూ పిల్లలు చేసింది అల్లరైతే విషయం తెలిసాక వాళ్ళమీద సానుభూతి, జాలి కలిగాయి.

పిల్లల అల్లరి నిజమే (reality) కానీ ఇంతకు ముందు అది అల్లరిలా అనిపిస్తే ఇప్పుడదే ఆటలా అంపించింది. ఇంతకు ముందు అసహనం, కోపం వస్తే ఇప్పుడు జాలి, కరుణ కలిగాయి.

దృక్కోణంలో మార్పు వచ్చింది.

అయితే ఈ మార్పు ప్రతిసారీ అంత సులఆఅంగా రాదు.

భూమి చదునుగా వుంది అని బండగా వాదిస్తున్నవారు ఇంకా వున్నారు (http://www.alaska.net/~clund/e_djublonskopf/Flatearthsociety.htm). రాజుకు మాత్రమే రాజ్యమేలే హక్కువుంది అన్న దృక్పధం నుండి ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే మార్పు రావటానికి కొన్ని వేల ఏళ్ళు పట్టింది.

రేపు ఇంకో విషయం ముచ్చటిద్దాం.

— ప్రసాద్

పల్లె ప్రజలు అమాయకులా?!

జూలై 17, 2006

హు..నేనూ పల్లెనుండే వచ్చాను. నాకైతే వాళ్ళు అమాయకులు కాదనే అనిపిస్తుంది. కాకపోతే అజ్ఞానులు అనవచ్చు. పట్టణాలలో ఉన్నవారికున్నంత ప్రపంచజ్ఞానం లేకపోయినంత మాత్రాన వాళ్ళు వుట్టి అమాయకులేం కాదు. స్వాతిముత్యం సినిమాలో కమల్‌హాసన్ పాత్ర వుందే అదీ అమాయకమంటే. అమాయకులంటూ వుంటే వాళ్ళు పల్లెల్లోనూ వున్నారు, పట్టణాల్లోనూ వున్నారు.
కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, మోసం, దగా అన్నీ వారికి తెలిసినంతలో వాళ్ళు చేస్తూనే వుంటారు. కాకపోతే వాళ్ళ పరిమితమైన జ్ఞాన పరిధి వల్ల కోలా కృష్నమోహన్ లాగానో, కృషి వెంకటేశ్వర్లు లాగానో మోసం చేయలేరంతే! అవకాశం దొరకక దొరల్లా (అమాయకుల్లా) మిగిలిపోతున్నారంతే!

ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు కదా! మా ఊరూ ఒక చిన్న పంచాయితీయే. మా అన్నయ్య వెళ్ళి ఉరి అందరినీ సమావేశ పరిచి ఎవరికి సర్పంచిగా నిలబడాలనుందో, వాళ్ళు ఊరికి ఏమి మేలు చేద్దామనుకుంటున్నారో అడిగాడట. నిజమే వాళ్ళెంత అమాయకులంటే నిలబడితే ఊరికి చేయడమేమిటి, మమ్మల్ని గెలిపిస్తే ఊరికి లక్ష ఇస్తానని ఒకడంటే, లక్షన్నర ఇస్తానని ఇంకొకడు. అందరికీ పొట్టేళ్ళతో విందు పెడతానని ఒకడంటే, సారాయి కూడా పోయిస్తానని ఇంకొకడు! నేను పోయిన సర్పంచి ఎన్నికల్లో ఓడిపోయా గనుక ఈసారి నన్నే గెలిపించాలని ఒకడు, నేనూ MPTC ఎన్నికల్లో ఓడిపోయాను గనుక నన్ను సర్పంచినైనా చేయాలని ఇంకొకని ఏడుపు.

పోనీ వింటున్న మన ప్రజల్లోనైనా ఇది తప్పు అన్న స్పృహైనా వుందా? అనుమానమే. వాళ్ళక్కూడా ఎక్కువ ఎవడిస్తాడనే. ఎవడు సర్పంచి అయినా వాళ్ళకు పట్టదు, దాని పేరు చెప్పి డబ్బులిస్తున్నారంటే ఎంతో సంతోషము! ఎంతో హడావుడి, హంగామా. ముచ్చట్లకు బోలెడంత ముడిసరుకు.

అలా కాదు, పల్లెకు ఎవరు ఎక్కువ పనులు చేసిపేడతారో, అసలు సర్పంచిగా ఏం చేస్తారు అంటే ఒకరిమీద ఒకరు అరుచుకోవటం ఎవరిపాటికి వాళ్ళు శాసనసభలోలా మాట్లాడటం తప్ప ఏమీ చెప్పలేరు. ప్రతి ఒక్కడి ఉద్దేశ్యమూ ఒకటే, ప్రతిష్ట, అంతో ఇంతో సంపాదించుకోవడం. ఆ మద్య ఓ సర్పంచు మధ్యాహ్నభోజన పథకపు బియ్యాన్ని తోకున సారాకొట్టు బాకీ కింద చెల్లేస్తుంటే, అది సర్పంచిగా వాడి హక్కు అనుకొన్నారే గానీ నోరు ఒక్కరూ మెదపలేదు. మెదపడానికి శక్తి లేక కాదు, వాడేం చేసుకుంటే మనకెందుకు? మన బియ్యం కాదుగా అనే నిర్లిప్తత!

ప్రజాస్వామ్యం, కలిసి నిర్ణయించడం, మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించడం తెలియనన్నాళ్ళూ ఈ స్థానిక ప్రభుత్వాలతో ఊర్లలో గ్రూపులు ఏర్పడడం, కక్షలూ కార్పణ్యాలూ హత్యలకు దారితీయడం మినహా అభివృద్దికి దారితీస్తుందనుకోవడం అత్యాశేమో!

— ప్రసాద్

తక్కువ శ్రమతో ఎక్కువ ఆనందం!

జూలై 17, 2006

జీవించడంలో పరమోద్దేశ్యం ఆనందించడమేనా? ఎక్కువమంది ఏకీభవిస్తారనుకుంటాను. కానీ నిజ జీవితంలో ఎన్నో చక్కటి ఆనందించగల అవకాశాలను వదిలేసి తక్కువ ఆనందాన్నిచ్చే వాటి వెంట పడుతూ వుంటాం.
రోజుకో కొత్త దుస్తులు తొడగడంలో ఆనందమా? చిరిగిన బొంతలో కాళ్ళు ముడుచుకొని చలితో రోజూ యుద్దం చేసే అభాగ్యుడికొక దుప్పటి ఇవ్వడంలో ఎక్కువ ఆనందమా?

వేలూ, లక్షలు ఖరీదు చేసే నగలు కొనుక్కోవడంలో ఎక్కువ ఆనందమా? ఒక లక్షరుపాయలతో గుండె జబ్బు చిన్నారికి జీవితం ఇవ్వడంలో ఎక్కువ ఆనందమా?

ఏడాదికో కొత్త కారులో షికారు ఎక్కవ ఆనందమా? నడవనైనా లేని వికలాంగులకు ఊతం కల్పించడం ఎక్కువ ఆనందమా?

చాలా స్పష్టం. ఉపకారం పొందిన వాడి కళ్ళల్లో ఆనందం, ఉపకారం చేసిన వాడి కళ్ళల్లో ఆనందం సేవ, సహాయం ద్వారానే సాధ్యం. ముంబయి దాడుల బాధితులకై లక్షలు ఖర్చు పెట్టిన ఆ businessman కి ఈ పెట్టుబడిలో వచ్చినంత సంతోషం బహుశా తన ఏ ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ వచ్చి వుండదు.

— ప్రసాద్

అమానుషం!

జూలై 13, 2006


చేయని నేరానికి శిక్ష!

మూగది, చెవిటిదైన అభాగ్యురాలు!
అత్యాచారం చేసిన వాడు చక్కగా జీవిస్తున్నాడు. చేయని నేరానికి కుటుంబమంతా వెలి!
దేవుడున్నాడనే వెర్రివాళ్ళు కర్మ పేరు చెప్పి దబాయిస్తారు. ఋజువు చేయలేని పూర్వజన్మ కర్మలని జారుకుంటారు. ఇంకా ప్రశ్నిస్తే మాయ అనే అజ్ఞానములో ఉన్నానని నా జిజ్ఞాసని తొక్కి పెడతారు. గ్యారంటీ లేని నరకంలో శిక్ష ఉందని బెదిరిస్తారు.
ఛీ ఛీ పొండి! ఆసరాలేని ఈ అభాగ్యుల్ని ఆదుకొన్నవాడే దేవుడు. మీరు పూజించే, ప్రార్థించే దేవుళ్ళని కట్టకట్టుకొని చావమనండి.

ఇదీ మన భారతీయం!

జూలై 13, 2006

సెప్టెంబర్ 11 తర్వాత కోలుకోవటానికి అమెరికాకు ఎన్ని రోజులు పట్టింది?
మాడ్రిడ్ దాడి తర్వాత ఇటలీకి ఎన్ని రోజులు పట్టింది?
లండన్ లో రైళ్ళు, బస్సుల మీద దాడి తర్వాత ఆ దిగ్బ్రమ నుండి తేరుకోవటానికి ఎన్నాళ్ళు పట్టింది?

ఖచ్చితంగా ఒక్క రోజు మాత్రం కాదు.

అదే మన ముంబయి చూడండి. ఒక్కరోజులో ఏమీ జరగనట్టు, రక్తం మరకలు కడిగేసి, పాడైన బోగీల్ని తుక్కు కింద పడేసి మళ్ళీ ఎంత చక్కగా జీవన ప్రయాణం సాగిస్తున్నామో!
చచ్చినవాళ్ళ కర్మ అలా చావాలని ఉంది గనక చచ్చారని సరిపెట్టుకుంటున్నాం. లేకుంటే ఇది మనకు కొత్తా, ఎన్ని బాంబు దాడులు జరగలేదు? ఎంత మంది చావ లేదు?
అయినా చావు దేహానికే గానీ ఆత్మకు కాదని మనకు తెలియదా ఏంటి? మరణం ఎంత అనివార్యమో మళ్ళీ జననమూ అంతే అనివార్యమనే సంగతి అనాది నుంచీ మనకు తెలుసు. అందుకే వీటిని నివారించాలనుకోవటం వొట్టి పనికిమాలిన పని. అసలు కర్మ అలా వున్నప్పుడు ఆపడం మన తరమా! ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లోనే వేల మంది చని పోతున్నారు, ఈ వంద మందీ, రెండొందల మందీ ఒక లెక్కా?
ఈ కర్మ సిద్దాంతాన్ని మనం ఎంత ప్రసిద్దం చేస్తే ప్రపంచంలో అంత శాంతి నెలకొంటుంది. ఎవరి చావుకు ఎవరూ కారణం కాదు, అన్నిటికీ వారి వారి కర్మలే కారణం. ఇది తెలియక జార్జి బూషయ్య ఎంత కుంపటి రగిల్చాడు!! ఆప్ఘనిస్తాను, ఇరాకు రావణ కాష్టాలయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెలు ఈ కర్మ సిద్దాంతము ఎప్పుడు నేర్చుకుంటుందో! ఒక సిపాయిని అపహరిస్తే బడబాగ్నులు కురిపించాలా? అది అతని కర్మని సరిపెట్టుకోక? ఇద్దరు సిపాయిల్ని తీవ్రవాద మూక అపహరించిందని ఏకంగా లెబనాన్ ముట్టడా? రామ రామ! మనల్ని చూసి వారెంతో నేర్చుకోవాలి. ఆ మద్య మన పక్కనున్న బుల్లి బంగ్లాదేషు సైనికులే మన సైనికుల్ని అపహరించి, మొహాలు చెక్కేసి, కిరాతకంగా చంపి పారేస్తే, వారి కర్మ అలా కాలిందని ఊరుకోలేదా?? మన విమానాన్ని హైజాకు చేసి ఆఫ్ఘనిస్తాను నుండీ రాయబారాలు చేస్తే, మనం ఎవరిమీదనైనా ఒక్క తూటా పేల్చామా? తాలిబాన్లని ఒక్కమాట అన్నామా? అది మన రాత అని సరిపెట్టుకొని, మన మంత్రివర్యులే వాళ్ళడిగిన వాన్ని వెంటబెట్టుకొని అప్పజెప్పి రాలేదా?
ఈ ఇజ్రాయెలు ఎప్పుడు నేర్చు కుంటుందో!!
సెప్టెంబర్ 11 దెబ్బకి మళ్ళీ అలాంటిది .. చిన్న బాంబు దాడి కూడా అమెరికాలో జరగలేదు. మన దేశంలో మాత్రం మళ్ళీ మళ్ళీ ఇవి జరుగుతున్నాయంటే మన చేతకానితనం, మన నేతల చేతకానితనం ఎంత మాత్రం కాదు! మన ప్రారబ్దం అంతే!

సెప్టెంబర్ 11 దాడుల తర్వాత స్టాకు బజార్లు కుప్పకూలాయి, విమాన సంస్థలు చేతులెత్తేశాయి. కాని మనం అలాంటి వాటికి జడుస్తామా! ఇలాంటి దాడులు మనల్ని ఏమీ చేయలేవు మన కర్మ అలా వుంటే తప్ప! మన కర్మను ఊహిస్తున్న వాళ్ళంతా ఇంకో పది పదిహేను ఏళ్ళల్లో మనం అగ్రరాజ్యమవుతామంటున్నారే! అందుకే మన స్టాకు బజారు ఉరకలు తీస్తోంది.

భళారే భారతీయం!

రాజ్యమా లేక ప్రియురాలా!

జూలై 5, 2006

రామచంద్ర రాసిన “హంపి నుండి హరప్పా దాకా” చదివేదాక ఈ అష్టమ ఎడ్వర్డ్స్ (Edwards VIII) గురించి నాకు తెలియదు.
ఈయన వలచిన ప్రియురాలి కోసం రాజ్యాన్నే వదులుకున్నాడు. తనే కాక తన సంతానానికీ ఆ హక్కు ఉండదని తెలిసి చక్రవర్తి పదవిని త్యజించాడు.
ఎంత ప్రేమమయుడు!!! ప్రేమ పిపాసి!!!
చక్రవర్తి పదవిని తమ్మునికి అప్పగించి తను చేసిన చివరి ప్రసంగము చదవండి.

http://www.royal.gov.uk/files/pdf/edwardviii.pdf

— ప్రసాద్

జయమాల అయ్యప్ప స్వామిని తాకిందా?

జూలై 3, 2006

అయితే ఏంటట? ఎందుకీ గోల? అసలీ రాతికాలపు ఆచారాలనుండీ మనం బయటికి వచ్చేది ఎన్ని యుగాలకూ జరగదా! అసలు ఆడవాళ్ళని ఎందుకు నిషేదించాలట? స్వామి వారికి ఆ మాత్రము నిగ్రహము లేదా? లేక ఆయన్ను దర్షించే ఆడవాళ్ళు అదుపు తప్పి ఆయన్ను లోబర్చుకుంటారని భయమా? ఆదీ 10 నుంచి 50 ఏళ్ళ మద్య  స్త్రీలు అంటేనే భయమట!!
పవిత్రం, అపవిత్రం.. మ్మ్ .. గూండాలు, ఖూనీకోరులు మెడలో మాలలేసుకొని పాపాలు పోయాయ్, పవిత్రమైపోయాం అనుకొని యాత్ర చేసేస్తున్నారు.. ఏ దుర్బుద్దీ లేకుండా, కేవలం దైవాన్ని చూద్దామని పవిత్ర భావనతోనే వచ్చినా ఆడవాళ్ళన్న కారణంగా తిరస్కారమా??
ఆడవాళ్ళైనందున వారిది పాపమా! కోరికలు అదుపులో పెట్టుకోలేని నీచులది పాపమా!! ఎవరు నిషిద్దులు??
నామట్టుకు నేనైతే ఆ గుడి చాయలకే నా జీవితం లో వెళ్ళను. ఏదో కవి అన్నట్లు “ఈ లోకానికే ప్రవేశద్వారం అమ్మ” ఆ అమ్మకే లేని ప్రవేశం మనకు అవసరమా?
— ప్రసాద్