Archive for జూలై 20th, 2006

జోడు పదవుల బిల్లు తిప్పి పంపుతారట!

జూలై 20, 2006

సిగ్గులేని జన్మలు. కలాం చెబితే మాత్రం వింటారా! ఒక్క పదవీ లేక అల్లాడే నిరుద్యోగులు వేల వేలు. జోడుపదవులుండటానికి మాత్రం అఖిలపక్షాల ఏకాభిప్రాయం! అదే స్త్రీలకు రిజర్వేషన్లకైతే వీరికి సమయముండదు, ఏకాభిప్రాయముండదు!

— ప్రసాద్

ఆరో వేతన సంఘమట!

జూలై 20, 2006

ఏడవాలో నవ్వాలో తెలియట్లేదు. మొన్న మొన్ననే నడ్డి విరిచిన అయిదో వేతన సంఘం జ్ఞాపకాలు మరుగున పడక ముందే ఆరో వేతన సంఘము వచ్చేస్తోంది. ఠంచనుగా ప్రతి నెలా జీతాలు అందుకునే ఉద్యోగుల జీతభత్యాలు పట్టించుకునే వారే గానీ, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు, దినసరి కూలీలకు పట్టించుకునే వారేరి? ఈ వేతన సంఘాలు జీతాలు పెంచిన ప్రతిసారీ ద్రవ్యోల్బణం పెరిగి ముందే కష్టాలలో ఉన్న వారి వెతలు మరింతగా పెరిగిపోతున్నాయి. వాళ్ళకు నెలసరి రాబడి గ్యారంటీ చేసేదెవరు?
విపరీతమైన IT జీతాలే బీదల్ని మరింత దూరంగా ఉంచుతున్నాయంటే ఈ వేతన సంఘాలు తమ వంతు భాద్యత తీసుకుంటున్నాయి.
MP లు తమ జీతాలు, అలవెన్సులు తమ ఇష్టం వచ్చినట్లు పెచ్చుకుంటారు. MLAలు తమ జీతాలు, భత్యాలకు తోడుగా ఖరీదైన నగరాల్లో ఇళ్ళ స్థలాలు కూడా కేటాయింపజేసుకుంటారు.
బీదవాడి వేతన ఎవరికి పట్టింది. ఏరుగాలం కాయకష్టం చేసే రైతుకు ప్రకృతి కొంత అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాలు, వేతన సంఘాలు వీలయినంతమేర వాళ్ళ కష్టాల్ని పెంచుతున్నాయి.

— ప్రసాద్

అండర్‌వేర్ కొలతలు తెలియదంటే ఎలా!

జూలై 20, 2006

వీడు పిచ్చోడో, మద పిచ్చివాడో తెలియటం లేదు! నా నడుం కొలతలు అడిగాడని ఆమె వాపోతే, కాదు, కాదు అండర్‌వేర్ కొలతలు అడిగాను అంటాడు ఆ ప్రబుద్దుడు. నిన్న వాడు విలేకరులతో మాట్లాడ్డం చూసి, ఉమ్మేద్దామని మళ్ళీ నా టీవీనే గదా పాడయ్యేదని వూరుకున్నా!
పరాయి ఆడదాన్ని చెల్లిలా భావించాను అంటూనే అండర్‌వేర్ కొలతలు అడగడం ఏంటి? అంతకుమించి ఉదాహరణలు దొరకలేదా వీడికి?
అనలేదనన్నా అబద్దమాడక అంటే ఏమిటంట అనే వీడు IAS ఎలా అయ్యాడో!

— ప్రసాద్

ఉత్పత్తి మరియు సామర్థ్యత (Production and Production capacity, P/PC balance)

జూలై 20, 2006

దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి రచయిత బాతు, బంగారు గుడ్డు కథ చెపుతాడు. ఇది మనందరికీ తెలిసిందే. ఉత్పత్తిని బంగారు గుడ్డు అనుకుంటే, బాతు ఉత్పత్తి సామర్థ్యము అవుతుంది. ఈ కథలో మంగలి అత్యాశకు పోయి అంత బంగారమూ ఒకేసారి కావాలని బాతు పొట్ట చీలుస్తాడు. అంటే ఉత్పత్తి మీద శ్రద్ద చూపించాడేగానీ ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం చేశాడు. పలితం అసలుకే మోసం.
అలాగే బాతును మాత్రమే పట్టించుకొని బంగారు గుడ్డును నిర్లక్షము చేసినా పలితము సున్నా. కారును సరిగ్గా దాని సామర్థ్యాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలంటే దాని నిర్వహణనీ పట్టించుకోవాలి. బాతు కథలో మంగలిలా కారు నిర్వహణమీద శ్రద్ద చూపకుండా వాడుకుంటే కొన్ని నెలలు బాగానే ఉంటుంది, ఆ తర్వాత అది త్వరలోనే మూలపడి పనికి రాకుండా పోతుంది (చని పోయిన బాతులా). అలా అని కారు నిర్వహణమీద ఇంకో కారు కొనగలిగినంత ఖర్చు చేయడం కూడా పాడి కాదు. ఈ రెండింటి మద్య (P/PC balance) సమతుల్యం ఉండాలి.
మన ఉద్యోగ విషయంలో కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. అప్పుడెప్పుడో సాధించిన డిగ్రీలతో, సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించి నెలవారీ జీతాలు తీసుకుంటూ వుంటే సరి పోదు. నిర్వహణ సామర్థ్యం పెరగాలన్నా లేదా కనీసం అదే స్థాయిలో ఉండాలన్నా మన skills కు పదును పెట్టుకుంటూ వుండాలి. అలాగని ఎన్నో skills వుండి కూడా వాటిని ఉత్పత్తికి ఉపయోగించక పోతే అవి నిష్పలం.

రేపు మొదటి అలవాటు (Habit 1) Proactivity గురించి.

— ప్రసాద్