హు..నేనూ పల్లెనుండే వచ్చాను. నాకైతే వాళ్ళు అమాయకులు కాదనే అనిపిస్తుంది. కాకపోతే అజ్ఞానులు అనవచ్చు. పట్టణాలలో ఉన్నవారికున్నంత ప్రపంచజ్ఞానం లేకపోయినంత మాత్రాన వాళ్ళు వుట్టి అమాయకులేం కాదు. స్వాతిముత్యం సినిమాలో కమల్‌హాసన్ పాత్ర వుందే అదీ అమాయకమంటే. అమాయకులంటూ వుంటే వాళ్ళు పల్లెల్లోనూ వున్నారు, పట్టణాల్లోనూ వున్నారు.
కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, మోసం, దగా అన్నీ వారికి తెలిసినంతలో వాళ్ళు చేస్తూనే వుంటారు. కాకపోతే వాళ్ళ పరిమితమైన జ్ఞాన పరిధి వల్ల కోలా కృష్నమోహన్ లాగానో, కృషి వెంకటేశ్వర్లు లాగానో మోసం చేయలేరంతే! అవకాశం దొరకక దొరల్లా (అమాయకుల్లా) మిగిలిపోతున్నారంతే!
ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు కదా! మా ఊరూ ఒక చిన్న పంచాయితీయే. మా అన్నయ్య వెళ్ళి ఉరి అందరినీ సమావేశ పరిచి ఎవరికి సర్పంచిగా నిలబడాలనుందో, వాళ్ళు ఊరికి ఏమి మేలు చేద్దామనుకుంటున్నారో అడిగాడట. నిజమే వాళ్ళెంత అమాయకులంటే నిలబడితే ఊరికి చేయడమేమిటి, మమ్మల్ని గెలిపిస్తే ఊరికి లక్ష ఇస్తానని ఒకడంటే, లక్షన్నర ఇస్తానని ఇంకొకడు. అందరికీ పొట్టేళ్ళతో విందు పెడతానని ఒకడంటే, సారాయి కూడా పోయిస్తానని ఇంకొకడు! నేను పోయిన సర్పంచి ఎన్నికల్లో ఓడిపోయా గనుక ఈసారి నన్నే గెలిపించాలని ఒకడు, నేనూ MPTC ఎన్నికల్లో ఓడిపోయాను గనుక నన్ను సర్పంచినైనా చేయాలని ఇంకొకని ఏడుపు.
పోనీ వింటున్న మన ప్రజల్లోనైనా ఇది తప్పు అన్న స్పృహైనా వుందా? అనుమానమే. వాళ్ళక్కూడా ఎక్కువ ఎవడిస్తాడనే. ఎవడు సర్పంచి అయినా వాళ్ళకు పట్టదు, దాని పేరు చెప్పి డబ్బులిస్తున్నారంటే ఎంతో సంతోషము! ఎంతో హడావుడి, హంగామా. ముచ్చట్లకు బోలెడంత ముడిసరుకు.
అలా కాదు, పల్లెకు ఎవరు ఎక్కువ పనులు చేసిపేడతారో, అసలు సర్పంచిగా ఏం చేస్తారు అంటే ఒకరిమీద ఒకరు అరుచుకోవటం ఎవరిపాటికి వాళ్ళు శాసనసభలోలా మాట్లాడటం తప్ప ఏమీ చెప్పలేరు. ప్రతి ఒక్కడి ఉద్దేశ్యమూ ఒకటే, ప్రతిష్ట, అంతో ఇంతో సంపాదించుకోవడం. ఆ మద్య ఓ సర్పంచు మధ్యాహ్నభోజన పథకపు బియ్యాన్ని తోకున సారాకొట్టు బాకీ కింద చెల్లేస్తుంటే, అది సర్పంచిగా వాడి హక్కు అనుకొన్నారే గానీ నోరు ఒక్కరూ మెదపలేదు. మెదపడానికి శక్తి లేక కాదు, వాడేం చేసుకుంటే మనకెందుకు? మన బియ్యం కాదుగా అనే నిర్లిప్తత!
ప్రజాస్వామ్యం, కలిసి నిర్ణయించడం, మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించడం తెలియనన్నాళ్ళూ ఈ స్థానిక ప్రభుత్వాలతో ఊర్లలో గ్రూపులు ఏర్పడడం, కక్షలూ కార్పణ్యాలూ హత్యలకు దారితీయడం మినహా అభివృద్దికి దారితీస్తుందనుకోవడం అత్యాశేమో!
— ప్రసాద్
స్పందించండి