ప్రియమైన అన్నయ్యకు నమస్కారములు.
పిల్లలకు నా శుభాకాంక్షలు. వదిన గారికి నమస్సులు.
నాకీ మద్య ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. బహుశా తగినంత పని ఆఫీసులో లేకపోవడం వల్ల అనుకుంటాను. idle mind is devils workshop అని ఎవరో అన్నారట గదా! దెయ్యాలో, దేవతలో గాని మొత్తానికి నా మెదడు పరిపరి విధాలా అలోచిస్తున్నది. ముఖ్యంగా ఈ జీవితము, దీని గమ్యము గురించి పెద్ద చింతే పట్టుకున్నది.
ఎదీ రుచించడము లేదు.ఏది తిందామన్నా ఆకలికి ఆకొన్నవారూ, ఆకలితో చస్తున్నవారూ నా చేతిలోది లాక్కుంటున్నట్లే ఉంది. ఆకలిగొన్న వాడికి పెట్టకుండా నా కడుపుకే నిర్దాక్షన్యంగా, నిర్దయగా తింటున్నట్లే ఉంటుంది. ఆ ఆకలికళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఏమి తిందామన్నా! నా పిల్లల బోసి నవ్వుల్ని చూసినప్పుడల్లా, తల్లీదండ్రీ లేని అనాధ పిల్లలు, బాలకార్మికులూ, వెట్టిచాకిరీ చేస్తున్న వాళ్ళు నాకూ కావాలి ఆ బోసినవ్వులని అడిగినట్లే ఉంటోంది. సరైన వైద్యము లేక చని పోతున్న పసిపిల్లలు ‘మాకేదీ ఆ బోసినవ్వు” అని ప్రశ్నిస్తున్నట్లే ఉంది. మెత్తటి పరుపు మీద ఆఛ్ వేసుకొని పడుకున్నా నిద్రే రావటం లేదు. చలికి, ఎండలకీ చని పోతున్న వాళ్ళ చావుకేకలే విని పిస్తున్నాయి. ఇల్లులేని వాళ్ళు,రోడ్డు పక్క నిద్రపోయి వాహనాల కింద నలిగి చచ్చేవారి రోదనలే వినిపిస్తున్నాయి ఇక నిద్ర ఎలా వస్తుంది. కారులో రోజూ ప్రయానిస్తున్నాననే మాటేగానీ, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి దీనాలాపనలు, చావుకేకలు విపిస్తున్నాయి.
గాలిబ్ గీతాలూ, ఠాగూర్ గీతాంజలి ఇప్పుడేమాత్రమూ రుచించటము లేదు.
ఎందుకు పుట్టాము? ఎందుకు జీవిస్తున్నాము? మనం సంపాదించి, మన పొట్ట నింపుకొని, మన పిల్లల బాగుచూసుకొని, వీలైతే మన మనవల కోసం, మునిమనవల కోసం దాచి పెట్టడమేనా జీవితమంటే!!!! ఇన్ని రోదనల మద్యా, ఆకలి చావుల మద్యా, అభాగ్యుల మద్యా!!! చూస్తుంటే ఈ లోకంలో నాకు తప్ప అందరికీ, అన్నిటికీ ఎదో ఒక పరమార్థము ఉన్నట్లే తోస్తోంది. తనకోసమే తాను ఎదీ కనపట్టం లేదు ఒక స్వార్థపరుడైన మానవుడు తప్ప. చచ్చిన తర్వాత శవాలు కూడా ఉపయోగపడుతున్నాయి, కళ్ళు ఇంక ఇతర శరీర భాగాలూ! క్రిములూ, కీటకాలూ, మన్నూ, ఆకాశం, అగ్ని, నీరు, సముద్రాలూ, కొండలూ అన్నీ, అన్నీ ఎదో విధంగా ఇతరులకు ఉపయోగపడుతున్నాయి…ఒక స్వార్థపరుడైన మనిషి తప్ప. ఉదయాన లేచిన దగ్గరినుండీ పరుగే పరుగు కాస్తంత సమయం దొరుకుట లేదు, పరచింతనకీ, పరోపకారానికి! పరసేవ చేయలేని జీవతము జీవించడమెందుకూ? అదేకదా మనం చేయాల్సిన ఫుల్ల్ తిమె జొబ్? కానీ అంతా తారుమారు అయినట్లుంది, నా పొట్ట కోసం తొంబైతొమ్మిది శాతం, ఒక్క శాతం లేకుంటే అదీ లేదు .. ఇతరుల కోసం!
ఇన్ని ఆలోచనల తర్వాతే మన ఊరిలో తన వారంటూ ఎవరూ లేని ముసలి వారికి, తమ పని తాము చేసుకోలేని బలహీనులకీ కనీసం అన్నం పెడదామనుకొన్నాం కద? పెడితే వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి లేకుంటే ఎవరికీ వద్దు అంటే ఎలా? మనకున్న స్తోమతుకి తిండిలేని అభాగ్యులకు, బలహీనులకూ మాత్రమే కదా ప్రస్తుతానికి పెట్టగలం. మిగతా వారు పెట్టకపోతే నిందిస్తారంటారా? నిందలూ, అపనిందలూ, కీర్తి, అపకీర్తి వీటికి మనం చింతించాలా? ఎవరు ఎన్ని అంటే మనకెందుకు? మన అంతరాత్మ చెప్పిందే చేద్దాం. ఇక ఊరిలో ఎవరికో ఇచ్చి వండమంటే కాజేస్తారంటారా? కాజేయనీ కనీసం కొంతలో కొంతైన అనుకున్న పని జరక్క పోతుందా!
నన్నడిగితే మనమే ఆ పని ఎందుకు చేయకూడదు? నాన్న రోజూ ఉదయం, సాయంత్రం గర్భగుడిలో దేవున్ని పూజించడానికి వెళ్ళేబదులు, ఆకలిగొన్న మనిషి గుడిలోని ఆత్మారామున్ని కొలవడం పుణ్యం కాదా?
నాకైతే ఏదో రోజు ఈ తీవ్రమైన సంఘర్షణ తట్టుకోలేక అన్ని ఇక్కడే వదిలేసి ఇండియా వచ్చి బీదజనుల సేవ చేసుకోవాలని పిస్తోంది. అందరూ నన్ను పిచ్చివాడంటారేమొ! అననివ్వు, ఇన్ని బాధల మద్యా, ఆకలి కేకల మద్యా నవ్వుతూ బతకడం కంటే వారి మద్యనే ఆ బాధల్ని అనుభవిస్తూ చావడం మంచిదేమొ! ఇన్ని ఘోరాల మద్య, నేరాల మద్య, ఆకలి దప్పుల మద్యా చలం ప్రేమ లేఖలో, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమో చదువుతూ ఆనందింపలేకున్నాను. ఎప్పటికైనా నా గమ్యము అదే అనిపిస్తుంది. దీనజన సేవే అసలైన దైవ సేవ అనిపిస్తొంది. ఇప్పుడిప్పుడే నాకు దారి స్పష్టమవుతోంది.
మీరేమంటారో సెలవియ్యండి. అమ్మానాన్నలతో అనకండి వాళ్ళకిదంతా అర్థం కాదు.
ఉంటాను మరి.
ఇట్లు
మీ ప్రియమైన తమ్ముడు
ప్రసాద్