Archive for జూన్ 26th, 2006

హాస్య వల్లరి!

జూన్ 26, 2006

హాస్య వల్లరి!
క్రితం వారం నా కారు servicing కి ఇచ్చాను. office కి వెళ్ళటానికి వాళ్ళ షుత్త్లె లో కూర్చున్నాను. నాటో పాటు ఇంకో నలుగురు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మద్యలో త్రఫ్ఫిచ్ చాలా ఉండి, అందరు అసహనంగా ఉన్నారు. అప్పుడు ఒకావిడ ఇలా మొదలెట్టింది.
   ఒకసారి అమెరికా అధ్యక్షులు బుష్ గారు లండన్ వెళ్ళారు. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ను కలుసుకొని "రాణి గారు! ఇన్నేళ్ళనుండీ ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా జనరంజకంగా మీరు ఎలా పరిపాలించగలగుతున్నారు? మీ దగ్గర ఏమైనా విశిష్ట పద్దతులున్నాయా?" అని అన్నారు. అందుకు రాణి "అందుకు నా గొప్పదనమేమీ లేదు, అంతా సవ్యంగా జరుగుటకు బుద్దిమంతులైన, తెలివిగల వారైన మంత్రులు నా ప్రభుత్వములో ఉండడమే కారణము" అన్నారు.
"వారు తెలిగల వారూ, బుద్దిమంతులూ అని మీకెలా తెలుస్తుంది? మీకు ఆధారమేమిటి?" అని బుష్ అన్నారు. అప్పుడు రాణి గారు తన కాలింగ్ బెల్ నొక్కింది. టోనీ బ్లెయిర్ ప్రత్యక్షమై చేతులు కట్టుకొని "మీ ఆజ్ఞ" అన్నాడు. అప్పుడు రాణి గారు "టోనీ! నీవీ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. ఇది మీ తెలివికి పరీక్ష. ఇందులో నెగ్గలేదో అమెరికాలో మన పరువు పోతుంది." అని "నీ తల్లిదండ్రులకే పుట్టాడు, కానీ నీ సోదరుడు కాదు, మరెవ్వరు?" అని ప్రశ్నించింది. దానికి టోనీ అసలు తడుము కోకుండా "అది నేనే" అన్నాడు. దానికి రాణి సంతోషించి "ఇక నువ్వు వెళ్ళవచ్చు" అన్నది.
బుష్ అతడి తెలివికి ఎంతగానో సంతోషించి, సంబ్రమాశ్చర్యాలతో అమెరికా చేరుకొని తన మంత్రివర్గాన్ని కూడా ఆ ప్రశ్నతో పరీక్షిద్దామనుకొన్నాడు. వెంటనే చేనీ ని పిలిచి "చేనీ ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి, అమెరికా ప్రతిష్ట నువ్వు చెప్పే సమాధానం బట్టి ఉంటుంది. నీకు పది నిమిషాల సమయము ఇస్తున్నాను." అంటూ రాణి టోనీ కి వేసిన ప్రశ్ననే వేశాడు. అప్పుడు చేనీ దీర్ఘాలోచన చేసి "అధ్యక్షా, ఇది మామూలు ప్రశ్న కాదు. ఇందులో అమెరికా రక్షణాంశము ఇమిడి ఉంది. గూడాచారుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రశ్నను చర్చించి సరైన సమాధానం తో తిరిగి వస్తాను" అంటూ బయటకు వచ్చాడు. అందరినీ సమావేశపరిచి అదే ప్రశ్న వేశాడు. ఎవరూ సంతృప్తికరమైన సమాదానం ఇవ్వలేదు. అప్పుడు కోలిన్ ఫావెల్ ను పిలిచి "ఫావెల్, మన పరువును నువ్వే దక్కించాలి, ప్రెసిడెంట్ చాలా కోపంతో ఉన్నాడు. ఈ ప్రశ్నకు నువ్వైనా సరైన సమాధానం చెప్పు" అని "నీ తల్లిదండ్రులకే పుట్టాడు కానీ నీ సోదరుడు కాదు. మరెవ్వరు?" అని ప్రశ్నించాడు. దానికి ఫావెల్ చిరునవ్వు నవ్వి "అది నేనే!" అన్నాడు. చేనీ మొహం వెలిగి పోయింది. వెంటనే బుష్ దగ్గరికి పరుగెట్టి "సమాధానం తెలుసుకున్నాను" అన్నాడు వగురుస్తూ! "ఎమిటా సమాధానం ఆలస్యం చేయక చెప్పు త్వరగా" అన్నాడు బుష్.
"కోలిన్ ఫావెల్" — అన్నాడు చేనీ వెయ్యి వోల్టుల విద్యుత్తుతో మొహం వెలిగి పోతుండగా!!!
బుష్ కు చాలా కోపం వచ్చింది. "నీ మొహం, నీలాంటి అసమర్థులు ఉండబట్టే ఇరాక్ లో మనం ఓడి పోయాం." అన్నాడు కోపంతో ఊగిపోతూ.
చేనీ బిక్కచచ్చి పోయాడు. "ఇంతకూ మరి దానికి సరైన సమాధానం మీకు తెలుసా?" అన్నాడు ఊపిరి బిగపట్టి.
"టోనీ బ్లెయిర్" — అన్నాడు బుష్ సమాధానంగా.
బుష్ సమాధానం విన్నాక కళ్ళలో నీళ్ళు తిరిగేంతవరకు నవ్వాను. మీరూ నవ్వుతున్నారా?

— ప్రసాద్