Archive for జూన్ 20th, 2006

రిజర్వేషాలు

జూన్ 20, 2006

రిజర్వేషాలునాకు తెలుసు ఇది చాలా సున్నితమని. నాకు తెలుసు సమర్థించడానికీ, విమర్శించడనికీ బోలెడంత సరుకుందని. కావాలనే ఈ విషయం మీద నా బ్లాగుని నాంచాను. (వీవెన్ గారు లేఖినిలో nAncAnu ఎలా రాయాలో చెప్పండి.) అదేనండి అంత సున్నితమైన అంశము రిజర్వేషన్లు. చదువరి బ్లాగు చూశాక ఇక తప్పదనిపిస్తోంది.రిజర్వేషన్లు కావాలి, ఉండాలి. అయితే అవి కులాధారంగా ఉండకూడదు. ఇదీ నా స్థూలాభిప్రాయము.

ప్రతిభ

ప్రతిభ కే పట్టం కట్టాలి అందులో అందులో ఎవరికీ లేశమాత్రసందేహముండక్కర్లేదు. అయితే సమ ఉజ్జీల మద్యనే పోటీ ఉండాలి. ఉన్నవారి పిల్లలకి, లేని వారి పిల్లలకి మద్య పోటీ పెట్టి, అందులో అర్హత సాధించిన వాడికే అందలమిస్తామంటే ఎలా? AC రూములో చదివేవాడికీ వీధి దీపం కింద చదువుకునే వాడికీ పోటీ ఎలా సాద్యం. వేలు, లక్షలూ పెట్టి పేరున్న కాలేజీల్లో చదువు కొనే వారికీ, పిల్లల్నీ కూడా పనిలో పెడితే కాని ముద్ద నోట్లోకి రాని వారికీ ఒకే పోటి పెడితే ఎలా? నిజమే మీరన్న విధంగా అటువంటి వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించి ఉన్నవారితో సమానంగా విద్యావకాశాలు కల్పించి … ఇది సాద్యమా? ఎంత వెసులు బాటు కల్పిస్తే మాత్రం లేనివాడి పిల్ల వాడు, ఉన్నవాడి సౌకర్యాలు పొందగలుగుతాడు. నిజంగానే మనం అలాంటి అర్థిక వెసులుబాటు కల్పించగలిగితే ఇంక బీదలనే వారే ఉండరు. కడుపునిండా తినలేని వాడికి డబ్బిచ్చి పుస్తకాలు కొనుక్కోమంటే పుస్తకమా అన్నమా ఏది వాడికి రుచిస్తుంది? కడుపులో ఆకలి దంచేవాడికి, నిత్యమూ జీవనపోరాటం చేసేవాడికి చదువుకోలేని విషయం సమస్యే కాదు. వాడి ఆకలి తీర్చి, వాడి తల్లిదండ్రుల ఆకలి తీర్చి ఇంట్లో కరెంటు దీపం పెట్టి, చదువుకోవటానికి డబ్బులిస్తే ఎందుకు చదవడూ? అప్పుడు మనం ఖచ్చితంగ ప్రతిభకు పట్టం కట్టవచ్చు.

ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు వుండాల్సిందే.

ఎంత మంచి హాస్టళ్ళు ఉన్నా తల్లి ఒడిబడిలో నేర్చున్నంత సౌకర్యం హాస్టల్లో ఉంటుందా?

కారులో, లేదా కనీసం స్కూటర్లో వచ్చి స్కూల్లో చదివే వాడి కెక్కినట్లు నడుచుకుంటూనో లేకా సైకిల్లో చెమటలు కక్కుకుంటూ స్కూలుకు వచ్చి చదివే వాడికి చదువు ఎక్కుతుందా?

మరి సామజిక అసమానతలు ఉన్నంత వరకూ సమాన పోటీ ఎలా సాద్యం?

సామర్థ్యము

చాలామంది వికటంగా రిజర్వేషనుతో దాక్టరైతే వాడివాల్ల జరిగే అనర్థాల గురించి చెపుతారు. సరే, మరి అనర్హుడైనా డబ్బు పోసి పక్క రాష్త్రానికో, పక్క దేశానికో వెల్లి దాక్టరు చదువు కొన్న వారి సామర్థ్యము సంగతేంటి? రిజర్వేషన్లున్నా ప్రతిభ చూసే కదా అర్హుడయ్యేది. ఏ కులానికి ఆ కులంలో ప్రతిభ చూసే కద ఎన్నుకునేది?

ప్రతిభ అన్ని వర్గాల్లోనూ ఉంటుంది. కాకపోతే సౌకర్యాల లేమి వల్ల మార్కులు తగ్గితే అలంటి వారికి అవకాశం ఇవ్వడంలో తప్పేముంది?

కులం

కులాన్ని బట్టి రిజర్వేషన్లు తప్పే. కాని రాజ్యంగ నిర్మాణ సమయంలో ఉన్న సమాజిక పరిస్థిని బట్టి చూస్తే అది న్యాయమే. నిమ్నకులాలలో అప్పుడు ఉన్నవారు అరుదు. ఒకవేళ ఉన్నా అటువాంటివారు కూడ రాజ్యంగ రక్షణ లేనిదే ఏ పదవీ సాధించలేని దుర్గతి. సాధించినా పని చేయడానికి ప్రతి చోటా అగ్రకులాల వారి అవమానాలు పని చేయనివ్వవు. అదీగాక కొన్ని ఏళ్ళ తర్వాత రిజర్వేషన్లు ఉండకూడదనేది వారి ఆలోచన. ఇప్పుడు పరిస్థుల్లో చాలా మార్పులు వచ్చాయి, కనీసం పట్టణాల్లో అయినా కులాన్ని బట్టి అవమానించడం (నాకు తెలిసి) లేదు. బహుశా ఇది సరైన సమయం కులాల ఆధారిత రిజర్వేషన్లు కాకుండా ఆర్థికాధారిత రిజర్వేషన్లు అమలు చేయడం.

రాజకీయం

నిమ్నకులాల్ని, వెనుక బడ్డ కులాల్ని ఉద్దరించడం ఇప్పటి ఏ రాజకీయనాయకుడి అభిమతమూ కాదు. తద్వారా వారి ఓట్లకు గాలం వేయదమే వారి పని.

ప్రతి ఒక్కడు ఆ పేరుతో స్వలాభం చూసుకునేవాడే.

సంస్కరణ

ప్రస్తుత రిజర్వేషన్ల విధానం అంతగా ఫలాల్ని అందిచడం లేదు. వీటిని తప్పక సంస్కరించాలి. ఆ మద్య ఒకాయన పాయింట్ల పద్దతిని సూచించాడు. అది నాకు బాగా నచ్చింది. ఈ పద్దతి ప్రకారం ఆర్థికంగా వెనుకబడ్డందుకు కొన్ని points, నిమ్న కులం అయినందుకు కొన్ని points, స్త్రీ అయినందుకు కొన్ని points, వచ్చిన మార్కులని బట్టి కొన్ని ఇలా మార్కులు ఇస్తారు.

అయితే ఇందులో ఏ ప్రయోగం చేయాలన్నా చాలా సాహసం కావాలి.

చివరి మాట

కులాన్ని బట్టి రిజర్వేషన్లకు నేను వ్యతిరేకినే అయినా ద్వేషిని కాదు. ఎందుకంటే కులాన్ని బట్టి రిజర్వేషను మన సమాజంలో మనువునుండీ వస్తున్న పద్దతి. ఇప్పటికీ దాన్ని సమర్థించేవాళ్ళెందరో ఉన్నారు.

క్షత్రియ వంశములో పుట్టినవాడే రాజు కావాలి.

బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడే పురోహితుడు కావాలి.

వైశ్యుడే వ్యాపారం చేయాలి.

కుమ్మరే కుండలు చేయాలి.

కమ్మరే కమ్మలి పని చేయాలి.

చాకలే గుడ్డలు ఉతకాలి.

మాదిగే చెప్పులు కుట్టాలి.

ఇలాంటివి ఎన్నో అనాదినుండీ కుల రిజర్వేష్న్లుండగా ఇప్పుడు మాత్రమే వాటికి విరుద్దంగా ఇన్ని ఆవేశాలు, ప్రదర్సనలు ఎందుకు?

ఇంతకు ముందెప్పుడైనా మనం కుల రిజర్వేషన్లు ఒద్దని పోరాటం చేశామా? తెలివిలేని దద్దమ్మైనా రాజుకు మొదటి కొడుకైనందుకు రాజ్యాన్ని కట్టబెట్టి అదీ సంప్రదాయమని ఊరుకోలేదా?

తరతరాలుగా నిమ్నకులమని, అంటరానివాడని ప్రతిభ వున్నవాన్ని కుడా వెలివేసి ఊరికి దూరంగా జంతువుకంటే హీనంగా చూసిన పాపానికి ఈనాడు ఇలా ప్రయశ్చిత్తం చేసుకుంటున్నామని అనుకుంటే కొంతైనా ఆత్మతృప్తి లభించదా?

రిజర్వెషన్లు వద్దని గర్జించే మీలో ఎంతమంది ఈరోజు కూడా పల్లెల్లో దళితుడి ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగగాలరు? దలితున్ని మీ ఇంటి లోగలికి అహ్వానించి అన్నం పెట్టగలరు? ఈ రిజర్వేషన్ల మూలంగా సర్పంచులూ, MLA లూ, MP లూ అయిన ఎంతమంది అగ్రకులపు అదిపత్యాన్ని కాదని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు?

నా దేశం చంద్రుడి మీద మనిషిని నిలపక పోయినా ఫర్వాలేదు, దళితున్ని సమాన గౌరవంతో అగ్రకులపోని సరసన నిలిపితే చాలు.

అణుపాటవమున్న దేశంగా నా దేశానికి గౌరవం లేకపోయినా ఫర్వాలేదు, అబలపై నిమిశానికో అత్యాచారం లేకుంటే చాలు.

ఖజానా నిండ విదేశీమారకద్రవ్యము లేకున్నా ఫరవాలేదు, ఆకలితో చావని ఒక రోజున్నా చాలు.

— ప్రసాద్