Archive for జూన్ 16th, 2006

గమనాగమనం — gamanAgamanM

జూన్ 16, 2006

ఆలూరి భుజంగరావు గారి "గమనాగమనం" నుండీ కొన్ని పేరాలు.

కర్నూలు జిల్లాలోని ఒక ఊరిలో తను చుసిన దృశ్యం.
"
… ఆ గ్రామంలో తరచూ కనబడే దృశ్యం.
అక్కడి ప్రజలు మొగవాళ్ళు వారానికి రెండు మార్లు స్నానం చేస్తారు. ఆడవారు ఒక్కమారు స్నానం చేస్తారు. తండ్రి తొట్లో నిలబడి నీళ్ళు పోసుకుంటాడు. కొడుకు తండ్రి పోసుకున్న నీళ్ళు తనమీద పడేట్లు వంగుంటాడు. తండ్రి తన వళ్ళు తోముకుంటూ నీళ్ళు పోసుకొని కొడుకు వళ్ళూ కడుగుతాడు. ఆ మొత్తం నీళ్ళు తొట్లో పడగా పశువులకు పెడతారు. అక్కడి నీటి కరువుకు ఇది ఒక ఉదాహరణ.
"

కాయకష్టం చేసినా కడుపుకింత తినడానికీ, కంటికింత నిద్ర పోవటానికీ లేని దరిద్రపు ఆనవాళ్ళు ఎలావుంటాయో చూడండి.
"యుద్దపు సమయంలో గడియారాల్లో సమయాన్ని ఒక గంట ముందుకు తిప్పారు. అలా ముందుకు తిప్పబడ్డ సమయం ప్రకారం తెల్లవారుజామున మూడుగంటలకు నిద్రలేచి, చాకిరికి నడుం వంచి, ఐదు గంటల వరకూ పని చేసాక అప్పుడు రెంటికి పోవటనికి కొద్ది అవకాశాన్నిచ్చేవారు. అప్పటికి చచ్చే బడలిక, అలసట, నిద్ర మత్తు ఆవరించేవి నన్ను. నేరుగా మూడు కాలవలకు దొడ్డికి వెళ్ళినవాన్ని పాతవంతెన మీద ఆపళంగా పడి నిద్రపోయేవాడిని! మూడు కాలువల్లో మధ్య కాలువ వంతెన కొంచెం వెడల్పుగా వుంటుంది. మనిషి అటూ ఇటూ పొర్లకపోతే దానిమీద పడుకోవచ్చును. ఐతే నిద్రలో ఇటు దొర్లితే రోడ్డుమీద పడతాను; ఏ గుర్రబ్బండో, రిక్షానో మీదుగా వెళ్ళిపోయే ప్రమాదం వుంది. ఇంక అటు దొర్లితే నేరుగా కాలువలోనే పడిపోతాను. ఐనా, నిద్రలేమిని భరించలేక సంవత్సరాల తరబడి ఆ వంతెన మీద పడి నిద్ర పోయాను."

మానవత్వం మరిచి మనిషి చేసే వికృత చర్యలు యివి.
"నేనూ, ప్రకాశం – ఉపద్రష్ట వారి హోటల్ని కొనుక్కున్న చావలినివాసి పిచ్చయ్య హోటల్లో పనిచేస్తున్నాం. అదే హోటల్లో పనిచేసే పతికేళ్ళ యువకుడొకడు రోజూ సరుకులు పట్టుకొచ్చేవాడు బజార్నుండి. అలా తేవడంలో బేడో – పావలో మిగుల్చుకునేవాడు. ఈ విషయం ఎలాగో యజమానికి తెల్సింది. ఇంక ఆయువకుణ్ణి మేడమీద గదిలో పడేసి, మూడురోజులు అన్నం – నీరు ఇవ్వకుందా అమానుషంగా హింసించి నాలుగవరోజు పొద్దూకు మాట్ల గుడ్డలన్నీ వలిచేసి దిశమొలతో బైటకు నెట్టేశారు. ఇంక అక్కడుంటే చంపుతారన్న ప్రాణభీతితో దిశమొలతో, క్రిక్కిరిసిన నడిబజార్లో అతడు పరుగెత్తికెళ్ళిపోవడం ఈనాటికీ – మానసవీధిలో స్పష్టంగా చూడగలుగుతున్నాను."

వున్నవాడికి వస్తువు విలువ తెలీదు. వున్నవాడికి పనికిరాని వస్తువు కూడా లేనివానికి ఎంతో విలువైనదవుతుంది.
"చివరికి ఎలాగైతే యేం – ఓ ఉపాయం తట్టింది! ఒక రోజు సాయంకాలం నేనూ నటరాజన్ రత్నాటాకీస్ దగ్గరకు వెళుతున్నాము. వాడు తెలుగు కథల్ని గురించి చెప్తూ నడుస్తున్నాడు. నేను వింటూ నడుస్తున్నాను. నడుస్తున్నవాణ్ణి, రోడ్డు మీద పడెసి వున్న చార్‌మినార్ సిగిరెట్ పెట్టెను – ఖాళీదాన్ని – చూసి ఆగిపోయాను. వంగి దాన్ని తీసుకున్నాను; అలాంటి ఖాళీపేట్టెల లోపలిభాగం రాసుకోవటానికి వీలుగా ఉంటుందనిపించి! "ఎందుకురా అది?" అడిగాడు వాడు. ఖాళీపెట్టెను చించి పొడవుగా చేసి లోపలి భాగాన్ని చూపుతూ " దీనిమీద గురువుగారు చెప్పిన అర్థాల్ని – నోట్సునూ రాసుకుంటాను!" అన్నాను."

ఇంకా ఇలా ఎన్నో అలనాటి దృశ్యాల్ని వివరిస్తారు ఆలూరి భుజంగరావు గారు. ఇవి ఇప్పటికీ ఎన్నో కుటుంబాలలో సర్వ సాధారణమైనవి. చిన్నప్ట్నుంచీ మయని బట్టలు వేసి, ఆకలి అంటే తెలియకుండా పెరిగిన ప్రతి ఒక్కరూ సాటి బీదవారు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవాలంటే ఇలాంటి రచనల్ని చదవాలి.
టాగూర్ గీతాంజలి, చలం ప్రేమలేఖలూ చదివాలి కాని బీదవాడి జీవితాన్ని చదవటమే, బీదవాడికి సహాయం చేయటమే అసలైన దేవతారాధన, సాహిత్యారాధన. అదే సిద్దికీ మోక్షానికీ ఏకైక మార్గము.