Archive for జూన్ 7th, 2006

నేనెందుకు మాంసాహారము మానేశాను?

జూన్ 7, 2006

నేను మాంసాహారము మానేసినప్పటినుండి ప్రతిఒక్కరూ ఎందుకు మానేశానో చెప్పమంటున్నారు. అది చెప్పేముందు రెండు వాదాల్ని మీకు వివరించాలి.

అ) ఆ మద్య సుప్రీంకోర్టుకు ఒక కేసు వచ్చింది. అందులో ఒక యువకుడు మూడేళ్ళ పసిపాపని లైంగికాపచారము (అత్యాచారము కాదు) చేసాడు. ఆ యువకుడి తరపు న్యాయవాది వాదిస్తూ, "మూడేళ్ళ పాపకి మానావమానాలు తెలియవు గనుక, తన కక్షిదారుడు ఆ పాపని అత్యాచారము చేయలేదు గనుక" పాపని అవమానపరిచాడు అన్న కేసుకి విలువ లేదు అన్నాడు. అందువల్ల కేసు కొట్టివేయమని అభ్యర్థించాడు.

అయితే సుప్రీంకోర్టు అందుకు అంగీకరించక "పాపకు మానావమానాలు తెలియనంతమాత్రాన చేసిన తప్పు మాయమైపోదు" అంటూ అతడికి మామూలుగానే శిక్ష విధించింది.

ఆ)నేను ఇంతకు ముందు మాంసము తింటున్నప్పుడు దానికి నా సమర్థన ఇలా ఉండేది. బలవంతుడిదే రాజ్యము అన్న సూత్రాన్నిబట్టి, బలవంతుడైన మనిషికి బలహీనమైన ఇతర జీవాలు ఆహారమవడం ప్రకృతియొక్క నియమం. ఈ సృష్టిలో ఆహారచక్రంలో ఎవరి కార్యము వాళ్ళు చేస్తేనే, అంటే జింక గడ్డి మేయాలి, పులి జింకను తినాలి, పులి చచ్చి, కుళ్ళి గడ్డికి ఎరువుగా ఆహారం కావాలి. ఇందులో ఎవరు వాళ్ళ పని చేయకపోయినా ప్రకృతి పని భారమవుతుంది.

అయితే నా ఈ వాదానికి గట్టి ఎదురు దెబ్బ, నేను రెండో ప్రపంచయుద్ద సమయములో హిట్లర్ యూదుల్ని పెట్టిన హింసలు గూర్చి చదివినప్పుడు తగిలింది.

నేను మాసము తినడానికి ఏ వాదాన్నైతే సమర్థించానో హిట్లర్ కూడా యూదుల్ని నిర్మూలించడానికి అదే వాదాన్ని సమర్థించాడు. వ్యాధులతో పుట్టిన పిల్లలనీ, వృద్దులనీ, వికలాంగులనీ దయలేకుండా చంపడానికి ఈ వాదాన్నే నమ్మాడు. బలమైన వాడికే బతికే హక్కు ఉంది అన్నాడు. బలహీనమైన వాళ్ళకు, తక్కువ జాతి అనుకున్న వాళ్ళకు సంతానము కలగకుండా శస్త్రచికిత్సలు చేయించాడు. అప్పుడున్న విషప్రచారము వల్ల యూదులు తక్కువ జాతి వారిగా నిర్దారించి వారు బతికియుండడం వల్ల శ్రేష్టమైన జర్మను జాతికి కష్టాలు తప్పవని వారి నిర్మూలనకు పూనుకున్నాడు. ఇది bird flu (పక్షి జ్వరం) కు భయపడి కోళ్ళను నిర్మూలించ పూనుకున్నవిధంగా.

మనము ఆవు (కాకపోతే గొర్రె లేదా కోడి) పాలు పితుక్కొని, ఆవు పేడను ఎరువుగా ఉపయోగించుకొని, దాన్ని చంపి మంసాన్ని తిని, దాని చర్మాన్ని చెప్పులుగా, బెల్టులుగా తయారు చేసుకుని మనల్ని మనం ఎంతో నాగరీకులంగా బావిస్తుంటాము.

హిట్లర్ అకృత్యాలు కూడా ఇదే తరహాలో ఉన్నవి. యూదుల్ని చెరపట్టి, అందులో పనిచేయగల వారితో చచ్చేవరకు పని చేయించుకుని (మనం ఎద్దులతో చేయించుకున్నట్లు) ఆ తర్వాత లేదా ముందే వారి దగ్గరున్న వస్తువులు, సంపదా అంతా కాజేసి, ఆ తర్వాత విషమిచ్చి(లేదా తుపాకి గుళ్ళతో) చంపి, శవానికి తలగొరిగి, అందమైన పచ్చలున్న శరీరభాగాల చర్మాన్ని ఒలుచుకొని, పళ్ళలో ఉన్న బంగారము తోడుకొని ఆ శవాన్ని కొలిమిలో తగలబెట్టేవారు.

తలవెంట్రుకలతో ఎవో గొంగళ్ళు చేసేవారట. పచ్చలున్న శరీరభాగాల చర్మాలతో పడక గది దీపాలకు shades (అందమైన తొడుగులు) చేయించుకునేవాళ్ళట.

ఇందులో జంతువులతో మనము కూడా ఇవన్నీ చేస్తున్నాము కానీ హిట్లర్ ను మాత్రమే దుర్మార్గుడు అంటున్నాము. హిట్లరే కొద్ది నయము, అతని మూక యూదుల్ని చంపింతర్వాత శవాల్ని కాల్చారేగాని ఆ మంసాన్ని తిన్న ఋజువు లేదు. కాని మనం జంతువులతో అవన్నీ చేసి, అపైన ఆ మాంసాన్ని కూడా తింటాము. ఆహా! ఎంత నాగరీకులం.

హిట్లర్ చేసింది తప్పని మనమంతా ఒప్పుకుంటే ఖచ్చితంగా మనము చేస్తున్నదీ తప్పే. ఇక మనకొచ్చే ధర్మసందేహము .. మనుష్యులకు బాధ, సుఖం తెలుసు, జంతువులకు అలాంటి గుణము లేదు అని.

ఇప్పుడు మీరు యువకుదు మూడేళ్ళ పాపకి చేసిన అవమానానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ చదవండి. చేసింది తప్పా కాదా అనేది చేస్తున్నవాడి జ్ఞానము మీద ఆదారపడి ఉందే కాని, జంతువుకు అది తెలుసా లేదా అనేదాని మీద ఆదారిపడిలేదు.

కాబట్టి ప్రకృతికి దయాధర్మాలు లేవు. దానికి తెలిసిందిల్లా క్రియా ఫలితాలు మాత్రమే. ఈ పనికి ఈ ఫలితము ఉంది, అంతే తెలుసు. ఐతే మనిషి కొక్కడికే ధర్మధర్మ విచక్షన తెలుసు గనక, ఆలోచించే శక్తి ఉంది గనుకా, అన్ని జీవులలోకి శక్తి సంపన్నుడైనాదు గనుకా, ఇతర బలహీనులైన జీవుల రక్షణ మనిషి చేతిలోనే ఉంది. ప్రజాస్వామిక ప్రభుత్వము బలహీనుల్ని, బలవంతులనుండి ఎలా కాపాడుతుందో అలాగే బలహీనమైన జీవుల రక్షణ మనిషి భాద్యత.

రక్షించక పోతేమానె జిహ్వచాపల్యముకోసము (ఆకలికోసమైతే తినడానికి చాలా ఉన్నాయి) జంతువుల్ని, జంతువుల్లాగా చంపి వాటి శవాల్ని తినటము మహా నీచము.

మీలో కొందరు వృక్షాలకి కూడా జీవము ఉంది వాటికీ బాధ, సంతోషము తెలుసు, వాటిని తినడం కూడా నీచమే కదా అనవచ్చు.
మీరు చెప్పేది నిజమైయుండవచ్చు. మనుషుల్ని చంపిన హిట్లర్ ఎక్కువ పాపి, జంతువుల్ని చంపే మీరు తక్కువ పాపులు ఐతే మొక్కల్ని చంపి తినే నేను మీకంటే తక్కువ పాపిని. మానవ మేధస్సు ఆ స్థాయికి ఎదిగి మొక్కల్ని కూడ చంపకుండా జీవించడం ఎలాగో తెలుసుకుంటే ఆ రోజు నేను మొక్కల్ని తినడం కూడా మానుకుంటాను.

మీరేమంటారు?

–ఫ్రసాద్

తమ్ముడికి తోక!

జూన్ 7, 2006

మొన్నామధ్య మా మూడేళ్ళ అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి "నాన్నా నాన్నా తమ్ముడికి తోక ఉంది" అంది. నా మందబుద్దికి అదేంటో త్వరగా అర్థం కాలేదు. "తమ్ముడికి తోకేంటమ్మా, పద చూపెట్టు" అన్నాను.
మా ఆవిడ మా తొమ్మిది నెలల పిల్లాడికి డయాపరు మారుస్తూ ఉంది.
"అదిగో నాన్నా తోక" అంటు వాడి మొలవైపు చూపించింది.
ఇక నవ్వడం మావంతైంది.

వ్యధ

జూన్ 7, 2006

కడుపుకింత లేక అల్లాడుతున్నవారి మధ్య నేనెలా ఆకలి తీర్చుకోను?
రహదారి పక్కన కాసింత చోటు చూసుకొని, చిరిగిన బొంతలో చిక్కిన శరీరాన్ని దాచుకొని, చలికోరల్లో చస్తున్న వారి మధ్య నేనెలా సుఖంగా నిద్రింతును?
రైతన్నల ఆత్మహత్యలు, ఆకలిచావులు
నక్సలైట్ల కిరాతకాలు, పోలీసుల ఆగడాలు
ఉన్మాదుల రక్తపు క్రీడలు, పసివాళ్ళ ఆర్తనాదాలు
ఇన్ని అకృత్యాల మధ్య
నాకేమీ తెలీనట్లు, నాకేమీ వినబడనట్లు, కనబడనట్లు
మూగ, చెవిటి, గుడ్డి వాడిలా ఎన్నాళ్ళని నివసించను?

పుణ్యాత్ముని మరియు దుర్మార్గుని పట్ల డేవుడు ఒకే పక్షపాతం చూపిస్తాడా?

జూన్ 7, 2006

నా అభిప్రాయం ప్రకారం దేవుడు అందరిపట్లా ఒకేలా ప్రవర్తిస్తాడు.

అన్నమయ్య కీర్తన ఈ సందర్బంగా గుర్తుకు వస్తోంది. మహారాజుకైనా, కటిక బీదవాడికైనా నిద్ర ఒకటే. ఐశ్వర్యవంతునకైనా, అడుక్కుతినువానికైనా ఆకలి ఒక్కటె. ఇంకా ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు.

సూర్యుడి ఎండ దుర్మార్గుడి మీద మరియు సన్మార్గుడి మీద ఒకేలా ప్రసరిస్తుంది. అంతెందుకు పంచభూతాలన్ని సర్వ జీవులకు ఒకేల అనందాన్ని ఇస్తాయి. కాకపోతే మానవుడు తన విచ్చలివిడితనంతో పంచభూతాల్ని చెరబడుతున్నాడు.

ఒక కత్తి దుర్మార్గున్ని ఎలా బాదిస్తుందో సన్మార్గున్నీ అలాగే బాదిస్తుంది.

పురాణాల్లో జరిగినట్లు పుణ్యాత్ములకు పరమాత్మ కనిపించి కష్టాల్లోంచి బయట పడవేయటం జరగదు. ఎంతటి పతివ్రత ఐనా, ఎన్ని వ్రతాలు, పుణ్యకార్యాలు చేసినదైనా అగ్నిలో దూకితే మాత్రం తప్పక చస్తుంది. అందులో ఏమాత్రం మినహాయింపు లేదు.

దీన్ని బట్టి నాకేం అర్థం అయిందంటే అత్యధికులు అనుకుంటున్నట్లు దేవుడు అనే ఒక అతీద్రియ శక్తి లేదు. ఉన్నదల్లా ప్రకృతి ధర్మమే.

అంటే ప్రకృతికి లేదా ఈ సృష్టికి ప్రతి క్రియకు దానికి సంబందించిన ఫలితాన్ని ఇవ్వడమే తెలుసు. అందులో ధర్మ విచక్షణ చేయడం తెలియదు. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోగల శక్తి ఈ ప్రకృతికి లేదు. అందుకు నాకు తోచే బలమైన ఇంకొక ఉదాహరణ .. బలాత్కారానికి గురైన స్తీ కూడా గర్భవతి కావడం. ఈ ప్రకృతికి ధర్మం తెలిసిఉంటే, అలాంటి స్తీకి గర్బం రాకూడదు.

ఐతే అదే ప్రకృతి ధర్మాలవల్ల సృష్టింపబడిన మనిషికి మాత్రం ఈ ధర్మాధర్మ విచక్షణ తెలుసు. కావున ధర్మాన్ని కాపడవలసింది మనిషే కాని ఇంకెవరూ కాదు.

గీతలో కృష్నుడు కూడ ఇదే చెప్పాడని నాకనిపిస్తుంది. ధర్మం పాండవుల పక్షాన ఉన్నపుడు కృష్నుడే వారి తరపున యుద్దం చేసి అధర్మపక్షీయులను సంహరించి ఉండవచ్చుకద? అలా చేయడు. అర్జునున్ని యుద్దం చేయమని ప్రేరేపిస్తాడు. అంటే దేవుడు చేయడు, మనిషే చేయాలి.

కాకపోతే ప్రతిక్రియకూ పలితం నిర్దారించబడినట్లే మనిషీ చేసే ప్రతి కార్యానికి పలితం ఉండిఉంటుంది.

ఈ సృష్టి, ఈ విశ్వం అంతా కూడ మార్చవీలులేని ప్రకృతి ధర్మాలమీద ఆధారపడి నడుస్తున్నది. ఈ మార్చవీలులేని, ఎన్నటికీ మార్పు చెందని ధర్మాలనే "సత్యము" అనవచ్చు. ఆస్తికులు ఈ సత్యాన్నే "భగవంతుడు", "పరమాత్మ" అంటూ ఉండవచ్చు. అయితే నాకు వచ్చిన చిక్కల్లా ఈ భగంతుడు గుణసహితుడు అనడంలోనే. నేను నమ్మే ఈసత్యం నిర్గుణం. ధర్మాధర్మం, న్యాయాన్యాము తెలియదు. పున్యాత్ముడికోసం ఈ సత్యము మారదు. దుర్మార్గుడి కోసమూ ఈ సత్యము మారదు.

దేవుదైనా సరే ప్రకృతివిరుద్దంగా చేతిలో బంగారు సృష్టించలేడు. రాత్రిపూట సూర్యున్ని చూపించలేడు.

మనిషికున్న బుద్దిబలంచేత ఈ సత్యాన్ని అనగా మార్చ వీలులేని ధర్మాల్ని ఎంతగా తెలుసుకుంతే అంతగా అభివృద్ది సాధిస్తాడు. (న్యూటన్ సూత్రాలు, ఐన్‌స్టీన్ సిద్దాంతాలు ఈ సత్యాలే)

నేను (బహుశా మీరు కూడా) మరిచిపోతున్న తెలుగు పదాలు:

జూన్ 7, 2006

చట్టి : మట్టీతో చేసిన చిన్న పాత్ర. కూరలు చేయడానికి ఉపయోగిస్తారు.మూకుడు: చట్టీ లేదా కుండ మీద మూయడానికి ఉపయోగించే మట్టితో చేసిన వృత్తాకారపు పాత్ర.

ఉట్టి: (బహుశా కృష్నాష్టమి పుణ్యమా అని ఇది మాత్రం గుర్తుండవచ్చు) తాళ్ళతో తయారుచేసిన వలలాంటి వస్తువు. దీన్ని ఇంటిలో పైన కర్రలకు వేలాడదీస్తారు. పిల్లులనుండీ, చీమల నుండీ, చిన్న పిల్లల నుండీ వంటలను కాపాడడనికి ఉపయోగిస్తారు. గోపికలు వెన్నని కృష్నుడికి అందకుండా వీటిమీద దాచేవారు. వాడుకలోని సామెత: ఉట్టికి ఎక్కలేని వాడు స్వర్గానికి ఎక్కునా?

పొంత: పొయ్యిలో మూడవ రాయికి బదులుగా ఉపయోగించబడే నీళ్ళతో నింపిన కుండ. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే వంట అయేసరికి కుండలోని నీళ్ళుకూడా కాగి స్నానానికి ఉపయోగపడతాయి.

ముంత: మట్టితో చేయబడిన చిన్న పాత్ర, నీళ్ళు, మజ్జిగ, కల్లు లాంటి ద్రవాలు త్రాగడానికి ఉపయోగించేది.

తలుగు: ఆవును లేదా గేదెను కట్టివేయడానికి వాడే తాడు.

చూరు: కర్రలతో కప్పబడిన ఇంటికి గోడ దాటి బయటకు వచ్చిన కప్పుభాగము. వాడుక సామెత: కాళ్ళు పట్టి లాగితే చూరు పట్టుకు వేలాడినట్లు.

వాసము: ఇంటి పైకప్పుకు వాడే పొడవాటి బలమైన కర్ర.

దూలము: ఇంటి రెండు గోడలను కలుపుతూ పైకప్పుకు ఆధారమైన పెద్ద బలమైన కర్ర.

నిట్రాయి: చుట్టిల్లుకు ఇంటి మద్యలో నాటబడి పైకప్పును మోసే పెద్ద దూలము.

చుట్టిల్లు: వృత్తాకారములో కట్టబడిన ఇల్లు.

నులక: కర్ర మంచాన్ని అల్లడానికి ఉపయోగించే సన్నటి తాడు.

నులక మంచము: నులకతో అల్లబడిన మంచము.

మంచంకోళ్ళు: మంచము యొక్క నాలుగు కాళ్ళు.

జాలాడు: స్నానం చేసే దొడ్డి.

పంచ: ఇంటి ద్వారము బయట ఇరువైపులా ఉన్న ప్రదేశము. సాధారణంగా ఈ ప్రదేశములో అరుగులు ఉంటాయి.

చటాకు: పావులో సగము. 0.125

బాన: పెద్ద కుండ.

దొంతి: కుండ మీద కుండ పెట్టి ఏర్పరిచిన కుండల వరస. కింద పెద్ద కుండ దానిమీద కొంచము చిన్నకుండ అలా పెట్టుకుంటూ పోతారు.

గుంజ: ఆవును లేదా గేదెను కట్టివేయడానికి పాతిపెట్టబడిన కర్ర. పందిరికి ఆధారంగా పాతిన కర్ర.

ఎనుము: రాయలసీమలో గేదెను ఎనుము అంటారు.

పడ్డ: ఇంకా ఈనని వయసులో ఉన్న పడచు గేదె.

పరాందం కాయ: బొప్పాయి పండు.

కపిల: ఎద్దులు, బొక్కెన సహయముతో వ్యవసాయానికి బావి లోంచి నీళ్ళను తోడే పద్దతి.

బొక్కెన: ఎద్దుల సహాయముతో బావిలోంచి నీళ్ళను తోడటానికి ఉపయోగించే పెద్ద తోలు సంచి.

మోకు: బొక్కెన లాగడానికి ఉపయోగించే పొడవైన, లావైన తాడు.

కాడి: రెండు ఎద్దుల మెడ మీద ఉంచే కర్ర. దీనికి ఎద్దుల మెడకు కట్టాడనికి కావలిసిన పట్టెడలు ఉంటాయి.

పట్టెడ: తాళ్ళతో తయరి చేసిన బెత్తెడు వెడల్పు, మూరడు పొడవుండి కాడికి ఎద్దులను కట్టివేడానికి ఉపయోగించేది.

కుప్పె: ఎద్దు కొమ్ముల చివర్లకు తొడిగే లొహంతో చేసిన అలంకార వస్తువు. (ఎద్దు వాడైన కొమ్ముల నుండీ రక్షణ కొరకూ కూడా)

గాడి: ఎద్దులకు మేత వేయుటకు చుట్టూరా రాతి బండలతో గాని, కర్రలతో గాని ఏర్పరిచిన ప్రదేశము.

కుడితి: గేదెలు తాగే తవుడు, అన్నము, గంజి కలిపిన నీళ్ళు.

చిక్కము: ఎద్దులు పంటను తినకుండా మూతులకు కట్టే, తీగలతో చేసిన వస్తువు.

— ఇంక గుర్తు రావటం లేదు. ఈ పదాలు కడప జిల్లా, రామాపురం మరియు లక్కిరెడ్డి పల్లె ప్రాంతాలలో వాడె పదాలు. మీకు తెలిసినవి కూడ ఇందులో చేర్చండి. వీలైనప్పుడల్ల విటిని వాడండి. లేకపొతే కొన్నాళ్ళకు చాలా పదాలు మనకు కనపడకుండ పొయే ప్రమాదం ఉంది.

— ప్రసాద్