Archive for జూన్, 2006

‌మా గడప కడప

జూన్ 30, 2006

కడప అనగానే ఇప్పుడు అందరికీ గుర్తు వచ్చేది బాంబులు, కాఠిన్యం, కరకుదనం. మా భీమవరం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సుపాలు జనార్ధన రెడ్డి ఒక సమావేశంలో నన్ను ఉద్దేశించి “కడప వాడు కదా! ఆ మాత్రం ఆవేశం సహజం” అన్నాడు. దానికి నేను మళ్ళీ లేచి, పెద్ద ప్రసంగమే చేశాను. బాంబుల కడప వాడిగా నాకు పేరొద్దు. అలా అనిపించుకోవడానికి నేను సిగ్గు పడతాను అంటూ, వేమన, అన్నమయ్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, పోతన వంటి కడప మహానుభావుల గురించి ఓ అరగంట ఉపన్యాసం ఇచ్చాను.

కానీ కడప జిల్లా ప్రజల్లో కూడా కరుణ ఉంది అనడానికి ఈ ఈనాడు వార్త చూడండి.

ఆత్మీయుడికి గాయమైతే ఊరే కదిలింది
పులివెందుల, జూన్ 29(న్యూస్ తుడే):ఐస్ అంటూ చంటి పిల్లలకు ప్రేమగా పుల్ల ఐసులు విక్రయిస్తూ దగ్గరైన ఓ వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆపన్నహస్తమందించేందుకు ఆ గ్రామమంతా ఏకమై కదిలింది. మా పిల్లలకు ఆత్మీయుడవైన నీకు గాయమైతే మేము లేమా అంటూ గ్రామస్తులు తలో చేయి వేసి అతన్ని ఆదుకొన్నారు. మంచాన పడి వైద్యంకోసం ఎదురుచూస్తున్న తనకు కష్టకాలంలో అండగా నిలిచేందుకు ఊరంతా కదిలిరావటంతో ఆ భాదితిడిలో ఆత్మస్థైర్యం పెరిగింది. కళ్ళలో ఆనందభాష్పాలు వెలిగాయి.
పూర్తిగా ఇక్కడ చదవండి. http://www.eenadu.net/district/districtshow1.asp?dis=cuddapah#8

ఇంకో విశయం, కడప కు ఆ పేరు గడప పదం నుండీ వచ్చిందని? కడప అసలు పేరు “దేవుని గడప”. అయితే కాలక్రమాన వేంకటేశ్వరుని గుడి ప్రాంతాన్ని మాత్రమే “దేవుని కడప” అంటున్నారు. ఇ‌ది తిరుమల వేంకటేశ్వరునికి గడప అట. ఇప్పటికీ తిరుమల వెళ్ళే చాలామంది ఇక్కడి వేంకటేశ్వరున్ని దర్షించాకే తిరుమలకు వెళతారు. ఆంగ్లేయులు దీన్ని CUDDAPAH గా మార్చేశారు. ఈ మద్యనే మళ్ళీ official గా ఇంగ్లీష్ spelling ను KADAPA గా మార్చారు.
ఈ విషయం తెలుగు వికి లో తాజాకరిస్తే (update) బాగుండు.
— ప్రసాద్

అన్నయ్యకో లేఖ – a letter to my brother

జూన్ 29, 2006

ప్రియమైన అన్నయ్యకు నమస్కారములు.

      పిల్లలకు నా శుభాకాంక్షలు. వదిన గారికి నమస్సులు.

      నాకీ మద్య ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. బహుశా తగినంత పని ఆఫీసులో లేకపోవడం వల్ల అనుకుంటాను. idle mind is devils workshop అని ఎవరో అన్నారట గదా! దెయ్యాలో, దేవతలో గాని మొత్తానికి నా మెదడు పరిపరి విధాలా అలోచిస్తున్నది. ముఖ్యంగా ఈ జీవితము, దీని గమ్యము గురించి పెద్ద చింతే పట్టుకున్నది.

ఎదీ రుచించడము లేదు.ఏది తిందామన్నా ఆకలికి ఆకొన్నవారూ, ఆకలితో చస్తున్నవారూ నా చేతిలోది లాక్కుంటున్నట్లే ఉంది. ఆకలిగొన్న వాడికి పెట్టకుండా నా కడుపుకే నిర్దాక్షన్యంగా, నిర్దయగా తింటున్నట్లే ఉంటుంది. ఆ ఆకలికళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఏమి తిందామన్నా! నా పిల్లల బోసి నవ్వుల్ని చూసినప్పుడల్లా, తల్లీదండ్రీ లేని అనాధ పిల్లలు, బాలకార్మికులూ, వెట్టిచాకిరీ చేస్తున్న వాళ్ళు నాకూ కావాలి ఆ బోసినవ్వులని అడిగినట్లే ఉంటోంది. సరైన వైద్యము లేక చని పోతున్న పసిపిల్లలు ‘మాకేదీ ఆ బోసినవ్వు” అని ప్రశ్నిస్తున్నట్లే ఉంది. మెత్తటి పరుపు మీద ఆఛ్ వేసుకొని పడుకున్నా నిద్రే రావటం లేదు. చలికి, ఎండలకీ చని పోతున్న వాళ్ళ చావుకేకలే విని పిస్తున్నాయి. ఇల్లులేని వాళ్ళు,రోడ్డు పక్క నిద్రపోయి వాహనాల కింద నలిగి చచ్చేవారి రోదనలే వినిపిస్తున్నాయి ఇక నిద్ర ఎలా వస్తుంది. కారులో రోజూ ప్రయానిస్తున్నాననే మాటేగానీ, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి దీనాలాపనలు, చావుకేకలు విపిస్తున్నాయి.

గాలిబ్ గీతాలూ, ఠాగూర్ గీతాంజలి ఇప్పుడేమాత్రమూ రుచించటము లేదు.

ఎందుకు పుట్టాము? ఎందుకు జీవిస్తున్నాము? మనం సంపాదించి, మన పొట్ట నింపుకొని, మన పిల్లల బాగుచూసుకొని, వీలైతే మన మనవల కోసం, మునిమనవల కోసం దాచి పెట్టడమేనా జీవితమంటే!!!! ఇన్ని రోదనల మద్యా, ఆకలి చావుల మద్యా, అభాగ్యుల మద్యా!!! చూస్తుంటే ఈ లోకంలో నాకు తప్ప అందరికీ, అన్నిటికీ ఎదో ఒక పరమార్థము ఉన్నట్లే తోస్తోంది. తనకోసమే తాను ఎదీ కనపట్టం లేదు ఒక స్వార్థపరుడైన మానవుడు తప్ప. చచ్చిన తర్వాత శవాలు కూడా ఉపయోగపడుతున్నాయి, కళ్ళు ఇంక ఇతర శరీర భాగాలూ! క్రిములూ, కీటకాలూ, మన్నూ, ఆకాశం, అగ్ని, నీరు, సముద్రాలూ, కొండలూ అన్నీ, అన్నీ ఎదో విధంగా ఇతరులకు ఉపయోగపడుతున్నాయి…ఒక స్వార్థపరుడైన మనిషి తప్ప. ఉదయాన లేచిన దగ్గరినుండీ పరుగే పరుగు కాస్తంత సమయం దొరుకుట లేదు, పరచింతనకీ, పరోపకారానికి! పరసేవ చేయలేని జీవతము జీవించడమెందుకూ? అదేకదా మనం చేయాల్సిన ఫుల్ల్ తిమె జొబ్? కానీ అంతా తారుమారు అయినట్లుంది, నా పొట్ట కోసం తొంబైతొమ్మిది శాతం, ఒక్క శాతం లేకుంటే అదీ లేదు .. ఇతరుల కోసం!

ఇన్ని ఆలోచనల తర్వాతే మన ఊరిలో తన వారంటూ ఎవరూ లేని ముసలి వారికి, తమ పని తాము చేసుకోలేని బలహీనులకీ కనీసం అన్నం పెడదామనుకొన్నాం కద? పెడితే వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి లేకుంటే ఎవరికీ వద్దు అంటే ఎలా? మనకున్న స్తోమతుకి తిండిలేని అభాగ్యులకు, బలహీనులకూ మాత్రమే కదా ప్రస్తుతానికి పెట్టగలం. మిగతా వారు పెట్టకపోతే నిందిస్తారంటారా? నిందలూ, అపనిందలూ, కీర్తి, అపకీర్తి వీటికి మనం చింతించాలా? ఎవరు ఎన్ని అంటే మనకెందుకు? మన అంతరాత్మ చెప్పిందే చేద్దాం. ఇక ఊరిలో ఎవరికో ఇచ్చి వండమంటే కాజేస్తారంటారా? కాజేయనీ కనీసం కొంతలో కొంతైన అనుకున్న పని జరక్క పోతుందా!

నన్నడిగితే మనమే ఆ పని ఎందుకు చేయకూడదు? నాన్న రోజూ ఉదయం, సాయంత్రం గర్భగుడిలో దేవున్ని పూజించడానికి వెళ్ళేబదులు, ఆకలిగొన్న మనిషి గుడిలోని ఆత్మారామున్ని కొలవడం పుణ్యం కాదా?

నాకైతే ఏదో రోజు ఈ తీవ్రమైన సంఘర్షణ తట్టుకోలేక అన్ని ఇక్కడే వదిలేసి ఇండియా వచ్చి బీదజనుల సేవ చేసుకోవాలని పిస్తోంది. అందరూ నన్ను పిచ్చివాడంటారేమొ! అననివ్వు, ఇన్ని బాధల మద్యా, ఆకలి కేకల మద్యా నవ్వుతూ బతకడం కంటే వారి మద్యనే ఆ బాధల్ని అనుభవిస్తూ చావడం మంచిదేమొ! ఇన్ని ఘోరాల మద్య, నేరాల మద్య, ఆకలి దప్పుల మద్యా చలం ప్రేమ లేఖలో, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమో చదువుతూ ఆనందింపలేకున్నాను. ఎప్పటికైనా నా గమ్యము అదే అనిపిస్తుంది. దీనజన సేవే అసలైన దైవ సేవ అనిపిస్తొంది. ఇప్పుడిప్పుడే నాకు దారి స్పష్టమవుతోంది.

మీరేమంటారో సెలవియ్యండి. అమ్మానాన్నలతో అనకండి వాళ్ళకిదంతా అర్థం కాదు.

ఉంటాను మరి.

ఇట్లు

మీ ప్రియమైన తమ్ముడు

ప్రసాద్

‌నాగరికతా పరిణామ క్రమము

జూన్ 29, 2006

ఆదిమ మానవుడు:
తిండి: తన పొట్ట నిండితే చాలు, పొట్టనింపుకోగలిన దేన్నైనా తినవచ్చు.
శృంగారము: వావివరసలు లేని సంభోగము.
నివాసము: చెట్టు తొర్రల్లో, రాతి గుహల్లో నివాసము.
ఆచ్చాదన: దిగంబరం

తర్వాతి యుగము లో మానవుడు;
తిండి: కాల్చి తినటం
శృంగారము: వావివరసలు ఇంకా ఏర్పడి ఉండక పోవచ్చు
నివాసము: గుదిశలు — సంచార జీవులు, బహుశా సంఘ జీవితము ఇంకా అలవాటు అయుండక పోవచ్చు.
ఆచ్చాదన: బహుశా ఆకులు

తర్వాతి యుగము లో మానవుడు;
తిండి: కాల్చటం, ఉడక బెట్టడం. తనకే కాక తన వారి తిండి గురించి ఆలొచించడం
శృంగారము: ఒకరు లేదా ఎక్కువ మందితో కానీ తన పిల్లల్ని మినహాయింపు. ఓ మాదిరి వావి వరసలు
నివాసము: తాత్కాలిక నివాసాలు
ఆచ్చాదన: జంతు చర్మాలు, అల్లిన చాపలు

తర్వాతి యుగము లో మానవుడు;
తిండి: సహకార జీవితము. అతడు సంపాదిస్తే, ఆమె వండి పెట్టడము. పిల్లల సమిష్టి పెంపకము. రుచికరంగా వండి తినడము. తన మంచే గాక తన కుటుంబము గురించీ ఆలొచించడము.
శృంగారము: భాగస్వామితోనే
నివాసము: స్థిర నివాసాలు
ఆచ్చాదన: బహుశా నార చీరలు

తర్వాతి యుగము లో మానవుడు;
తిండి&ఆలోచన: వ్యవసాయము, పెంపుడు జంతువుల, కోళ్ళ పెంపకము. తన బాగు, తన కుటుంబము బాగు, తన పల్లె బాగు కోరుకోవటము.
శృంగారము: భాగస్వామి తోనే. పెళ్ళిళ్ళు మరియు తంతులు
నివాసము: స్తిర నివాసము, పల్లెలు
ఆచ్చాదన: బట్టలు

తర్వాతి యుగము లో మానవుడు;
తిండి&ఆలోచన: శాకాహారులు, మాంసాహరులు, సమిష్టి ఉత్పాదన, తన గురించీ, తన ఊరి గురించీ, తన రాజ్యం గురించీ అళొచన
శృంగారము: భాగస్వామి తోనే. పెళ్ళిళ్ళు మరియు తంతులు
నివాసము: స్తిర నివాసము, పల్లెలు, రాజ్యాలు
ఆచ్చాదన: బట్టలు
ఆధునిక యుగ మానవుడు;

తిండి&ఆలోచన: శాకాహారులు, మాంసాహరులు ఇంకా బోలెడు వాదాలు. సమిష్టి ఉత్పాదన, తన గురించీ, తన ఊరి గురించీ, తన రాజ్యం గురించీ, మానవ జాతి గురించి ఆలోచన
శృంగారము: భాగస్వామి తోనే. పెళ్ళిళ్ళు మరియు తంతులు
నివాసము: పల్లెలు, పట్టణాలు, నగరాలు
ఆచ్చాదన: బట్టలు
ఇంతకు మించి పరిణితి చెందాలంటే, సర్వ భూతాల గురించి అలోచించాలంటే  ఇంకెన్ని యుగాలో!!!

— ప్రసాద్

‌మన చీర – Indian saree

జూన్ 28, 2006

ఇది నిజంగా అద్భుత సృష్టి. ఇది లేని గృహం ఊహించడమే కష్టం. ఉన్నవారు, లేని వారు, నాగరికులు, అనాగరికులు, సంప్రదాయవాదులు, ఆధునికులు, దక్షణాదివారు, ఉత్తరాదివారు … అందరూ ఆదరించేది చీరే గదా! మానవులకీ, దేవతలకీ సమాన్యవిషయము కూడా ఇదేనేమొ!
కాకపోతే దానికి ఎన్నో రూపాలు. సామాన్య నూలు చీరల్నుండీ పట్టు చీరల వరకూ ఎన్ని రకాలు! కార్మిక స్త్రీలు మోకాళ్ళ పైకి కట్టే పద్దతి నుండీ, నాట్యానికి అనువుగా కట్టే పద్దతి వరకూ ఎన్నెన్ని ధారణ రీతులు!
ఎన్నో భాషలు, మతాలు, ఆహారాలు ..కాని చీర మాత్రం రూపాలెన్నైనా భారతీయ నారీభూషణమే!
నేను విషయం గుర్తు పెట్టుకోగలను కానీ, సినిమా పేరు గుర్తుపెట్టుకోవటం నావల్ల కాదు. ఆ మద్య జెమిని చానల్లో ఆ సినిమా పాట విని తన్మయున్ని అయిపోయాను. చీర ఎన్ని రకాలుగా మన సంస్కృతి లో పెనవేసుకుపోయిందో విని.
ఏడ్చే పిల్లవాన్ని ఊరడించడానికి, నిద్ర పుచ్చడానికీ చీరతో వేసే ఊయలంత సౌకర్యం ఇక దేనిలో ఉండదేమో!
ఊయలైన చీర
పిల్లాడికి మూతి తుడవడానికి (చీమిడి తుడవడానికి కూడా 🙂 ) చీరకొంగంత ఆపద్బాందవి ఇంకోటి ఉందా?
పసిబిడ్డకు పాలు ఇవ్వాలంటే చీరపైట చాటు అంత అనువైనదేది?
ఎండలో నడిచేప్పుడు చీరకొంగేగా నీడ పట్టేది!
ఉద్యోగిని చీర
చిల్లర డబ్బులూ, ఆకు ఒక్కలూ కట్టుకొని దాచుకోవటానికి చీరకొంగేగా పనికొచ్చేది!
అడుక్కోవటానికి చేతిలో బొచ్చే అక్కరలేదు, చీర కొంగు చాలు.
బిక్షగత్తె చీర
అడవికి వెళ్ళినప్పుడు రాతి సందుల్లోని మురికి నీరు వడగట్టి తాగడానికి పనికొచ్చేదీ చీరకొంగే!
మొగున్ని తన వెంటే తిప్పుకోవాలంటే కట్టుకోవాల్సింది కొంగుకే!
జీవితం మీద విరక్తి చెందితే ఉరికి సహాయపడేదీ చీరే! 😦
బావిలో పడ్డవాన్ని రక్షించాలంటే వెంటనే గుర్తుకొచ్చేది చీరనే!ఇక అలరించనిది ఎవ్వరిని??

చీర గట్టిన ఏ సుందరైనా మగవాన్ని మరింత మోహవివశున్ని చేయకుండా ఉంటుందా? అన్నిటినీ దాచినట్లే దాచి వాటిని మరింత అందంగా చూపే చీరే చీర కదా!

ఆధునికపు చీర
కన్నె పిల్ల చీర
అలాగే స్త్రీ పట్ల గౌరవం, భక్తి కలగాలన్నా చీరలోనే చూడాలి.
చీర కట్టిన విగ్రహాన్ని చూస్తే ఎంత భక్తి భావన!
నాట్యమయూరి చీర
లేపాక్షి చీర
కానీ… ఇన్ని వేల సంవత్సరాలు తన ఉనికిని కాపాడుకొన్న చీర ఇకమీదటా ఉంటుందా? నాగరీకం పేరుతో బొట్టుకీ, చీరకీ, మంగళసూత్రానికీ మంగళం పాడేస్తున్నామా? నాకైతే ధోవతి కట్టడం రాదు..నా పిల్లలకి కూడా నేర్పలేను. పాత సినిమాల్లో నాగేశ్వరరావ్, మురళీమోహన్ కట్టిన పంచెకట్టు చూసి మురిసిపోవలసిందే! ఇక చీర గతీ అంతే కానుందా?
మన జీన్లలోనే ఉన్న మన జాతి లక్షణాన్ని మార్చలేని మనం, మన వంటి రంగు మార్చలేని మనం మన సంప్రదాయాన్ని మాత్రం నాగరీకం పేరుతో మార్చుకోవటం ఎందుకూ!
మెట్టెలు, తాళి, బొట్టు తీసివేసి పాశ్చాత్యుల్లా కనబడ్డంత మాత్రాన మన ఒంటి రంగు మన జాతి మూలాల్ని చెప్పకపోతుందా! మన సంప్రదాయాల్ని ఒదులుకోవటం వల్ల హంస నడక, కాకి నడక రాని చందాన మిగిలి పోమా!?

రవివర్మ చీర
అవ్వ చీర
వీరవనిత చీర
5810.jpg
కార్మికుల చీర— ప్రసాద్

మరిన్ని వివరాలకు http://www.kamat.com/kalranga/attire/saree/

హాస్య వల్లరి!

జూన్ 26, 2006

హాస్య వల్లరి!
క్రితం వారం నా కారు servicing కి ఇచ్చాను. office కి వెళ్ళటానికి వాళ్ళ షుత్త్లె లో కూర్చున్నాను. నాటో పాటు ఇంకో నలుగురు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మద్యలో త్రఫ్ఫిచ్ చాలా ఉండి, అందరు అసహనంగా ఉన్నారు. అప్పుడు ఒకావిడ ఇలా మొదలెట్టింది.
   ఒకసారి అమెరికా అధ్యక్షులు బుష్ గారు లండన్ వెళ్ళారు. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ను కలుసుకొని "రాణి గారు! ఇన్నేళ్ళనుండీ ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా జనరంజకంగా మీరు ఎలా పరిపాలించగలగుతున్నారు? మీ దగ్గర ఏమైనా విశిష్ట పద్దతులున్నాయా?" అని అన్నారు. అందుకు రాణి "అందుకు నా గొప్పదనమేమీ లేదు, అంతా సవ్యంగా జరుగుటకు బుద్దిమంతులైన, తెలివిగల వారైన మంత్రులు నా ప్రభుత్వములో ఉండడమే కారణము" అన్నారు.
"వారు తెలిగల వారూ, బుద్దిమంతులూ అని మీకెలా తెలుస్తుంది? మీకు ఆధారమేమిటి?" అని బుష్ అన్నారు. అప్పుడు రాణి గారు తన కాలింగ్ బెల్ నొక్కింది. టోనీ బ్లెయిర్ ప్రత్యక్షమై చేతులు కట్టుకొని "మీ ఆజ్ఞ" అన్నాడు. అప్పుడు రాణి గారు "టోనీ! నీవీ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. ఇది మీ తెలివికి పరీక్ష. ఇందులో నెగ్గలేదో అమెరికాలో మన పరువు పోతుంది." అని "నీ తల్లిదండ్రులకే పుట్టాడు, కానీ నీ సోదరుడు కాదు, మరెవ్వరు?" అని ప్రశ్నించింది. దానికి టోనీ అసలు తడుము కోకుండా "అది నేనే" అన్నాడు. దానికి రాణి సంతోషించి "ఇక నువ్వు వెళ్ళవచ్చు" అన్నది.
బుష్ అతడి తెలివికి ఎంతగానో సంతోషించి, సంబ్రమాశ్చర్యాలతో అమెరికా చేరుకొని తన మంత్రివర్గాన్ని కూడా ఆ ప్రశ్నతో పరీక్షిద్దామనుకొన్నాడు. వెంటనే చేనీ ని పిలిచి "చేనీ ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి, అమెరికా ప్రతిష్ట నువ్వు చెప్పే సమాధానం బట్టి ఉంటుంది. నీకు పది నిమిషాల సమయము ఇస్తున్నాను." అంటూ రాణి టోనీ కి వేసిన ప్రశ్ననే వేశాడు. అప్పుడు చేనీ దీర్ఘాలోచన చేసి "అధ్యక్షా, ఇది మామూలు ప్రశ్న కాదు. ఇందులో అమెరికా రక్షణాంశము ఇమిడి ఉంది. గూడాచారుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రశ్నను చర్చించి సరైన సమాధానం తో తిరిగి వస్తాను" అంటూ బయటకు వచ్చాడు. అందరినీ సమావేశపరిచి అదే ప్రశ్న వేశాడు. ఎవరూ సంతృప్తికరమైన సమాదానం ఇవ్వలేదు. అప్పుడు కోలిన్ ఫావెల్ ను పిలిచి "ఫావెల్, మన పరువును నువ్వే దక్కించాలి, ప్రెసిడెంట్ చాలా కోపంతో ఉన్నాడు. ఈ ప్రశ్నకు నువ్వైనా సరైన సమాధానం చెప్పు" అని "నీ తల్లిదండ్రులకే పుట్టాడు కానీ నీ సోదరుడు కాదు. మరెవ్వరు?" అని ప్రశ్నించాడు. దానికి ఫావెల్ చిరునవ్వు నవ్వి "అది నేనే!" అన్నాడు. చేనీ మొహం వెలిగి పోయింది. వెంటనే బుష్ దగ్గరికి పరుగెట్టి "సమాధానం తెలుసుకున్నాను" అన్నాడు వగురుస్తూ! "ఎమిటా సమాధానం ఆలస్యం చేయక చెప్పు త్వరగా" అన్నాడు బుష్.
"కోలిన్ ఫావెల్" — అన్నాడు చేనీ వెయ్యి వోల్టుల విద్యుత్తుతో మొహం వెలిగి పోతుండగా!!!
బుష్ కు చాలా కోపం వచ్చింది. "నీ మొహం, నీలాంటి అసమర్థులు ఉండబట్టే ఇరాక్ లో మనం ఓడి పోయాం." అన్నాడు కోపంతో ఊగిపోతూ.
చేనీ బిక్కచచ్చి పోయాడు. "ఇంతకూ మరి దానికి సరైన సమాధానం మీకు తెలుసా?" అన్నాడు ఊపిరి బిగపట్టి.
"టోనీ బ్లెయిర్" — అన్నాడు బుష్ సమాధానంగా.
బుష్ సమాధానం విన్నాక కళ్ళలో నీళ్ళు తిరిగేంతవరకు నవ్వాను. మీరూ నవ్వుతున్నారా?

— ప్రసాద్

ఈనాటి (వి)చిత్రాలు

జూన్ 22, 2006

ఈనాటి సినిమా గురించి 'ఏమున్నది గర్వకారణం' అన్నట్లు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ దర్షకులూ, నిర్మాతలూ, నాయకులు, నాయకీలు అంతా ఒకే ధ్యేయంతో ఒక తపస్సులా ప్రేమ గురించి (యవ్వన ప్రేమ మాత్రమే) పరిశోధిస్తున్నారా అనిపిస్తుంది. ఎన్ని పేర్లు, ఎన్ని కథలు, ఎన్ని పాటలు?? కనీసం పాత సినిమాలు ప్రేమాంశమైనవే అయినా, అందులో హీరో పేదవాడయి, నాయకి ధనవంతురాలి కూతురై అలా పల్లెలొ మొదలై పట్నంతో ముగుస్తుంది.

కానీ ఇప్పుడొస్తున్న సినిమాలు చుస్తే, అసలు పల్లెటూళ్ళే లేనట్లు, పేదరికమే లేనట్లు, ఏ కష్టమూ లేక ప్రియురాలి ప్రేమ పొందడమే జన్మ సాఫల్యమన్నట్లూ, కార్లలో షికారులూ, ఖరీదైన పార్టీలూ, విదేశాల్లో షికారులూ …..

మనిషికీ మనిషికీ మద్య ఈ సినిమా ప్రేమ బందం తప్ప ఇంకే అనురాగమూ లేదా? ఇంకే బందాన్నీ సినిమాగా తీయలేమా? సినిమాని ఇంత కృత్రిమంగా కాకుండా ఇకొంచం సహజానికి దగ్గరగా తీస్తే ఎంత బాగుండును!!!!

— ప్రసాద్

భిన్న ధృవాలు — BinnaDRvAlu

జూన్ 22, 2006

భారతీయత X వర్థమానం
స్త్రీ పూజింపబడు చోట లక్ష్మి నివసిస్తుంది X నిమిశానికో అత్యాచారం! ఆడపిల్లైతే చంపేయ్, లేదా అమ్మేయ్! గుణింపని, గణింపని, "ఖర్మ" ఖాతాలో జమ పడేవెన్నో! కట్నం తేకుంటే కాల్చి చంపేయ్.
అహింసా పరమో ధర్మః X హింస లేని గృహం పూజ్యం. చివరికి దేవాలయాలు కూడ జంతు బలులు, నర బలులతో హింసకు ఆలయాలే.

‌గురుః సాక్షాత్ పరబ్రహ్మ X ఇప్పుడు ఏ సినిమా చూసినా గురువు పాత్ర హాస్యపాత్ర అయిపోయింది. ఒకవేళ నిజజీవితమే అందులో ప్రతిభింభిస్తుంటే .. ఇక గురువు స్తానం సమాజం లో ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

అథిధి దేవోభవ X దీన్ని కేంద్ర ప్రభుత్వము ప్రజలకు ఇప్పుడు గుర్తుచేయాల్సిన ఖర్మ పట్టింది. ఆ మద్య ప్రవాసీ భారతీయ దివస్ కు హాజరైన విదేశీ వనిత పై అత్యాచారం. విదేశీ రాయబారి కూతురి అత్యాచారం.

పరమత సహనం – "అన్ని మార్గాలూ నన్నే చేరుతాయి" – కృష్నుడి ఉవాచ X దీని వల్ల సామాన్య బారతీయుడి వల్ల కాకుండా, "బారతీయత" కి కొమ్ము కాస్తున్నామని చెప్పుకునే వారినుండే ప్రమాదం. పిల్లలతో సహా క్రిస్టియన్ ప్రబోధకున్ని ఒరిస్సాలో సజీవ దహనం.

మానవ సేవే మాధవ సేవ X ప్చ్ .. దీని గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. గుడి బయట పాల కోసం ఏడ్చే బిచ్చగాడి బిడ్డ…. గుడి లోపల రాతి దేవుడికి క్షీరాభిషేకం.

సర్వజీవులందు సమ దృష్టి (అన్ని జీవులందు ఉన్న చైతన్యము పరమాత్మ అంశే కనుక జీవులన్నియును సోదర సమానులే) X సర్వ జీవులెందుకు…. మానవులే అందరూ సమానం కాదు. మాదిగ, మాల వీళ్ళందరు జంతువుల కంటే హీనం. పిల్లి ముట్టిన పాలనైనా తాగుతాం కానీ మాదిగ ముట్టిన మజ్జిగ తగలం.

ఈ వైవిద్యం నుండీ ఏ మర్థమవుతుంది? "చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు" అని.
భారతీయత మీద, వైదిక దర్మం (మను దర్మం కాదు)మీద నాకు అంతులేని ప్రేమ ఉన్నా, అనటానికీ ఆచరణకీ మద్య ఈ అంతరాన్ని చూస్తే ఒళ్ళు మండుతుంది.
మనం ఏళ్ళ తరబడి ఇన్ని భాషలూ, ఇన్ని మతాలూ, ఇన్ని వేషాలూ, ఇన్ని ఆహారపు అలవాట్లు గల వారితో సహజీవనం చేస్తున్నామూ అంటే అది నిజంగా మన సచ్చీలత వల్ల అంటారా? నాకు అనుమానమే …. మన సచ్చీలత కంటే గూడా "ఊరంతా కాలుతున్నా నా ఇల్లు కాలేప్పుడు చూద్దాం" అనే నిర్లక్ష్యం, స్వార్థపరత్వం, నిర్లిప్తత  ముఖ్య కారణాలు అనుకుంటాను. లేకుంటే వేల ఏళ్ళ చరిత్ర ఉన్న మనం, మంగోలులు, అరబ్బుల చేతిలో హీనంగా ఓడిపోయి అప్పనంగా అధికారాన్ని అప్పజెప్పి ఊడిగం చేయడమేంటి? కేవలం కొన్ని వందల తురగదళం తో, ఆటవిక సంస్కృతి తో, ఎంతో దూరం నుండీ వచ్చి, ఎంతో సువ్యవస్థితమైన, సంస్కృతి కలిగిన, సంపద కలిగిన మనం ఓడిపోవటమేమిటి.
బలహీనుడు చెఫ్ఫేది నీతి కాదు బలహీనత మాత్రమే. ఆడలేక మద్దెల ఓడు అనడమే. నీతి చెప్పే హక్కు బలవంతుడికే ఉంటుంది. దానికే విలువ ఉంటుంది. అయితే బలంతో వచ్చే అహంకారాన్ని అదుపులో పెట్టుకుని బాద్యతతో సచ్చీలతతో జీవించినప్పుడే అసలైన నీతి జీవిస్తుంది. ఈ విధంగా చుస్తే బారత్ అణుశక్తి సాధించి తన మొత్తం చరిత్రలో ఒకే ఒక మంచిపని చేసింది.

ఇలా రాసుకుంటూ పోతే ఇంకా ఎంతో. మాతృదేశం మీది ప్రేమ దాన్ని విమర్షించనీయదు. దేశాన్ని విమర్షించడమంటే, దేశ ప్రజలని విమర్షించడము. ప్రజల్లో నేను, నావాల్లూ కూడా భాగమే కనుక నన్ను నేను విమర్షించుకోవటం. ఆత్మ విమర్ష చేసుకోవటం. జరిగిన తప్పులు, జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దుకోవటం.

— ప్రసాద్

రిజర్వేషాలు

జూన్ 20, 2006

రిజర్వేషాలునాకు తెలుసు ఇది చాలా సున్నితమని. నాకు తెలుసు సమర్థించడానికీ, విమర్శించడనికీ బోలెడంత సరుకుందని. కావాలనే ఈ విషయం మీద నా బ్లాగుని నాంచాను. (వీవెన్ గారు లేఖినిలో nAncAnu ఎలా రాయాలో చెప్పండి.) అదేనండి అంత సున్నితమైన అంశము రిజర్వేషన్లు. చదువరి బ్లాగు చూశాక ఇక తప్పదనిపిస్తోంది.రిజర్వేషన్లు కావాలి, ఉండాలి. అయితే అవి కులాధారంగా ఉండకూడదు. ఇదీ నా స్థూలాభిప్రాయము.

ప్రతిభ

ప్రతిభ కే పట్టం కట్టాలి అందులో అందులో ఎవరికీ లేశమాత్రసందేహముండక్కర్లేదు. అయితే సమ ఉజ్జీల మద్యనే పోటీ ఉండాలి. ఉన్నవారి పిల్లలకి, లేని వారి పిల్లలకి మద్య పోటీ పెట్టి, అందులో అర్హత సాధించిన వాడికే అందలమిస్తామంటే ఎలా? AC రూములో చదివేవాడికీ వీధి దీపం కింద చదువుకునే వాడికీ పోటీ ఎలా సాద్యం. వేలు, లక్షలూ పెట్టి పేరున్న కాలేజీల్లో చదువు కొనే వారికీ, పిల్లల్నీ కూడా పనిలో పెడితే కాని ముద్ద నోట్లోకి రాని వారికీ ఒకే పోటి పెడితే ఎలా? నిజమే మీరన్న విధంగా అటువంటి వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించి ఉన్నవారితో సమానంగా విద్యావకాశాలు కల్పించి … ఇది సాద్యమా? ఎంత వెసులు బాటు కల్పిస్తే మాత్రం లేనివాడి పిల్ల వాడు, ఉన్నవాడి సౌకర్యాలు పొందగలుగుతాడు. నిజంగానే మనం అలాంటి అర్థిక వెసులుబాటు కల్పించగలిగితే ఇంక బీదలనే వారే ఉండరు. కడుపునిండా తినలేని వాడికి డబ్బిచ్చి పుస్తకాలు కొనుక్కోమంటే పుస్తకమా అన్నమా ఏది వాడికి రుచిస్తుంది? కడుపులో ఆకలి దంచేవాడికి, నిత్యమూ జీవనపోరాటం చేసేవాడికి చదువుకోలేని విషయం సమస్యే కాదు. వాడి ఆకలి తీర్చి, వాడి తల్లిదండ్రుల ఆకలి తీర్చి ఇంట్లో కరెంటు దీపం పెట్టి, చదువుకోవటానికి డబ్బులిస్తే ఎందుకు చదవడూ? అప్పుడు మనం ఖచ్చితంగ ప్రతిభకు పట్టం కట్టవచ్చు.

ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు వుండాల్సిందే.

ఎంత మంచి హాస్టళ్ళు ఉన్నా తల్లి ఒడిబడిలో నేర్చున్నంత సౌకర్యం హాస్టల్లో ఉంటుందా?

కారులో, లేదా కనీసం స్కూటర్లో వచ్చి స్కూల్లో చదివే వాడి కెక్కినట్లు నడుచుకుంటూనో లేకా సైకిల్లో చెమటలు కక్కుకుంటూ స్కూలుకు వచ్చి చదివే వాడికి చదువు ఎక్కుతుందా?

మరి సామజిక అసమానతలు ఉన్నంత వరకూ సమాన పోటీ ఎలా సాద్యం?

సామర్థ్యము

చాలామంది వికటంగా రిజర్వేషనుతో దాక్టరైతే వాడివాల్ల జరిగే అనర్థాల గురించి చెపుతారు. సరే, మరి అనర్హుడైనా డబ్బు పోసి పక్క రాష్త్రానికో, పక్క దేశానికో వెల్లి దాక్టరు చదువు కొన్న వారి సామర్థ్యము సంగతేంటి? రిజర్వేషన్లున్నా ప్రతిభ చూసే కదా అర్హుడయ్యేది. ఏ కులానికి ఆ కులంలో ప్రతిభ చూసే కద ఎన్నుకునేది?

ప్రతిభ అన్ని వర్గాల్లోనూ ఉంటుంది. కాకపోతే సౌకర్యాల లేమి వల్ల మార్కులు తగ్గితే అలంటి వారికి అవకాశం ఇవ్వడంలో తప్పేముంది?

కులం

కులాన్ని బట్టి రిజర్వేషన్లు తప్పే. కాని రాజ్యంగ నిర్మాణ సమయంలో ఉన్న సమాజిక పరిస్థిని బట్టి చూస్తే అది న్యాయమే. నిమ్నకులాలలో అప్పుడు ఉన్నవారు అరుదు. ఒకవేళ ఉన్నా అటువాంటివారు కూడ రాజ్యంగ రక్షణ లేనిదే ఏ పదవీ సాధించలేని దుర్గతి. సాధించినా పని చేయడానికి ప్రతి చోటా అగ్రకులాల వారి అవమానాలు పని చేయనివ్వవు. అదీగాక కొన్ని ఏళ్ళ తర్వాత రిజర్వేషన్లు ఉండకూడదనేది వారి ఆలోచన. ఇప్పుడు పరిస్థుల్లో చాలా మార్పులు వచ్చాయి, కనీసం పట్టణాల్లో అయినా కులాన్ని బట్టి అవమానించడం (నాకు తెలిసి) లేదు. బహుశా ఇది సరైన సమయం కులాల ఆధారిత రిజర్వేషన్లు కాకుండా ఆర్థికాధారిత రిజర్వేషన్లు అమలు చేయడం.

రాజకీయం

నిమ్నకులాల్ని, వెనుక బడ్డ కులాల్ని ఉద్దరించడం ఇప్పటి ఏ రాజకీయనాయకుడి అభిమతమూ కాదు. తద్వారా వారి ఓట్లకు గాలం వేయదమే వారి పని.

ప్రతి ఒక్కడు ఆ పేరుతో స్వలాభం చూసుకునేవాడే.

సంస్కరణ

ప్రస్తుత రిజర్వేషన్ల విధానం అంతగా ఫలాల్ని అందిచడం లేదు. వీటిని తప్పక సంస్కరించాలి. ఆ మద్య ఒకాయన పాయింట్ల పద్దతిని సూచించాడు. అది నాకు బాగా నచ్చింది. ఈ పద్దతి ప్రకారం ఆర్థికంగా వెనుకబడ్డందుకు కొన్ని points, నిమ్న కులం అయినందుకు కొన్ని points, స్త్రీ అయినందుకు కొన్ని points, వచ్చిన మార్కులని బట్టి కొన్ని ఇలా మార్కులు ఇస్తారు.

అయితే ఇందులో ఏ ప్రయోగం చేయాలన్నా చాలా సాహసం కావాలి.

చివరి మాట

కులాన్ని బట్టి రిజర్వేషన్లకు నేను వ్యతిరేకినే అయినా ద్వేషిని కాదు. ఎందుకంటే కులాన్ని బట్టి రిజర్వేషను మన సమాజంలో మనువునుండీ వస్తున్న పద్దతి. ఇప్పటికీ దాన్ని సమర్థించేవాళ్ళెందరో ఉన్నారు.

క్షత్రియ వంశములో పుట్టినవాడే రాజు కావాలి.

బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడే పురోహితుడు కావాలి.

వైశ్యుడే వ్యాపారం చేయాలి.

కుమ్మరే కుండలు చేయాలి.

కమ్మరే కమ్మలి పని చేయాలి.

చాకలే గుడ్డలు ఉతకాలి.

మాదిగే చెప్పులు కుట్టాలి.

ఇలాంటివి ఎన్నో అనాదినుండీ కుల రిజర్వేష్న్లుండగా ఇప్పుడు మాత్రమే వాటికి విరుద్దంగా ఇన్ని ఆవేశాలు, ప్రదర్సనలు ఎందుకు?

ఇంతకు ముందెప్పుడైనా మనం కుల రిజర్వేషన్లు ఒద్దని పోరాటం చేశామా? తెలివిలేని దద్దమ్మైనా రాజుకు మొదటి కొడుకైనందుకు రాజ్యాన్ని కట్టబెట్టి అదీ సంప్రదాయమని ఊరుకోలేదా?

తరతరాలుగా నిమ్నకులమని, అంటరానివాడని ప్రతిభ వున్నవాన్ని కుడా వెలివేసి ఊరికి దూరంగా జంతువుకంటే హీనంగా చూసిన పాపానికి ఈనాడు ఇలా ప్రయశ్చిత్తం చేసుకుంటున్నామని అనుకుంటే కొంతైనా ఆత్మతృప్తి లభించదా?

రిజర్వెషన్లు వద్దని గర్జించే మీలో ఎంతమంది ఈరోజు కూడా పల్లెల్లో దళితుడి ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగగాలరు? దలితున్ని మీ ఇంటి లోగలికి అహ్వానించి అన్నం పెట్టగలరు? ఈ రిజర్వేషన్ల మూలంగా సర్పంచులూ, MLA లూ, MP లూ అయిన ఎంతమంది అగ్రకులపు అదిపత్యాన్ని కాదని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు?

నా దేశం చంద్రుడి మీద మనిషిని నిలపక పోయినా ఫర్వాలేదు, దళితున్ని సమాన గౌరవంతో అగ్రకులపోని సరసన నిలిపితే చాలు.

అణుపాటవమున్న దేశంగా నా దేశానికి గౌరవం లేకపోయినా ఫర్వాలేదు, అబలపై నిమిశానికో అత్యాచారం లేకుంటే చాలు.

ఖజానా నిండ విదేశీమారకద్రవ్యము లేకున్నా ఫరవాలేదు, ఆకలితో చావని ఒక రోజున్నా చాలు.

— ప్రసాద్

చిరంజీవి తాగుతాడుగా!

జూన్ 19, 2006


మా మూడేళ్ళ అమ్మాయి మళ్ళీ నన్ను నిర్ఘాతపోయేట్లు చేసింది.
మొన్న ఒక indian grocery store లో mango lassi తీసుకుందామని చూస్తున్నాను. మా అమ్మాయి నాకది ఒద్దు, pepsi కావాలంది పక్కనే ఉన్న bottle చూపిస్తూ. "ఒద్దమ్మా అది తాగకూడదు మంచిది కాదు" అన్నాను.
"మరి చిరంజీవి తాగుతాడుగా" అన్నది వెంటనే. దానికేమనాలో నాకు వెంటనే తోచలేదు. ..ఇప్పుడు కూడా ఏమీ తోచట్లేదు.

గమనాగమనం — gamanAgamanM

జూన్ 16, 2006

ఆలూరి భుజంగరావు గారి "గమనాగమనం" నుండీ కొన్ని పేరాలు.

కర్నూలు జిల్లాలోని ఒక ఊరిలో తను చుసిన దృశ్యం.
"
… ఆ గ్రామంలో తరచూ కనబడే దృశ్యం.
అక్కడి ప్రజలు మొగవాళ్ళు వారానికి రెండు మార్లు స్నానం చేస్తారు. ఆడవారు ఒక్కమారు స్నానం చేస్తారు. తండ్రి తొట్లో నిలబడి నీళ్ళు పోసుకుంటాడు. కొడుకు తండ్రి పోసుకున్న నీళ్ళు తనమీద పడేట్లు వంగుంటాడు. తండ్రి తన వళ్ళు తోముకుంటూ నీళ్ళు పోసుకొని కొడుకు వళ్ళూ కడుగుతాడు. ఆ మొత్తం నీళ్ళు తొట్లో పడగా పశువులకు పెడతారు. అక్కడి నీటి కరువుకు ఇది ఒక ఉదాహరణ.
"

కాయకష్టం చేసినా కడుపుకింత తినడానికీ, కంటికింత నిద్ర పోవటానికీ లేని దరిద్రపు ఆనవాళ్ళు ఎలావుంటాయో చూడండి.
"యుద్దపు సమయంలో గడియారాల్లో సమయాన్ని ఒక గంట ముందుకు తిప్పారు. అలా ముందుకు తిప్పబడ్డ సమయం ప్రకారం తెల్లవారుజామున మూడుగంటలకు నిద్రలేచి, చాకిరికి నడుం వంచి, ఐదు గంటల వరకూ పని చేసాక అప్పుడు రెంటికి పోవటనికి కొద్ది అవకాశాన్నిచ్చేవారు. అప్పటికి చచ్చే బడలిక, అలసట, నిద్ర మత్తు ఆవరించేవి నన్ను. నేరుగా మూడు కాలవలకు దొడ్డికి వెళ్ళినవాన్ని పాతవంతెన మీద ఆపళంగా పడి నిద్రపోయేవాడిని! మూడు కాలువల్లో మధ్య కాలువ వంతెన కొంచెం వెడల్పుగా వుంటుంది. మనిషి అటూ ఇటూ పొర్లకపోతే దానిమీద పడుకోవచ్చును. ఐతే నిద్రలో ఇటు దొర్లితే రోడ్డుమీద పడతాను; ఏ గుర్రబ్బండో, రిక్షానో మీదుగా వెళ్ళిపోయే ప్రమాదం వుంది. ఇంక అటు దొర్లితే నేరుగా కాలువలోనే పడిపోతాను. ఐనా, నిద్రలేమిని భరించలేక సంవత్సరాల తరబడి ఆ వంతెన మీద పడి నిద్ర పోయాను."

మానవత్వం మరిచి మనిషి చేసే వికృత చర్యలు యివి.
"నేనూ, ప్రకాశం – ఉపద్రష్ట వారి హోటల్ని కొనుక్కున్న చావలినివాసి పిచ్చయ్య హోటల్లో పనిచేస్తున్నాం. అదే హోటల్లో పనిచేసే పతికేళ్ళ యువకుడొకడు రోజూ సరుకులు పట్టుకొచ్చేవాడు బజార్నుండి. అలా తేవడంలో బేడో – పావలో మిగుల్చుకునేవాడు. ఈ విషయం ఎలాగో యజమానికి తెల్సింది. ఇంక ఆయువకుణ్ణి మేడమీద గదిలో పడేసి, మూడురోజులు అన్నం – నీరు ఇవ్వకుందా అమానుషంగా హింసించి నాలుగవరోజు పొద్దూకు మాట్ల గుడ్డలన్నీ వలిచేసి దిశమొలతో బైటకు నెట్టేశారు. ఇంక అక్కడుంటే చంపుతారన్న ప్రాణభీతితో దిశమొలతో, క్రిక్కిరిసిన నడిబజార్లో అతడు పరుగెత్తికెళ్ళిపోవడం ఈనాటికీ – మానసవీధిలో స్పష్టంగా చూడగలుగుతున్నాను."

వున్నవాడికి వస్తువు విలువ తెలీదు. వున్నవాడికి పనికిరాని వస్తువు కూడా లేనివానికి ఎంతో విలువైనదవుతుంది.
"చివరికి ఎలాగైతే యేం – ఓ ఉపాయం తట్టింది! ఒక రోజు సాయంకాలం నేనూ నటరాజన్ రత్నాటాకీస్ దగ్గరకు వెళుతున్నాము. వాడు తెలుగు కథల్ని గురించి చెప్తూ నడుస్తున్నాడు. నేను వింటూ నడుస్తున్నాను. నడుస్తున్నవాణ్ణి, రోడ్డు మీద పడెసి వున్న చార్‌మినార్ సిగిరెట్ పెట్టెను – ఖాళీదాన్ని – చూసి ఆగిపోయాను. వంగి దాన్ని తీసుకున్నాను; అలాంటి ఖాళీపేట్టెల లోపలిభాగం రాసుకోవటానికి వీలుగా ఉంటుందనిపించి! "ఎందుకురా అది?" అడిగాడు వాడు. ఖాళీపెట్టెను చించి పొడవుగా చేసి లోపలి భాగాన్ని చూపుతూ " దీనిమీద గురువుగారు చెప్పిన అర్థాల్ని – నోట్సునూ రాసుకుంటాను!" అన్నాను."

ఇంకా ఇలా ఎన్నో అలనాటి దృశ్యాల్ని వివరిస్తారు ఆలూరి భుజంగరావు గారు. ఇవి ఇప్పటికీ ఎన్నో కుటుంబాలలో సర్వ సాధారణమైనవి. చిన్నప్ట్నుంచీ మయని బట్టలు వేసి, ఆకలి అంటే తెలియకుండా పెరిగిన ప్రతి ఒక్కరూ సాటి బీదవారు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవాలంటే ఇలాంటి రచనల్ని చదవాలి.
టాగూర్ గీతాంజలి, చలం ప్రేమలేఖలూ చదివాలి కాని బీదవాడి జీవితాన్ని చదవటమే, బీదవాడికి సహాయం చేయటమే అసలైన దేవతారాధన, సాహిత్యారాధన. అదే సిద్దికీ మోక్షానికీ ఏకైక మార్గము.