అంజాన్

(రచయిత అనుమతితో నాకు బాగా నచ్చిన కవిత “సందుక” నుండి)

తలపై
రెండు నిండు మట్టికుండలతో

అరచేతుల్లో
ఎగరడానికి సిద్దంగా ఉన్న పక్షిపిల్లలతో

దూదిమబ్బుల
నీలినీటి ఆకాశం తెరలపైన తేలుతూ

పేగు తెంచుకున్న నేల మీద
పెంచుకున్న ఎనలేని ప్రేమతో
రాలాను…

విమానం కిటికీల్లోంచి
కింద
వంటి మీద
కొత్త కొత్త నగల్తో కొత్త కొత్త వలువలతో
కొంగ్రొత్త చూపుల్తో
నా నగరం…

నా ఆదిమ ప్రేయసి!

నాకోసం నిద్రమాని
‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నా.

తెగిపోయిన నా రెక్కల్ని
సుతిమెత్తని చేతులతో నిమిరి
నా భుజాలకు అతికిస్తుందనుకున్నా.

నేను మోసుకొచ్చినవన్నీ
తనివితీరా తడిమి
అతి జాగ్రత్తగా
చీరకొంగులో పొదుపుకుంటుందనుకున్నా.

ఏడేళ్ళ నవ్వుల్నీ
పచ్చి నెత్తుటి కన్నీరు మరకలనీ
కాళ్ళ కింద నలిగిపోయిన పసిరెక్కలనీ
వాడిపోయిన కళ్ళనీ వేలాదిగా రాలిపోయిన పూలరెమ్మలనీ
ఏకబిగిన ఏకరువు పెట్టి ఊపిరాడనీయదనుకున్నా!

నేలకు దిగిన విమానంలా
వంటరిగా దిగాలుగా
నేను

నా ప్రేయసి
నా ముందు నుంచే హడవుడిగా
అటు ఇటూ నడిచిపోయింది.

ఊరుకులతో పరుగులతో
నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో
నేను పోల్చుకోలేని మూఖాల మెరుపులతో
సరసరా జారిపోయింది.

నావైపు చూసే తీరికలేదు
చూసినా గుర్తుపట్టలేదు.
అర్ధరాత్రి వర్షపు చీకట్లో పారేసుకున్న
ఉంగరంలా
జరజరా దొర్లిపోయింది.

యుగాలుగా
తన ఎడతెరిపి లేని దుఃఖ బీభత్స ప్రేమ ప్రవాహంలో
మునిగిన నన్ను
ఏడేళ్ళ ఎదబాటుతోనే పూర్తిగా మర్చిపోయింది.

నా ఊపిరి తేమలోని వెచ్చదనాన్నీ
నా పెదవుల ముద్దులోని ఉప్పదనాన్నీ
నా కౌగిలింతలోని చెమటవాసననీ

తానెన్నడూ ఎరగనట్టే
ఎడమొఖమై అంజాన్ కొట్టింది

నేనే మనసుండబట్టలేక
గ్యాపకాల సుడిగాలులతో పిలిచినా
రెండు చేతులూ విరగబూసి చాచినా
ఎవరు నువ్వు అన్నట్లుగా
ఎకసెక్కెపు చూపుల్ని విసిరి పారేసింది.

మట్టినీటి కుండలు పగిలి
రెక్కలు రాని పక్షి ఈకలు చెదిరి
నేల మీద కలలను ఏరుకుంటున్న
నన్ను

దారికడ్డం లెమ్మంటూ
నూకేసి విసవిసా పోయింది.

నిలువునా తడిసి ముద్దైన నేను

స్పర్ష మరిచిన
ప్రేయసి తడి లేని చూపుల ముందు

నాకు నేనే అజ్ఞబీని!

(రచన: నారాయణస్వామి)

 

 

ప్రత్యుత్తరమిమ్ము